Monday, March 18, 2024

భార‌త ఐటి "నీర‌స‌మే"

దేశంలో ఐటి రంగం ఆదాయాలు 2025 ఆర్థిక సంవ‌త్స‌రంలో నిస్తేజంగానే ఉండ‌వ‌చ్చున‌ని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్  చెబుతోంది.  వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో ఐటి రంగం ఆదాయాల్లో వృద్ధి 3-5 శాతం మ‌ధ్య‌న మాత్ర‌మే ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. వృద్ధి జోరందుకునే లోగా స‌మీప భ‌విష్య‌త్తులో ఐటి రంగంలో ఉద్యోగావ‌కాశాలు అంతంత‌మాత్రంగానే ఉంటాయ‌ని కూడా పేర్కొంది. అయిన‌ప్ప‌టికీ కంపెనీల లాభ‌దాయ‌క‌త మాత్రం స్థితిస్థాప‌కంగా ఉంటుంద‌ని, లాభాల మార్జిన్లు కూడా ఆరోగ్య‌వంతంగా 21-22 శాతం మ‌ధ్య‌న ఉండ‌వ‌చ్చున‌ని తాజా నివేదిక‌లో అంచ‌నా వేసింది. భార‌త ఐటి రంగం ప‌రిమాణం ప్ర‌స్తుతం 25,000 కోట్ల డాల‌ర్లుంది. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రం తొలి తొమ్మిది నెల‌ల కాలంలో ప‌రిశ్ర‌మ ఆదాయాల వృద్ధి గ‌త అంచ‌నా 3-5 శాతానికి భిన్నంగా 2 శాతానికి కుంచించుకుపోయింద‌ని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇదే కాలంలో వృద్ధి ఆరోగ్య‌వంతంగా 9.2 శాతం ఉంది.

అమెరికా, యూర‌ప్ దేశాల్లో స్థూల ఆర్థిక ప్ర‌తికూల‌త‌లు ఐటి రంగం ఆదాయాలు త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని విశ్లేషించింది. ఆర్థిక ప్ర‌తికూల‌త‌ల కార‌ణంగా ఆయా దేశాల్లో విచ‌క్ష‌ణాత్మ‌క వ్య‌యం త‌గ్గించార‌ని ఇక్రా ఐటి విభాగం హెడ్ దీప‌క్ జోత్వాని అన్నారు. అయితే ముఖ్య‌మైన వ్య‌యాలు, వ్య‌య‌నియంత్ర‌ణ‌తో కూడిన డీల్స్  కొన‌సాగుతాయ‌ని, అవి కొంత మేర‌కు ఐటి రంగానికి ఊతంగా ఉండ‌వ‌చ్చున‌ని ఆయ‌న అన్నారు. ఈ ప్ర‌తికూల‌త‌ల‌న్నీ ఉప‌శ‌మించ‌గానే ఐటి రంగంలో వృద్ధి జోరందుకుంటుంద‌ని ఇక్రా అంచ‌నా వేసింది. ఈ విభాగంలో నియామ‌క కార్య‌క్ర‌మాలు మంద‌కొడిగానే ఉన్న‌ప్ప‌టికీ స‌మీప భ‌విష్య‌త్తులో ఉద్యోగుల వ‌ల‌స దీర్ఘకాలిక స‌గ‌టు 12-13 శాతానికి త‌గ్గ‌వ‌చ్చున‌ని పేర్కొంది. అయితే కొత్త ఆర్థిక సంవ‌త్స‌రంలో ఐటి రంగానికి ఇక్రా స్టేబుల్ రేటింగ్ ఇచ్చింది. 

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...