మరి కొద్ది రోజుల్లో ముగియబోతున్న 2025 సంవత్సరంలో ప్రైమరీ మార్కెట్ హల్‌చల్ చేసింది. కంపెనీలు తొలి పబ్లిక్ ఇష్యూల (ఐపిఓ) బాటలో రికార్డు స్థాయిలో రూ.1.76 లక్షల కోట్లు సమీకరించాయి. ఈ ధోరణి చూస్తుంటే 2026 సంవత్సరంలో కూడా ఇదే జోరు కొనసాగవచ్చునని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో నిధుల లభ్యత అధికంగా ఉండడం, ఇన్వెస్టర్ విశ్వాసం బలంగా ఉండడం, స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండడం ఇందుకు కారణం. ఐపిఓ మార్గంలో నిధుల సమీకరణపై ఇన్వెస్టర్లలో విశ్వాసం, లిస్టింగ్ రోజున లాభాలు దండుకోవచ్చునన్న ఇన్వెస్టర్ల ఉత్సాహం, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలున్న కంపెనీలకు మద్దతు ఇవ్వాలన్న ఉత్సుకత ఈ సంవత్సరం ఐపిఓ మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి.
తొలి ఏడు నెలలు నిస్తేజమే...
ఈ ఏడాది తొలి ఏడు నెలలు ప్రైమరీ మార్కెట్ నిస్తేజంగానే ఉంది. మార్కెట్లో భారీ ఆటుపోట్లు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నిరాసక్తత, భౌగోళిక రాజకీయ రిస్క్‌ల నేపథ్యంలో ఏర్పడిన అప్రమత్తత ఇందుకు కారణం. అయితే ఆగస్టు నుంచి పరిస్థితులు మెరుగుపడడం ప్రారంభమయింది. ఈక్విటీ మార్కెట్లో స్థిరత్వం రావడంతో లిస్టింగ్‌లు పెరిగాయి.
ఐపిఓ సెంట్రల్ సంకలనం చేసిన గణాంకాల ప్రకారం 2025 సంవత్సరంలో 103 ప్రధాన పబ్లిక్ ఇష్యూలు జారీ అయ్యాయి. కంపెనీలు రూ.1.76 లక్షల కోట్లు సమీకరించారు. 2024 సంవత్సరంలో 90 కంపెనీలు ఐపిఓల ద్వారా సమీకరించిన రూ.1.6 క్షల కోట్ల కన్నా ఇది అధికం. ఐపిఓ బాటలో నిధులు సమీకరించిన కంపెనీల్లో లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీలున్నాయి. సగటు ఇష్యూ పరిమాణం రూ.1,700 కోట్లు దాటింది.
ఆఫర్ ఫర్ సేల్‌కు (ఒఎఫ్ఎస్) అగ్రతాంబూలం
నిధుల సమీకరణలో ఒఎఫ్ఎస్ ప్రాధాన్య ఎంపికగా ఉంది. 2025లో కంపెనీల నిధుల సమీకరణలో 60% ఈ మార్గంలోనే సాగింది. లిస్టెడ్ కంపెనీల్లో కేవలం 23 కంపెనీలు పూర్తిగా తాజా పెట్టుబడులు సమీకరించాయి. ఇష్యూ సగటు పరిమాణం రూ.600 కోట్లుంది. 15 కంపెనీలు పూర్తిగా ఒఎఫ్ఎస్ బాటలో నిధులు సమీకరించాయి. ఇవి వసూలు చేసిన నిధులు రూ.45,000 కోట్లు. ఇతర కంపెనీలు రెండు మార్గాల్లోనూ (ఒఎఫ్ఎస్/తాజా షేర్ల జారీ) నిధులు సమీకరించాయి. ఈ మిశ్రమ బాటలో కూడా ఒఎఫ్ఎస్ వాటానే అధికంగా ఉంది. దీన్ని బట్టి ప్రమోటర్లు, తొలి ఇన్వెస్టర్లు కంపెనీ యాజమాన్య స్ట్రక్చర్‌ను మార్చకుండానే సమర్థవంతమైన విధానంలో తమ పెట్టుబడులను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించారనిపిస్తోందని నిపుణులంటున్నారు. పరిమిత పెట్టుబడి అవసరాలున్న పరిణతి చెందిన కంపెనీలకు ఇది ఆకర్షణీయ మార్గమన్నది వారి అభిప్రాయం.
