కేంద్ర బడ్జెట్ యథాప్రకారం ఫిబ్రవరి ఒకటో తేదీనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించనున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ విషయం ప్రకటించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం కావడం వల్ల ఆ రోజు బడ్జెట్ ప్రతిపాదన ఉంటుందా, లేదా అన్న అనుమానాలకు దీనితో తెర పడింది. ఆదివారం బడ్జెట్ ప్రతిపాదించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం అవుతుంది. ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రతిపాదిస్తున్న 9వ బడ్జెట్ ఇది. ఆ రకంగా 10 బడ్జెట్ల ప్రతిపాదనతో అగ్రస్థానంలో ఉన్న మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ కన్నా ఆమె ఒక మెట్టు దిగువన ఉన్నారు.
28న ఆర్థిక సర్వే
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్‌సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశంలో ప్రసంగించడం ద్వారా బడ్జెట్ సమావేశాలకు శ్రీకారం చుడతారు. రాష్ట్రపతి ప్రసంగం కాగానే నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరపు ఆర్థిక సర్వే నివేదిక పార్లమెంట్ ముందుంచవచ్చు. కొత్త బడ్జెట్ ఏ రకంగా ఉండబోతోందనేందుకు ఆర్థిక సర్వేను ఒక సూచనగా భావించవచ్చు. గత ఏడాది కాలంలో ఏ రంగాలు ఏ విధమైన పనితీరు ప్రదర్శించాయి, ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి వంటి అంశాలను ఆర్థిక సర్వే అందరికీ వివరిస్తుంది. బడ్జెట్ సమావేశాలు జనవరి 28న మొదటై ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి. ఇందులో తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు ఉంటాయి. ఆ తర్వాత రెండు వారాల విరామం అనంతరం మార్చి 9వ తేదీన తిరిగి పార్లమెంటు ఉభయ సభలు మలి విడతకు సమావేశమవుతాయి. ఈ విరామంలో బడ్జెట్ ప్రతిపాదనలపై వివిధ పార్లమెంటరీ కమిటీలు చర్చించి ఆమోదానికి రంగం సిద్ధం చేస్తాయి.
No comments:
Post a Comment