Friday, February 28, 2020

స్టాక్ మార్కెట్ లో క‌రోనా క‌ల్లోలం

చ‌రిత్ర‌లోనే రెండో భారీ ప‌త‌నం న‌మోదు చేసిన సెన్సెక్స్ 
రూ.5,45,452 కోట్ల ఇన్వెస్ట‌ర్ల సంప‌ద ఆవిరి

భార‌త స్టాక్ మార్కెట్ క‌రోనా విజృంభ‌ణ ప్ర‌భావానికి అల్లాడిపోయింది. ప్ర‌పంచంలో క‌రోనా వైర‌స్ వ్యాపించిన దేశాల సంఖ్య 57కి చేరింద‌న్న వార్త‌ల‌తో ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ తీవ్ర న‌ష్టాల్లో కూరుకుపోవ‌డం భార‌త స్టాక్ మార్కెట్ ను కూడా కుదిపివేసింది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం వ‌ల్ల ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ మొత్తం తిరోగ‌మ‌నంలో ప‌డిపోతుంద‌న్న అంచ‌నాలు కూడా మార్కెట్ల‌లో భ‌యోత్పాతం రేకెత్తించాయి. 2008 ఆర్థిక సంక్షోభం త‌ర్వాత ప్ర‌పంచ మార్కెట్లు ఇంత భారీ స్థాయిలో ప‌త‌నం కావ‌డం ఇదే ప్ర‌థ‌మం. బిఎస్ఇ సెన్సెక్స్ చ‌రిత్ర‌లోనే రెండో భారీ ప‌త‌నం న‌మోదు చేయ‌గా ఒక్క రోజులోనే మార్కెట్ లో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.5,45,452 కోట్ల మేర‌కు తుడిచిపెట్టుకుపోయింది. సెన్సెక్స్ 1448.37 పాయింట్లు న‌ష్ట‌పోయి 38297.29 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ కూడా 431.55 పాయింట్ల న‌ష్టంతో 11201.75 పాయింట్ల వ‌ద్ద క్లోజ‌యింది. మార్కెట్ వ‌రుస‌గా ఆరో రోజున కూడా న‌ష్టాల‌నే మూట‌గ‌ట్టుకుంది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 2872.83 పాయింట్లు న‌ష్ట‌పోగా నిఫ్టీ 879.10 పాయింట్లు న‌ష్ట‌పోయింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజిలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ శుక్ర‌వారం మార్కెట్ ముగిసే స‌మ‌యానికి రూ.1,46,94,571.56 కోట్ల స్థాయిలో ఉంది.
వెల్లువెత్తిన అమ్మ‌కాలు
విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట‌ర్లు భారీ స్థాయిలో అమ్మ‌కాలు కొన‌సాగించారు. వారు శుక్ర‌వారంనాడు నిక‌రంగా రూ.9389 కోట్ల విలువ గ‌ల షేర్లు విక్ర‌యించార‌ని గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. వీరి అమ్మ‌కాల ప్ర‌భావం వ‌ల్ల రూపాయి 60 పైస‌లు న‌ష్ట‌పోయి 72.21 డాల‌ర్ల‌కు దిగ‌జారింది. 
- బిఎస్ఇలోని సెన్సెక్స్ షేర్ల‌లో ఒక్క ఐటిసి మిన‌హా అన్ని షేర్లూ భారీగా ప‌త‌నం అయ్యాయి. టెక్ మ‌హీంద్రా భారీ స్థాయిలో 8.14 శాతం న‌ష్ట‌పోగా టాటా స్టీల్ (7.57%), మ‌హీంద్రా (7.50%), హెచ్ సిఎల్ టెక్ (6.98%), బ‌జాజ్ ఫైనాన్స్ (6.24%), ఇన్ఫోసిస్ (5.95%) భారీగా న‌ష్ట‌పోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.
ప్ర‌పంచ మార్కెట్ల‌లోనూ భారీ ప‌త‌నం
షాంఘై, హాంకాంగ్‌, సియోల్‌, టోక్యో స్టాక్ మార్కెట్లు 3.71 శాతం, యూరోపియ‌న్ మార్కెట్లు 4 శాతం మేర‌కు న‌ష్ట‌పోయాయి. వాల్ స్ర్టీట్ లో డో జోన్స్ ఇండెక్స్ కూడా 1191 పాయింట్ల మేర‌కు భారీగా ప‌త‌న‌మ‌యింది.  చ‌రిత్ర‌లో ఈ ఇండెక్స్ ఒక రోజులో ఇంత భారీగా ప‌త‌నం కావ‌డం ఇదే ప్ర‌థ‌మం. చైనాలో ఆయిల్ వినియోగం భారీగా ప‌డిపోయిన కార‌ణంగా బ్రెంట్ క్రూడ్ ఫ్యూచ‌ర్స్ బ్యారెల్ కు 3.38 శాతం ప‌డిపోయి 49.98 అమెరిక‌న్ డాల‌ర్లు ప‌లికింది.

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...