అమెరికన్ అర్థ శాస్త్రవేత్తలు పాల్ మిల్ గ్రామ్ (72), రాబర్ట్ విల్సన్ (83) అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించారు. ఆర్థిక వ్యవస్థలు అత్యంత కీలకంగా భావించే వేలం పాటల ప్రక్రియను మెరుగుపరిచేందుకు వారు చేసిన కృషి, అన్వేషణకు వారికి ఈ బహుమతి ఉమ్మడిగా లభించింది. ప్రధానంగా టెలికాం కంపెనీలకు వాయుతరంగాలను (స్పెక్ర్టమ్) విక్రయించడంలో ఈ వేలం ప్రక్రియే ప్రధానం. అలాగే గూగుల్ అడ్వర్ టైజ్ మెంట్లను వేలం ప్రక్రియలోనే నిర్వహిస్తుంది. ఇద్దరు స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోనే పని చేస్తున్నారు. పైగా ఒకప్పుడు మిల్ గ్రామ్ కు పిహెచ్ డి అడ్వైజర్ గా రాబర్ట్ విల్సన్ ఉన్నారు. ఇద్దరూ ఇరుగుపొరుగువారే కావడం మరో విశేషం. వారు కనుగొన్న సిద్ధాంతం ప్రపంచ వ్యాప్తంగా విక్రేతలు, కొనుగోలుదారులు, పన్ను చెల్లింపుదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్టు నోబెల్ కమిటీ అవార్డును ప్రకటించిన సందర్భంగా తెలిపింది.
తనకు అత్యంత వినూత్నమైన విధానంలో ఈ వార్త అందిందని కాలిఫోర్నియా నుంచి మిల్ గ్రామ్ ఫోన్ లో చెప్పారు. బాబ్ విల్సన్ అనే వ్యక్తి తలుపు కొట్టి తాను అసోసియేటెడ్ ప్రెస్ ప్రతినిధినని చెబుతూ తమకు నోబెల్ బహుమతి వచ్చిన విషయం తెలియచేసినట్టు ఆయన వెల్లడించారు. తన విద్యార్థులు, మిత్రులు, సహచరులు అందరూ తామిద్దరం నోబెల్ బహుమతికి అర్హులమని చెబుతూ ఉంటారని, వారందరి ఆదరాభిమానాలు, గౌరవం లభించడం అదృష్టమని ఆయన అన్నారు.
అత్యంత సంక్లిషమైన వేలం ప్రక్రియ మరింత సమర్థవంతంగా నిర్వహించడంపై వారిద్దరూ అధ్యయనం చేశారని కమిటీ తెలిపింది. నిజాయతీపరులైన బిడ్డర్లు అంచనా విలువ కన్నా తక్కువ విలువకు ఏ విధంగా బిడ్డింగ్ చేయవలసివస్తున్నదని విల్సన్ తన అధ్యయనం ద్వారా తెలియచేశారని పేర్కొంది. వారి కృషి ప్రధానంగా నగదు ఆధారంగానే సాగింది. కొన్ని ప్రభుత్వాలు నగదు లావాదేవీలకు అతీతంగా కూడా పని చేస్తాయి. ఉదాహరణకి కాలుష్య నివారణ కృషిలో భాగంగా హరిత రేటింగ్ సాధించిన కంపెనీలు క్రెడిట్లను వేలం వేసే ప్రక్రియ వల్ల కాలుష్యం వెదజల్లే కంపెనీలు వాటిని కొనుక్కుని లాభపడడం ఒక ఎత్తైతే సురక్షితమైన, వాతావరణానికి హానికరం కాని కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహం లభించడం మరో ఎత్తు. వారి కృషి ఫలితం ప్రపంచం అంతటా కనిపిస్తుంది. "ఆన్ లైన్ అడ్వర్ టైజ్ మెంట్లు కూడా వేలం ప్రక్రియలో విక్రయిస్తారని" ఆర్థిక పరిశోధనలను ట్రాక్ చేసే డేవిడ్ వార్ష్ తన బ్లాగ్ లో వ్యాఖ్యానించారు.
