Friday, April 9, 2021

2020-21 సంవ‌త్స‌రంలో ఆర్థిక రంగం

ప‌న్ను వ‌సూళ్లు రూ.9.45 ల‌క్ష‌ల కోట్లు
స‌వ‌రించిన అంచ‌నాల‌ను మించాయి


దేశంలో ఆదాయ‌పు ప‌న్ను, కార్పొరేట్ ప‌న్నులు గ‌త మార్చి 31వ తేదీతో ముగిసిన ఏడాది కాలంలో స‌వరించిన అంచ‌నాల‌ను మించి ఉన్నాయి. 2021-22 సంవ‌త్స‌రానికి ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌తిపాదించిన బ‌డ్జెట్ లో ప‌న్ను వ‌సూళ్లు రూ.9.05 ల‌క్ష‌ల కోట్లుండ‌వ‌చ్చున‌ని మార్చి 31వ తేదీ నాటికి రూ.9.45 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు వ‌సూల‌య్యాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అంటే స‌వ‌రించిన ల‌క్ష్యం క‌న్నా 5 శాతం  ఎక్కువ. కాని 2019-20 సంవ‌త్స‌రంలో వ‌సూళ్లు రూ.13.19 ల‌క్ష‌ల కోట్ల క‌న్నా 10 శాతం త‌క్కువ‌. ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి మొద‌లైన కొత్త ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.11.08 కోట్ల ప‌న్ను వ‌సూళ్ల ల‌క్ష్యాన్ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 2020-21ఆర్థిక సంవ‌త్స‌రంలో నిక‌రంగా కార్పొరేట్‌ప‌న్ను వ‌సూళ్లు రూ.4.57 ల‌క్ష‌ల కోట్లు కాగా ఆదాయ‌పు ప‌న్ను వ‌సూళ్లు రూ.4.71 ల‌క్ష‌ల కోట్లున్నాయి. ఇవి కాకుండా సెక్యూరిటీల లావాదేవీల ప‌న్ను రూపంలో రూ.16,927 కోట్లు. వాస్త‌వానికి ఏడాది మొత్తం మీద స్థూల వ‌సూళ్లు రూ.12.06 ల‌క్ష‌ల కోట్లు కాగా రూ.2.61 ల‌క్ష‌ల కోట్ల రిఫండ్లు మిన‌హాయించ‌గా నిక‌ర వ‌సూళ్లు రూ.9.45 ల‌క్ష‌ల కోట్లున్నాయి. గ‌త ఏడాది రిఫండ్ల‌లో 42 శాతం వృద్ధి న‌మోద‌యింది. 
----------------------------------
మార్చిలో జిఎస్ టి వ‌సూళ్ల చారిత్ర‌క రికార్డు
దేశంలో జిఎస్ టి వ‌సూళ్లు వ‌రుస‌గా ఆరు నెల‌లుగా ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌ను దాటి ఉన్నాయి. 2021 మార్చిలో 27 శాతం పెరిగి రూ.1.23 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరాయి. ఇందులో సెంట్ర‌ల్ జిఎస్ టి రూ.22,973 కోట్లు కాగా ఇంటిగ్రేటెడ్ జిఎస్ టి రూ.62,842 కోట్లు, సెస్ రూ.8757 కోట్లున్నాయి. దేశంలో జిఎస్ టి ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత గ‌రిష్ఠ వ‌సూలు ఇదే. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా 2020 ఏప్రిల్ లో రికార్డు క‌నిష్ఠ స్థాయి రూ.32,172 కోట్లు వ‌సూళ్లు న‌మోద‌య్యాయి.
 
