2024లో ఈక్విటీ మార్కెట్
కొత్త సంవత్సరంలో కూడా బుల్ జోరు కొనసాగుతుందని మార్కెట్ పండితులు భావిస్తున్నారు. 2023 సంవత్సరంలో సాగించిన జోరునే మార్కెట్ కొనసాగించి తీరుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉండడం, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్ ఫై దృష్టి సారించడం ఈక్విటీ మార్కెట్ జోరుకు దోహదపడే అంశాలని అంటున్నారు. ప్రపంచం మొత్తం భౌగోళిక రాజకీయ కల్లోలం దృష్ట్యా తీవ్ర నిరాశ నిస్పృహల్లో మునిగిపోయిన తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ప్రపంచంలో వేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవడం మరో సానుకూలత. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం (మొదటి త్రైమాసికం-7.8 శాతం; రెండో త్రైమాసికం-7.6 శాతం) వృద్ధిని నమోదు చేసింది. ద్రవ్యోల్బణం నవంబరులో 5.55 శాతానికి దిగి వచ్చింది. ఇది మరింతగా దిగి వచ్చినట్లయితే రిజర్వ్ బ్యాంక్ కీలక రేపో రేటును తగ్గించే అవకాశం ఉంది. ఇవన్నీ మార్కెట్ కు కలిసి వచ్చే అంశాలని విశ్లేషకులంటున్నారు. దేశంలో రాజకీయ స్థిరత్వం అన్నింటి కన్నా ప్రధానాంశం. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయాలు సాధించడం ఆ పార్టీని మరింత బలోపేతం చేసింది. 2024 ఏప్రిల్, మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అద్భుత విజయం సాధించి మూడో సారి అధికారం దక్కించుకోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులంటున్నారు. అదే జరిగితే 2024 సంవత్సరంలో మార్కెట్ మరింత ముందుకు దూసుకుపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సెన్సెక్స్. నిఫ్టీ 7 శాతం వృద్ధి సాధించడం ఖాయమంటున్నారు.
సిరులపంట పండించిన 2023...
ఈక్విటీ మార్కెట్ కు 2023 ఒక చారిత్రక సంవత్సరంగా నిలిచిపోతుంది. సంవత్సరంలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఇన్వెస్టర్ల ముంగిట సిరుల పంట పండింది. సంవత్సరంలో ఈక్విటీ మార్కెట్ జోరుతో ఇన్వెస్టర్ల సంపద 80.62 లక్షల కోట్లు పెరిగింది. ఏడాది ప్రథమార్థంలో ఈక్విటీ మార్కెట్ కాస్తంత మందకొడిగానే కనిపించినా ద్వితీయార్ధంలో మాత్రం రికార్డుల బాటలో దూసుకుపోయింది. అందులోనూ ఏడాది చివరి 9 త్రైమాసికాల్లో మరింత వేగం చోటు చేసుకుంది. 2023 సంవత్సరం మొత్తంలో సెన్సెక్స్ 11,399.52 పాయింట్లు లాభపడి 72082.64 వద్ద ముగిసింది. నిఫ్టీ 3626.10 పాయింట్లు లాభపడి 21731.40 వద్ద ముగిసింది. 2023 డిసెంబరు 28వ తేదీన సెన్సెక్స్ జీవిత కాల గరిష్ఠ స్థాయి 72484.34 పాయింట్లను తాకి మరో జీవిత కాల గరిష్ఠ స్థాయి 72410.38 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 21801.45 పాయింట్లను తాకి చివరికి మరో జీవిత కాల గరిష్ఠ స్థాయి 21778.70 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల సంపద నికరంగా 80,62,310.14 కోట్ల రూపాయలు పెరిగి 3,63,00,558.07 కోట్లకు చేరింది. 2.7 కోట్ల మంది కొత్త ఇన్వెస్టర్లు ఈ ఏడాది మార్కెట్లో ప్రవేశించారు. ఏడాది మొత్తం మీద రూ.1.7 లక్షల కోట్ల విదేశీ నిధులు దేశీయ మార్కెట్లోకి వచ్చాయి.
59 ఐపిఓల్లో 55 లాభాల్లోనే
2023 సంవత్సరంలో 59 ఐపిఓలు జారీ అయ్యాయి. వాటిలో 55 లాభాల పంట పండించాయి. ఇన్వెస్టర్లకు సగటున 45 శాతం లాభాలు దక్కాయి. 59 కంపెనీలు మొత్తం 54 వేల కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి సమీకరించాయి. మూడింట రెండు వంతుల కంపెనీలు సూచీల కన్నా అధికంగా 20 శాతం లాభపడ్డాయి. 59 ఇస్యూల్లో 23 ఇష్యులు 50 శాతం పైబడి లాభాలు అందించాయి.
భారీ లాభాలందించిన కంపెనీలివే...
1. ఇరెడా - 204 %
2. సైయెంట్ డిఎల్ఎం - 154.5%
3. నెట్ వెబ్ - 140.7%
4. టాటా టెక్నాలజీస్ - 136%
5. సిగ్నేచర్ గ్లోబల్ - 128%