వారి సిద్ధాంతం ప్రధాన లక్ష్యం విక్రేతకు గరిష్ఠ ఆదాయం సమకూర్చడంతో పాటు సామాజిక లక్ష్యాలను కూడా సాధించేందుకు దోహదపడుతుందని నోబెల్ కమిటీ సభ్యుడు ఇంగ్రిడ్ వెర్నర్ అన్నారు. ప్రధానంగా వేలం ప్రక్రియలో విజేతలుగా నిలిచినప్పటికీ మోసపోయే స్థితి రావడం ఒక ప్రధాన సమస్య. కొనుగోలుదారులు వేలం ప్రక్రియలోకి ప్రవేశించడంలో భాగంగా కొన్నినకిలీ బిడ్లను ప్రవేశపెడతారు. ఆ బిడ్ల విలువ ఎంతో తెలియని అయోమయ స్థితిలో ఇతరులు తమ బిడ్డింగ్ ధర ప్రకటించాల్సి ఉంటుంది. తాము వాస్తవ ధర కన్నా ఎక్కువ చెల్లిస్తున్నామా అనే ఆందోళన కూడా వారికి పరిపాటి. అయినా తమ ఆఫర్ ను తగ్గించుకుంటూ వారు స్పందించాల్సి ఉంటుంది. కొందరు బిడ్డర్ల వద్ద ఇతరుల కన్నా ఎక్కువ సమాచారం ఉన్న వాతావరణంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. దీనికి విల్సన్, మిల్ గ్రామ్ తమ పరిశోధన ద్వారా ఒక పరిష్కారం చూపించారు. ఇందుకోసం వారు "స్నేక్ ఇన్ ద గ్రాస్ స్ర్టాటజీ" (గడ్డిలో పాము వ్యూహం) ప్రతిపాదించారు. ఈ విధానం కింద ఏదైనా వస్తువుపై ఆసక్తి ఉన్న కంపెనీ తన ఆసక్తిని బట్టబయలు చేయకుండానే చివరి క్షణంలో గెలుపు అవకాశం ఉన్న బిడ్ వేయడం ఈ వ్యూహంలో ప్రధానం. మొబైల్ ఫోన్ కాల్స్ నుంచి ఇంటర్నెట్ చెల్లింపుల వరకు అన్నింటికీ కీలకమైన సేవలందించే టెలికాం కంపెనీలు ప్రభుత్వం విక్రయించే రేడియో తరంగాలను కొనుగోలు చేసే ప్రక్రియపై దీని ప్రభావం అధికంగా ఉన్నట్టు చెబుతున్నారు. 1990 దశకానికి ముందు కాలంలో ఫ్రీక్వెన్సీలు విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం అందాల పోటీలు కూడా నిర్వహించేది. లైసెన్సు కోసం పోటీ పడే కంపెనీలు ఇందులో పాల్గొనేవి. ఈ ప్రక్రియలో లాబీయింగ్ అధికంగా జరిగే అవకాశం కలిగినా అది ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఆదాయాలను పెంచలేదు. చివరికి 1994 సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం వేలం ప్రక్రియ ప్రారంభించింది. మిల్ గ్రామ్, విల్సన్ (ప్రస్తుతం గూగుల్ తో పని చేస్తున్న ప్రెస్టన్ మెకాఫీ సహాయంతో) అన్ని లైసెన్సులు ఒకే సారి విక్రయించే వేలం ప్రక్రియను డిజైన్ చేశారు. ముందుగా తాము ఫ్రీక్వెన్సీలను కొనుగోలు చేసి వాటిని టెలికాం కంపెనీలకు విక్రయించే స్పెక్యులేటర్ల ప్రవేశాన్ని ఈ ప్రక్రియ నిరుత్సాహపరిచింది. అప్పటి వేలం ప్రక్రియలో ఖజానాకు 61.7 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరింది. తదుపరి దశలో కెనడా, భారత్ వంటి దేశాలు కూడా ఈ వేలం ప్రక్రియ అవలంబించాయి. తొలుత టెలికాం తరంగాలకే పరిమితం అయిన ఈ వేలం విధానం తదుపరి దశలో విద్యుత్, సహజ వాయువులకు కూడా విస్తరించింది. వాస్తవానికి నోబెల్ బహుమతి గెలుచుకునే సమయం దాటిపోయిందని తాను భావించినట్టు విల్సన్ స్టాక్ హోమ్ నుంచి ఫోన్ లో మాట్లాడుతూ చెప్పారు. వాస్తవానికి ఈ వేలం ప్రక్రియ అంతటికీ తన మేథస్సును జోడించి మెరుగులు దిద్దిన మేథావి మిల్ గ్రామ్ అని ఆయన అన్నారు.
No comments:
Post a Comment