టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్ర్తీ (54) రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలయ్యారు. ఆదివారం మధ్యాన్నం 3 గంటల 15 నిముషాల సమయంలో మహారాష్ట్రలోని పహల్గార్ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు రోడ్డు డివైడర్ ని డీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కారులో ఆయనతో పాటు మరో ముగ్గురు కూడా ప్రయాణిస్తున్నారు. వారిలో కూడా జహంగీర్ పండోల్ అనే వ్యక్తి ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. అయితే డ్రైవర్ అన్యాతా పండోల్, మరో వ్యక్తి దార్యుస్ పండోల్ తీవ్రంగా గాయపడడంతో చికిత్సకోసం గుజరాత్ లోని వాపి ఆస్పత్రికి తరలించారు. మిస్ర్తీ షాపుర్జీ పల్లోంజి గ్రూప్ కంపెనీల అధిపతిగా ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి తిరిగి వస్తుండగా సూర్య నదిపై వంతెన మీద ఈ ప్రమాదం సంభవించింది. ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పహల్గార్ జిల్లా సూపరింటెండెంట్ బాలా సాహెబ్ పాటిల్ ఈ ప్రమాదం వివరాలు తెలియచేశారు. మిస్ర్తీ ప్రయాణిస్తున్న లగ్జరీ కారు సూర్యా నదిపై డివైడర్ ను డీకొని రిటెన్షన్ గోడను డీకొట్టిందని కాసా పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు. సైరస్ మిస్ర్తీ, జహంగీర్ పండోల్ మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కాసా రూరల్ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.
మిస్త్రీ ఐరిష్ పౌరుడు
సైరస్ మిస్ర్తీ ఐరిష్ పౌరుడు. ముంబైలో పాఠశాల విద్య పూర్తయిన అనంతరం ఉన్నత విద్య కోసం యుకె వెళ్లారు. సివిల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ అనంతరం ఇంగ్లండ్ లో మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆయన తండ్రి పల్లోంజీ షాపుర్జీ మిస్ర్తీ రెండు నెలల క్రితమే మరణించారు. మిస్ర్తీ సోదరుడు షాపూర్ కూడా షాపుర్జీ పల్లోంజీ గ్రూప్ లో క్రియాశీలంగా ఉన్నారు.
No comments:
Post a Comment