Tuesday, June 4, 2024

స్టాక్‌మార్కెట్‌లో బేర్ హ‌ల్‌చ‌ల్‌


కేంద్రంలో బిజెపి నాయ‌క‌త్వంలోని ఎన్‌డిఏ సంపూర్ణ మెజారిటీ సాధించ‌లేక‌పోయింద‌న్న వార్త‌ల‌తో మంగ‌ళ‌వారం ఈక్విటీ సూచీలు కుప్ప‌కూలాయి. సోమ‌వారం ఎగ్జిట్ పోల్స్ జోష్‌లో 3.5 శాతం మేర‌కు లాభ‌ప‌డిన సూచీలు మంగ‌ళ‌వారం అంత‌కు రెట్టింపు అంటే 6 శాతానికి పైగా న‌ష్ట‌పోయాయి. సెన్సెక్స్ 4389.73 పాయింట్లు (5.74 %) న‌ష్ట‌పోయి 72079.05 వ‌ద్ద ముగిసింది. ఇది రెండు నెల‌ల క‌నిష్ఠ స్థాయి. కాగా ఇంట్రాడేలో ఈ సూచీ 6234.35 పాయింట్లు (8.15 %) న‌ష్ట‌పోయి ఐదు నెల‌ల క‌నిష్ఠ‌స్థాయి 70234.43 పాయింట్ల‌ను తాకింది. ఎన్ఎస్ఇ ప్ర‌ధాన సూచీ నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 1982.45 (8.52%) న‌ష్ట‌పోయి 21281.45 పాయింట్ల‌కు దిగ‌జారి చివ‌రికి న‌ష్టాన్ని1379.40 పాయింట్ల‌కు ప‌రిమితం చేసుకుని 21884.50 (5.93%) వ‌ద్ద ముగిసింది. కోవిడ్‌-19 లాక్‌డౌన్ కార‌ణంగా 2020 మార్చి 23వ తేదీన సుమారు 13 శాతం న‌ష్ట‌పోయిన త‌ర్వాత మార్కెట్ ఇంత‌భారీగా న‌ష్ట‌పోవ‌డం ఇదే ప్ర‌థ‌మం. 

పిఎస్‌యు, పిఎస్‌బి షేర్ల భారీ ప‌త‌నం

పిఎస్‌యు, ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, యుటిలిటీస్‌, ఎన‌ర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్‌, యంత్ర‌ప‌రిక‌రాల విభాగాల్లో భారీగా లాభాల స్వీకారం జ‌రిగింది. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, ప్ర‌భుత్వ  రంగ బ్యాంకుల షేర్లు 24 శాతం మేర‌కు న‌ష్ట‌పోయాయి. పిఎస్ఇ సూచీలు 1856.70 పాయింట్లు న‌ష్ట‌పోయి 9475.10 వ‌ద్ద ముగిసింది. ప్ర‌ధానంగా ఆర్ఇ\ఇ 24.70 శాతం న‌ష్ట‌పోయి రూ.459 వ‌ద్ద ముగిసింది. ఇవి కాకుండా పిఎఫ్‌సి (21.62%), కంటైన‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (19.43%), భార‌త్ ఎల‌క్ర్టానిక్స్ లిమిటెడ్ (19.21%) భారీగా న‌ష్ట‌పోయిన షేర్ల‌లో ఉన్నాయి.  న‌ష్ట‌పోయిన ఇత‌ర షేర్లు - ఒఎన్‌జిసి (16.23%), కోల్ ఇండియా (13.54%), ఎన్‌టిపిసి (14.52%), ప‌వ‌ర్‌గ్రిడ్ (11.98%).

న‌ష్ట‌పోయిన బ్యాంకులివే...

పిఎస్‌బి సూచీ 1211.90 పాయింట్లు న‌ష్ట‌పోయి 6794.25 వ‌ద్ద ముగిసింది. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో అగ్ర‌గామి అయిన ఎస్‌బిఐ షేరు ఎన్ఎస్ఇలో 19.17 శాతం న‌ష్ట‌పోయి రూ.731.95 వ‌ద్ద ముగిసింది. మార్కెట్ ముగిసే స‌మ‌యానికి ఎస్‌బిఐ మార్కెట్ విలువ‌ రూ.1.08 ల‌క్ష‌ల కోట్లు న‌ష్ట‌పోయి రూ.7,00.225.05 కోట్లకు దిగ‌జారింది.  నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 4051.35 పాయింట్లు (7.95%) న‌ష్ట‌పోయి 46928.60 వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 4589.20 పాయింట్లు న‌ష్ట‌పోయి 46077.85 వ‌ద్ద ముగిసింది. 2022 ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఇండెక్స్ కు అతి పెద్ద న‌ష్టం ఇదే. యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (17.65%), బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (15.74%), పిఎన్‌బి (15.15%), కెన‌రా బ్యాంక్ (13.45%) న‌ష్ట‌పోయాయి.

న‌ష్ట‌పోయిన ఇత‌ర పిఎస్‌యులు...

రైల్‌టెల్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (14.56%), రైల్ వికాస్ నిగ‌మ్ లిమిటెడ్ (13.16%), ఐఆర్‌సిటిసి (12.27%), బిఇఎంఎల్ (20%), భెల్ (18.88%), హెచ్ఏఎల్ (17.17%), మ‌జ‌గాన్ డాక్ షిప్‌బిల్డ‌ర్స్ (16.20%), భార‌త్ డైన‌మిక్స్, కొచ్చిన్ షిప్‌యార్డ్ (10 % వంతున‌). 

రూ.31 ల‌క్ష‌ల కోట్లు న‌ష్టం 

మంగ‌ళ‌వారంనాటి భారీ న‌ష్టంతో ఈక్విటీ ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.31 ల‌క్ష‌ల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. మార్కెట్ ముగిసే స‌మ‌యానికి బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ (ఇన్వెస్ట‌ర్ల సంప‌ద‌) రూ.31,07,806.27 కోట్లు న‌ష్ట‌పోయి రూ.3,94,83,705.27 కోట్ల (4.73 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు) వ‌ద్ద స్థిర‌ప‌డింది.

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...