నెల‌లవారీగా వ‌సూళ్ల వివ‌రాలు
2021
మార్చి - రూ.1.23 ల‌క్ష‌ల కోట్లు
ఫిబ్ర‌వ‌రి - రూ.1.13 ల‌క్ష‌ల కోట్లు
జ‌న‌వ‌రి - రూ.1.19 ల‌క్ష‌ల కోట్లు
2020
డిసెంబ‌ర్ - రూ.1.15 ల‌క్ష‌ల కోట్లు
న‌వంబ‌ర్ - రూ.1.04 ల‌క్ష‌ల కోట్లు
అక్టోబ‌ర్ - రూ.1.05 ల‌క్ష‌ల కోట్లు
సెప్టెంబ‌ర్ - రూ.95,480 కోట్లు
ఆగ‌స్టు - రూ.86,449 కోట్లు
జూలై - రూ.87,422 కోట్లు
జూన్ - రూ.90,917 కోట్లు
మే - రూ.62,151 కోట్లు
ఏప్రిల్ - రూ.32,172 కోట్లు
------------------------------ 
ఎంఎఫ్ ఆస్తులు 41 శాతం జంప్‌
2021 ఆర్థిక సంవ‌త్స‌రంలో దేశంలోని మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌లోని ఆస్తులు 41 శాతం పెరిగి రూ.31.43 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరాయి. అయితే మార్చి నెల‌లో అవి ఒక శాతం త‌గ్గాయి.  ఏడాది మొత్తం మీద ఎంఎఫ్ సంస్థ‌ల్లోకి రూ.2.09 ల‌క్ష‌ల కోట్ల విలువ గ‌ల నిధులు వ‌చ్చాయి. మార్చి నెల‌లో ఓపెన్ ఎండెడ్ డెట్ ఫండ్స్ నుంచి రూ.52,528 కోట్లు, లిక్విడ్ ఫండ్ల నుంచి రూ.19,834 కోట్లు, స్వ‌ల్ప వ్య‌వ‌ధి ఫండ్ల నుంచి రూ.15,847 కోట్లు ఉప‌సంహ‌రించారు.
--------------------------------  
ఇంధ‌న డిమాండులో 9.1% క్షీణ‌త‌
మార్చి 31వ తేదీతో ముగిసిన 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల దేశంలో ఇంధ‌నం డిమాండు 9.1 శాతం ప‌డిపోయింది. క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన సుదీర్ఘ లాక్ డౌన్ ప్ర‌భావం వ‌ల్ల ఏడాది మొత్తంలో 19.46 కోట్ల ట‌న్నుల ఇంధ‌నం ఉప‌యోగించుకుంది. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇంధ‌న వినియోగం 21.41 కోట్ల ట‌న్నులుంది. 1998-99 ఆర్థిక సంవ‌త్స‌రం త‌ర్వాత ఇంధ‌న వినియోగం క్షీణించ‌డం ఇదే ప్ర‌థ‌మం. డీజిల్ వినియోగం గ‌రిష్ఠంగా 12 శాతం క్షీణించి 7.37 ల‌క్ష‌ల ట‌న్నుల‌కు ప‌డిపోగా పెట్రోల్ వినియోగం 6.7 శాతం క్షీణించి 2.79 ల‌క్ష‌ల ట‌న్నుల‌కు ప‌రిమితం అయింది. ఒక్క ఎల్ పిజి వినియోగం మాత్రం 4.7 శాతం పెరిగి 2.76 ల‌క్ష‌ల ట‌న్నుల‌కు చేరింది.
------------------------------ 
రూ.90 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన ఇన్వెస్ట‌ర్ల సంప‌ద‌
2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఈక్విటీ మార్కెట్ దూసుకుపోవ‌డంతో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద 90,82,057.95 కోట్ల మేర‌కు పెరిగింది. క‌రోనా సంక్లిష్ట‌త‌ల మ‌ధ్య‌న కూడా అసాధార‌ణ  ర్యాలీ చోటు చేసుకున్న‌ ఏడాది మొత్తంలో సెన్సెక్స్ 68 శాతం (20,040.66 పాయింట్లు) పెర‌గ‌డం ఇందుకు దోహ‌ద‌ప‌డింది. నిఫ్టీ 70.86 శాతం (6092.95 పాయింట్లు) లాభ‌ప‌డింది.  2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో మార్కెట్లు భారీ ఎగుడుదిగుడులు చ‌వి చూస్తాయ‌న్న‌ విశ్లేష‌కుల అంచ‌నాల‌కు భిన్నంగా  ద్వితీయార్ధంలో ఈక్విటీ మార్కెట్లు మంచి దూకుడును ప్ర‌ద‌ర్శించాయి. దీంతో 2019-20తో పోల్చితే బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.2,04,30,814.54 కోట్ల‌కు పెరిగింది. 2021 మార్చిలో మార్కెట్ విలువ చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయి రూ.2,10,22,227.15 కోట్ల‌కు చేరింది. 2019-20 సంవ‌త్స‌రంలో సెన్సెక్స్ 9204.42 పాయింట్లు క్షీణించింది. మార్కెట్ విలువ‌లో రిల‌య‌న్స్ ఇండ‌స్ర్టీస్ (రూ.12,69,917.01 కోట్లు) అగ్ర‌స్థానంలో ఉండ‌గా టిసిఎస్ (రూ.11,75,410.56 కోట్లు), హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ (రూ.8,23,360.73 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.5,82,751.89 కోట్లు), హెచ్ యుఎల్ (రూ,5,71,132.95 కోట్లు) త‌దుప‌రి స్థానాల్లో ఉన్నాయి. 

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...