ఈక్విటీ మార్కెట్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్ ల గురించి చింతించవలసిన అవసరం లేదని విశ్లేషకులంటున్నారు. ఇటీవల కాలంలో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీల షేర్ల విలువలు వాస్తవ స్థితి కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయంటూ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ హెచ్చరించిన నేపథ్యంలో విశ్లేషకులు ఈ అభిప్రాయం ప్రకటించారు. వాటి ఆదాయాలను బట్టే విలువలు కూడా ఉంటాయని వారు పేర్కొన్నారు. అయితే స్వల్పకాలంలో ఈ షేర్లలో ఆటుపోట్లు అధికంగానే ఉంటాయని, కాని దీర్ఘకాలంలో మాత్రం అవి బుల్లిష్ గానే ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు. పునాదులు పటిష్ఠంగా ఉంది త్రైమాసికాల వారీగా ఆదాయాలు పెరుగుతూ ఉన్నంత కాలం విలువల ఆధారంగా దీర్ఘకాలంలో మార్కెట్ బలంగానే కొనసాగుతుందని వేల్యూ స్టాక్స్ స్మాల్ కేస్ ఫండ్ మేనేజర్ శైలేష్ సరాఫ్ అన్నారు. భారత వృద్ధిరేటు, కార్పొరేట్ ఆదాయాల పెరుగుదల ఆధారంగా తాను ఈ అంచనా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఎన్ఎస్ఇలో లిస్టింగ్ అయిన అన్ని కంపెనీల త్రైమాసిక ఆదాయాలు 2023 డిసెంబరు నాటికి రూ.3,62,973 కోట్లున్నట్టు వేల్యూ స్టాక్స్ గణాంకాలు తెలుపుతున్నాయి.
--------------------------------------
"ప్రభుత్వ రంగ సంస్థల షేర్ల పట్ల నాది బుల్లిష్ వైఖరే. 2023 సంవత్సరంలో నిఫ్టీ పిఎస్ఇ ఇండెక్స్ 77 శాతం పెరిగింది. ఇదే కాలంలో నిఫ్టీ 50 రాబడి 20 శాతం ఉంది. 2024 సంవత్సరంలో కూడా ఇప్పటివరకు నిఫ్టీ 50 రాబడి కేవలం 3 శాతం ఉంటే పిఎస్ఇ ఇండెక్స్ మాత్రం 21 శాతం రాబడి ఇచ్చింది. నిఫ్టి పిఎస్ఇ ఇండెక్స్ ప్రస్తుతం 10 పిఇలో (ఒక్కో షేరుపై వస్తున్న రాబడితో పోల్చితే కంపెనీ షేరు విలువనే పిఇ అంటారు) ట్రేడవుతున్నందు వల్ల భవిష్యత్తులో మరింత లాభాలకు ఆస్కారం ఉంది. విలువలు ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉన్నందు వల్ల ఇన్వెస్టర్లు పిఎస్ యు థీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు"
- సరాఫ్
-------------------------------------
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈక్విటీల్లోకి నికరంగా రూ.26,866 కోట్ల నిధులు రావడం పాజిటివ్ ధోరణి కొనసాగుతున్నదనేందుకు సంకేతం. 36 నెలలుగా ఈ సానుకూల ధోరణి కొనసాగుతూనే ఉంది. భారత ఈక్విటీ మార్కెట్ పై ఇన్వెస్టర్ల చెక్కుచెదరని విశ్వాసానికి ఇది నిదర్శనమని ప్రభుదాస్ లీలాధర్ ఇన్వెస్ట్ మెంట్ సర్వీసెస్ హెడ్ పంకజ్ శ్రేష్ఠ అన్నారు.
స్వల్పకాలంలో ఆటుపోట్లు తప్పవు
ఎన్నికల ఫలితాల విషయంలో స్టాక్ మార్కెట్ ఎప్పుడూ సానుకూలంగానే స్పందిస్తుందని వేల్యూ స్టాక్స్ అధ్యయనంలో తేలింది. అయితే ఎన్నికలకు ముందు నెలల్లో మాత్రం ఆటుపోట్లు భారీగా ఉంటాయని హెచ్చరించింది. సమీప భవిష్యత్తులో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్ల ధరలు నిస్తేజంగా ఉంటాయని ట్రేడ్ జినీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ త్రివేష్ డి అన్నారు. లాభాల స్వీకారం, సంవత్సరాంతపు అకౌంట్ సద్దుబాట్లు, విలువల్లో మొగ్గు కారణంగా 10 శాతం మేరకు కరెక్షన్ ఏర్పడే అవకాశం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మార్కెట్లో ప్రస్తుతం జరుగుతున్న సద్దుబాట్ల ప్రభావంతో షేర్ల విలువల్లో మరింత స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉన్నట్టు ఆయన చెప్పారు. ఈ కరెక్షన్ దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు చక్కని పెట్టుబడి అవకాశంగా నిలుస్తుందని చెప్పారు. స్మాల్ క్యాప్ లలో అర్ధవంతమైన కరెక్షన్ ఏర్పడినప్పటికీ కొన్ని విలువలు మాత్రం అధికంగా ఉండడం వల్ల మార్కెట్ కొంత కాలం పాటు నిస్తేజంగానే ఉండవచ్చునని పోర్ట్ ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసుల కంపెనీ ఈక్విట్రీ కేపిటల్ సిఐఓ పవన్ భరాడియా అన్నారు. ఇన్వెస్టర్లు అధిక నాణ్యత గల షేర్లు కొనుగోలు చేయడానికి ఈ కరెక్షన్ ను అవకాశంగా ఉపయోగించుకోవచ్చునని సూచించారు.