అమెరికాలో నాలుగో వరుస పోటు
జడలు విచ్చి కరాళ నృత్యం చేస్తున్న ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడానికి అమెరికన్ ఫెడరల్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ భారీగా వడ్డీపోటు వేశాయి. అమెరికన్ ఫెడరల్ వడ్డీరేటును 0.75 శాతం పెంచింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఈ ఏడాది జూలై నుంచి వడ్డీరేటును 0.75 శాతం వంతున పెంచడం వరుసగా ఇది నాలుగో సారి. ఫలితంగా ఇప్పటివరకు 3-3.25 శాతం మధ్యన ఉన్న కనీస వడ్డీరేటు 3.75 శాతం నుంచి 4 శాతానికి చేరింది. 2008 తర్వాత అమెరికాలోవడ్డీరేటు ఇంత గరిష్ఠ స్థాయిలో ఉండడం ఇదే ప్రథమం. అయితే రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం తగ్గే ఆస్కారం ఉన్నందు వల్ల డిసెంబరు పాలసీలో వడ్డీరేటు పెంపు ఇంత భారీ స్థాయిలో ఉండకపోవచ్చునని అమెరికన్ ఫెడరల్ చీఫ్ జెరోమ్ పోవెల్ చెప్పారు.మూడు దశాబ్దాల్లో బీఓఈ భారీ వడ్డీపోటు
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కూడా వడ్డీరేటును 0.75 శాతం మేరకు పెంచింది. మూడు దశాబ్దాల కాలంలో (1992 తర్వాత) బిఓఇ ఇంత భారీగా వడ్డీరేటును పెంచడం ఇదే ప్రథమం. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో పాటు మాజీ ప్రధాని లిజ్ ట్రస్ తప్పుడు విధానాల దుష్ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు బిఓఇ ఈ చర్య తీసుకుంది. ఈ పెంపుతో ఇప్పుడు యుకెలో కనీస వడ్డీరేటు 3 శాతానికి చేరింది. తాము వడ్డీరేటును ఈ స్థాయిలో పెంచి ఉండకపోతే ద్రవ్యోల్బణం మరింత తీవ్రస్థాయికి పెరిగిపోతుందని బీఓఈ గవర్నర్ ఆండ్రూ బెయిలీ అన్నారు. బ్రిటన్ లో ప్రస్తుతం ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్ఠ స్థాయిలో కదలాడుతోంది. ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం కోసం బిఓఇ గత ఎనిమిది విడతలుగా వడ్డీరేట్లు పెంచుకుంటూ వస్తోంది. సరిగ్గా ఒకటిన్నర నెలల క్రితమే 0.50 శాతం పెంచింది. అయినా ద్రవ్యోల్బణం ఎక్కడా తగ్గుముఖం పడుతున్న సూచనలు లేకపోవడంతో వడ్డీరేటును మూడు దశాబ్దాల కాలంలో కనివిని ఎరుగనంత భారీగా పెంచింది.
సుదీర్ఘ మాంద్యం ముప్పు
బ్రిటన్ ప్రపంచంలోనే సుదీర్ఘ మాంద్యం అంచుల్లో ఉన్నట్టుగా భయపడుతున్న నేపథ్యంలో బిఓఇ ఈ చర్య తీసుకుంది. 2024 జూన్ నాటికి రెండు సంవత్సరాల కాలపరిమితి పాటు సాగే మాంద్యంలోకి ప్రవేశించనున్నట్టు జాతీయ గణాంకాల కార్యాలయం హెచ్చరిస్తోంది.. 1955 తర్వాత సుదీర్ఘ మాంద్యం ఇదే అవుతుంది. కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లను సుదీర్ఘ కాలం పాటు పెంచుతూ పోవడం మంచిది కాదనే విషయం అంగీకరిస్తున్నప్పటికీ ప్రస్తుతం నెలకొన్న అస్థిరతలు విధానకర్తలు "బలవంతంగా స్పందించేలా చేస్తున్నాయి" అని ఆండ్రూ బెయిలీ చెప్పారు.
ద్రవ్యోల్బణంతో కేంద్రబ్యాంకుల పోరాటం
సుమారుగా ప్రపంచ దేశాలన్నీ ద్రవ్యోల్బణంతో కుతకుతలాడిపోతున్నాయి. తమ చేతుల్లో లేని అంతర్జాతీయ పరిస్థితులే ప్రస్తుతం ద్రవ్యోల్బణం రెక్కలు విచ్చడానికి కారణం. అందులోనూ ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణంపై బ్యాంకుల కఠిన చర్యలు మరింత ఉదృతం అయ్యాయి. 2019 సంవత్సరంలో ప్రపంచంపై కోరలు సాచిన కొవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి దేశాలు కోలుకుంటున్న సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విరుచుకుపడింది. ఈ యుద్ధం కారణంగా ఏర్పడిన క్రూడాయిల్ కొరత, ఇతరత్రా సరఫరా లోపాల కారణంగా క్రూడాయిల్ ధరలు చుక్కలనంటాయి. దాని ప్రభావంతో ప్రపంచ దేశాల్లో నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. సెప్టెంబరు నెలలోనే యుకెలో ఆహార వస్తువుల ధరలు 14.6 శాతం పెరిగాయి. యుకెలో సహజవాయువు టోకు ధరలు కేవలం 12 నెలల కాలంలోనే ఐదు రెట్లు పెరిగిపోయాయి. దీనికి తోడు మాంసం, రొట్టె, పాలు, గుడ్ల ధరలు కూడా చుక్కలనంటాయి. వీటన్నింటి ప్రభావం వల్ల సగటు జీవి జీవితం దుర్భరంగా మారింది. ఆ రకంగా ధరలు ఆగస్టు నాటికి గరిష్ఠ స్థాయికి చేరినప్పటి నుంచి ఈ ధరలు 50 శాతం మేరకు తగ్గాయి. కాని రాబోయేది చలికాలం కావడం వల్ల గ్యాస్ ధరలు మరోసారి చుక్కలనంటే ప్రమాదం ఉంది. ఇవన్నీ బిఓఇ ఈ కఠిన చర్య తీసుకునేందుకు దోహదపడ్డాయి.
No comments:
Post a Comment