స్టాక్ మార్కెట్ సూచీలు 2023 జూన్ 16వ తేదీన కొత్త రికార్డు స్థాయిల్లో ముగిశాయి. బుల్స్ మార్కెట్ క్షేత్రాన్ని కాలి గిట్టలతో దున్ని పారేసి లాభాల పంటలు పండించాయి. గత రికార్డులన్నింటినీ చరిత్రపుటలల్లో కలిపేశాయి. గత కొద్ది రోజుల ర్యాలీకి గురువారం ఒక్క రోజు విరామం ఇచ్చి, శుక్రవారం (16వ తేదీ) తమ ప్రతాపం చూపించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠ స్థాయి 63520.36 (లాభం-602.73 పాయింట్లు) తాకిన అనంతరం మరో జీవితకాల గరిష్ఠ స్థాయి 63384.58 పాయింట్ల వద్ద (లాభం-466.95) ముగిసింది. దీంతో 2022 డిసెంబరు 1వ తేదీన నమోదు చేసిన జీవితకాల గరిష్ఠ స్థాయి 63284.19 కాలగర్భంలో కలిసిపోయింది. నిఫ్టీ కూడా 137.90 పాయింట్ల లాభంతో 18826 వద్ద ముగిసింది. నిఫ్టీ గతంలో నమోదు చేసిన రికార్డు 18812.50 కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన పటిష్ఠమైన సంకేతాలతో పాటు రూపాయి బలం పుంజుకోవడం, విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడుల రాక మార్కెట్ కదం తొక్కేలా చేశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, కేపిటల్ గూడ్స్ షేర్లలో కొనుగోళ్లు భారీగా జరిగాయి. మార్కెట్ సాధించిన లాభాల కారణంగా ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్లు పెరిగింది. బిఎస్ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ కూడా చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.2,92,78,245.41 కోట్లకు చేరింది. గతంలో 2022 డిసెంబర్ 14వ తేదీన నమోదైన రికార్డు రూ.2,91,25,007.45 కోట్లు.
-------------------------------------------
సెన్సెక్స్ జీవిత కాల గరిష్ఠ స్థాయిల వివరాలు...
2023 జూన్ 16 ముగింపు - 63384.58 (లాభం-466.95 పాయింట్లు)
ఇంట్రాడే గరిష్ఠ స్థాయి - 63520.36 (లాభం-602.73 పాయింట్లు)
ఒక్క రోజులో పెరిగిన మార్కెట్ విలువ - రూ.2 లక్షల కోట్లు
------------------------------------------
నిఫ్టీ జీవిత కాల గరిష్ఠ స్థాయిల వివరాలు...
2023 జూన్ 16 ముగింపు - 18826 (లాభం-137.90 పాయింట్లు)
-----------------------------------------
మార్కెట్ విలువలో రికార్డు వివరాలు
2023 జూన్ 16 - రూ.2,92,78,245.41 కోట్లు
2022 డిసెంబరు 14 - రూ.2,91,25,007.45 కోట్లు
No comments:
Post a Comment