స్టార్టప్‌ల పునరుజ్జీవం
ఈ ఏడాది స్టార్టప్‌ల రంగం పునరుజ్జీవం సాధించింది. 18 స్టార్టప్‌లు ప్రైమరీ మార్కెట్ నుంచి నిధులు సమీకరించాయి. వాటిలో లెన్స్‌కార్ట్, గ్రో, మీషో, ఫిజిక్స్‌వాలా ప్రధానమైనవి. 18 కంపెనీలు కలిసి రూ.41,000 కోట్లు సమీకరించాయి. 2024 సంవత్సరంలో స్టార్టప్‌లు సమీకరించిన నిధుల పరిమాణం రూ.29,000 కోట్లు మాత్రమే ఉంది.
ఎస్ఎంఇ విభాగంలోనూ ఉప్పొంగిన ఉత్సాహం
చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎస్ఎంఇ) విభాగంలో కూడా ఐపిఓకి వెళ్లాలన్న ఉత్సాహం పొంగి పొరలింది. ఈ విభాగంలో 252 ఇష్యూలు రాగా మొత్తం రూ.11,400 కోట్ల నిధులు సమీకరించారు. 2024 సంవత్సరంలో ఈ విభాగంలో 222 ఇష్యూల ద్వారా రూ.9,580 కోట్లు సమీకరించారు. ఈ విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లకు రిస్క్ అధికంగా ఉన్నప్పటికీ వీటిపై కూడా ఆసక్తి అధికంగానే ఉన్నట్టు ఈ గణాంకాలు తెలుపుతున్నాయి.
ఐపిఓ మార్కెట్లో ఇతర ముఖ్యాంశాలు...
- 2025లో ఐపిఓకి వచ్చిన పెద్ద కంపెనీల్లో టాటా కేపిటల్ (రూ.15,5012 కోట్లు) అగ్రస్థానంలో ఉంది. హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ (రూ.12,500 కోట్లు), ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ (రూ.11,607 కోట్లు), హెక్సావేర్ టెక్నాలజీస్ (రూ.8,750 కోట్లు), లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ (రూ.7,278 కోట్లు), బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ (6,632 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- ఈ ఏడాది జారీ అయిన అతి చిన్న ఐపిలో రూ.116.5 కోట్లు (జిన్ కుశాల్ ఇండస్ట్రీస్).
- హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అత్యధికంగా సబ్‌స్ర్కయిబ్ అయిన ఇష్యూగా నిలిచింది. ఈ ఇష్యూ 300 రెట్లు అధిక సబ్‌స్క్రిప్షన్ సాధించింది.
- మూడింట రెండు వంతుల ఇష్యూలు సానుకూల రాబడులు అందించాయి.
- 103 కంపెనీలు తొలి సారిగా మార్కెట్లో లిస్టింగ్ కాగా 70 కంపెనీలు లిస్టింగ్ రోజున లాభాలు అందించాయి. కేవలం 32 కంపెనీలు ఇష్యూ ధరతో పోల్చితే తక్కువ ధరకి లిస్టింగ్ అయ్యాయి.
----------------------------------------
2026లోనూ అదే జోరు
కొత్త సంవత్సరంలో కూడా ఐపిఓ మార్కెట్లో అదే జోరు కొనసాగుతుందని విశ్లేషకులంటున్నారు. 75 పైగా కంపెనీలు ఇప్పటికే సెబి అనుమతులు పొంది ఇష్యూల జారీ కోసం ఎదురుచూస్తున్నాయి. మరో 100 కంపెనీలు సెబి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. వాటిలో టెక్నాలజీ, ఆర్థిక సర్వీసులు, మౌలిక వసతులు, ఎనర్జీ, కన్స్యూమర్ రంగాలున్నాయి. రాబోయే భారీ ఐపిఓల్లో రిలయన్స్ జియో, ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్, ఓయో, ఫోన్ పే ఉన్నాయి.

No comments:
Post a Comment