8 రోజుల్లో సెన్సెక్స్ 2139.35 పాయింట్లు అప్
రూ.289.88 లక్షల కోట్లకు ఇన్వెస్టర్ల సంపద
స్టాక్ మార్కెట్ వరుసగా 8 రోజులుగా ఇటీవలి కాలంలో కనివిని ఎరుగని ర్యాలీలో దూసుకుపోతోంది. బుధవారం కీలకమైన 63000 పాయింట్ల మైలురాయిని దాటిన సెన్సెక్స్ గురువారం నాడు కూడా అదే జోరును కొనసాగించి 184.54 పాయింట్ల లాభంతో జీవితకాల గరిష్ఠ స్థాయి 63284.19 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో కూడా 483.42 పాయింట్ల లాభంతో జీవితకాల గరిష్ఠ స్థాయి 63583.07కి దూసుకుపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 54.15 పాయింట్ల మేరకు లాభపడి జీవితకాల గరిష్ఠ స్థాయి 18812.50 వద్ద ముగిసింది. ఎనిమిది వరుస సెషన్లలో సెన్సెక్స్ 2139.35 పాయింట్లు లాభపడింది. అమెరికాలో వడ్డీరేట్ల పెంపులో జోరును తగ్గిస్తామని ఇటీవల ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ తెలియచేయడంతో పాటు భారతమార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల మోజు పెరగడం ఈ ర్యాలీకి కారణమని విశ్లేషకులంటున్నారు. గురువారం బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ 8,96,963.87 కోట్లు పెరిగి మార్కెట్ ముగిసే సమయానికి రూ.2,89,88,217.01 కోట్ల వద్ద ముగిసింది. బిఎస్ఇ మిడ్ క్యాప్ (0.62%), స్మాల్ క్యాప్ (0.63%) లాభపడ్డాయి. రంగాల వారీగా ఐటి (2.03%), రియల్టీ (1.94%), టెక్ (1.58%), కమోడిటీస్ (1.24%), ఇండస్ర్టియల్స్ (0.74%) లాభపడ్డాయి.
No comments:
Post a Comment