దేశంలో ఈక్విటీ మార్కెట్, బులియన్ మార్కెట్ రెండూ ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నాయి. గత వారంలో అమెరికన్ ఫెడరల్ కీలక వడ్డీరేటును 0.50 శాతం మేరకు తగ్గించడంతో ఏర్పడిన ఉత్సాహం అలాగే కొనసాగుతోంది. వరుసగా మూడు రోజులుగా మార్కెట్ అద్భుతమైన ర్యాలీలో పురోగమిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలమైన సంకేతాల మద్దతుతో సోమవారం సెన్సెక్స్ 384.30 పాయింట్ల మేరకు లాభపడి జీవిత కాల గరిష్ఠ స్థాయి 84928.61 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 436.22 పాయింట్లు లాభపడి 84980.53 స్థాయిని తాకింది. ఇది కూడా జీవితకాల గరిష్ఠ స్థాయి. ఎన్ఎస్ఇ ప్రధాన సూచీ నిఫ్టీ 50 కూడా అదే జోరులో జీవితకాల గరిష్ఠ స్థాయిలను నమోదు చేసింది. ఇంట్రాడేలో 25956 పాయింట్లను తాకిన నిఫ్టీ చివరికి 148.10 పాయింట్ల మేరకు లాభపడి 25939.05 వద్ద ముగిసింది. బిఎస్ఇ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 0.73 శాతం వంతున లాభపడ్డాయి. గత శుక్రవారంనాడు సెన్సెక్స్ 1359.51 పాయింట్ల మేరకు లాభపడి 84544.31 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 375.15 పాయింట్ల మేరకు లాభపడి 25790.95 వద్ద ముగిసింది.
- 3 రోజుల వరుస ర్యాలీలో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.8,30,975.85 కోట్ల మేరకు పెరిగి రూ.4,76,03,923.17 కోట్లకు (5.70 లక్షల కోట్ల డాలర్లు) చేరింది.
బంగారానిదీ అదే దారి...
బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం రూ.600 మేరకు పెరిగి రూ.76,950 వద్ద ముగిసింది. అలాగే 99.5 స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం రూ.600 మేరకు పెరిగి రూ.76,000 పలికింది. పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రధానంగా పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధం చెలరేగవచ్చునన్న భయాలు బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి. అలాగే ఆభరణాల తయారీదారులు, వర్తకుల నుంచి డిమాండు పెరగడం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణం. ఇదిలా ఉండగా వెండి ధర మాత్రం ఏడు రోజుల ర్యాలీకి చెక్ చెప్పి కిలో రూ.1000 మేరకు తగ్గి రూ.90,000 వద్ద స్థిరపడింది.
ఏడాదిలో ఇప్పటికి 27 శాతం అప్
దేశీయ మార్కెట్లో బంగారం ధర ఈ ఏడాదిలో ఇప్పటికి 27 శాతం పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయిలకు దూసుకుపోయాయి. ప్రపంచ మార్కెట్లో కూడా కమోడిటీ ఎక్స్ఛేంజిలో బంగారం ధర ఔన్సు 0.04 శాతం పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి 2647.30 డాలర్లకు చేరింది.