"భారత వారెన్ బఫెట్"గా ప్రఖ్యాతి గడించిన స్టాక్ మార్కెట్ గురు రాకేష్ ఝున్ ఝున్ వాలా ఆదివారం ఉదయం కన్ను మూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. గత కొద్ది కాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతున్నారు. ఆయన డయాలసిస్ పై ఉన్నారు. ఇటీవలే ఆయనకు యాంజియోప్లాస్టీ కూడా జరిగింది. గత కొన్ని సందర్భాల్లో ఆయన వీల్ చెయిర్ లో కూచుని మాత్రమే ప్రజలకు కనిపించారు. తాను ఎంతో ఇష్టపడి ప్రారంభించిన ఆకాశా ఎయిర్ ప్రారంభోత్సవ వేడుకల్లో కూడా వీల్ చెయిర్ లోనే దర్శనమిచ్చారు. ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కాని అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఆకస్మిక గుండెపోటు కారణంగానే ఆయన మరణించినట్టు వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చారు. రాకేష్ కు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ఇన్వెస్టర్, వ్యాపారవేత్త, ట్రేడర్ అయిన ఝున్ ఝున్ వాలా బిగ్ బుల్ గా ప్రఖ్యాతి గడించారు. 5.8 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన దేశంలో 36వ సంపన్న భారతీయుడుగా ఫోర్బ్స్ 2021లో ప్రకటించింది. ఆదాయపు పన్ను శాఖ అధికారి కుమారుడైన రాకేష్ స్వయంగా చార్టర్డ్ అకౌంటెంట్.
రూ.5 వేలతో ఈక్విటీల్లో అడుగు
కేవలం రూ.5 వేల పెట్టుబడితో రాకేష్ ఝున్ ఝున్ వాలా ఈక్విటీ మార్కెట్ ప్రయాణం ప్రారంభించారు. తన తండ్రి పెట్టుబడులు సమతూకం చేయడం గమనించిన తనకు బాల్యదశ నుంచే ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులపై ఆసక్తి ఏర్పడిందని ఝున్ ఝున్ వాలా ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో తెలిపారు. కేవలం 25 సంవత్సరాల వయసులో 1985లో ఆయన తొలి పెట్టుబడి పెట్టారు. ఆ డబ్బు కూడా తన బంధువు నుంచి అప్పుగా తెచ్చుకున్నారు. ఆయన పెట్టుబడిని ప్రారంభించే సమయానికి బిఎస్ఇ సెన్సెక్స్ 150 పాయింట్లుంది. ఇప్పుడది 60000 సమీపంలో ట్రేడవుతోంది. పెట్టుబడుల్లో రిస్క్ తీసుకోగల స్వభావం కీలకమని, ప్రతీ ఒక్కరూ అందుకు సిద్ధమై రంగంలోకి రావాలని ఆయన సలహా ఇస్తారు. ఎప్పుడూ విజయపథంలో ఉన్న షేర్లను ఎంపిక చేసుకుంటూ ఆయన మార్కెట్ గురుగా ఎదిగారు. 36కి పైగా కంపెనీల్లో ఆయన పెట్టుబడులున్నాయి. వాటిలో గడియారాలు, ఆభరణాల తయారీ కంపెనీ, టాటా గ్రూప్ కంపెనీల్లో ఒకటైన టైటాన్ పెట్టుబడి కీలకమైనది. టైటాన్ లో ఆయనకు గల 5.05 శాతం పెట్టుబడుల విలువ రూ.11 వేల కోట్లు. ఆప్టెక్ లో ఆయన గరిష్ఠ పెట్టుబడి (23.37 శాతం వాటా) కాగా స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ (17.49 శాతం), మెట్రో బ్రాండ్స్ (14.43 శాతం), ఎన్ సిసి లిమిటెడ్ (2.62 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తొలి పెట్టుబడితోనే లాభం
1986లో ఆయన ఈక్విటీ మార్కెట్ పెట్టుబడుల నుంచి భారీ లాభం అందుకున్నారు. టాటా టీకి చెందిన 5000 షేర్లు రూ.43 ధరలో కొనగా మూడు నెలల్లోనే ఆ స్ర్కిప్ రూ.143కి చేరింది. కేవలం మూడేళ్ల వ్యవధిలో ఆయన రూ.20 లక్షల నుంచి 25 లక్షలు ఆర్జించారు. ఆయనకు రేర్ ఎంటర్ ప్రైజ్ పేరిట స్టాక్ ట్రేడింగ్ కంపెనీ కూడా ఉంది. తన పేరులోని మొదటి రెండక్షరాలు రా, తన భార్య రేఖ పేరులోని తొలి రెండక్షరాలు ర్ తీసుకుని కంపెనీ పేరు పెట్టుకున్నారు. రేఖ కూడా స్వయంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్.
ఝున్ ఝున్ వాలా పెట్టుబడులున్న కంపెనీలివే...
స్టార్ హెల్త్, రాలీస్ ఇండియా, కెనరాబ్యాంక్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, ఆగ్రోటెక్ ఫుడ్స్, నజారా టెక్నాలజీస్, టాటా మోటార్స్.
మీడియా, ఆప్టెక్ కంపెనీలకు చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రొవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల్లో బోర్డుల్లో ఆయన డైరెక్టర్ గా ఉన్నారు.
బాల్యం, విద్యాభ్యాసం
ఝున్ ఝున్ వాలా 1960 జూలై 5వ తేదీన ఒక రాజస్తానీ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ గా పని చేశారు. సిడెన్ హామ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో ఎన్ రోల్ అయ్యారు.
No comments:
Post a Comment