Tuesday, October 29, 2024

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి. బెంగ‌ళూరు న‌గ‌రంలో స‌గ‌టు వేత‌నం రూ.29,500 ఉంది. ఆ ర‌కంగా దేశంలో అధికంగా వేత‌నం చెల్లిస్తున్న న‌గ‌రంగా నిలిచింది. టీమ్‌లీజ్ అధ్య‌య‌నంలో ఈ విష‌యం తేలింది. స‌ర్వీసెస్ జాబ్స్, సాల‌రీస్ ప్రీమియెర్ పేరిట ఆ సంస్థ ఒక నివేదిక విడుద‌ల చేసింది. తాత్కాలిక‌, శాశ్వ‌త ఉద్యోగాల్లో వివిధ కంపెనీలు ఇస్తున్న వేత‌నాల స‌గ‌టును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు. వేత‌న వృద్ధి బెంగ‌ళూరులో 9.3 శాతం ఉంది. 7.5 శాతం వృద్ధితో చెన్నై, 7.3 శాతం వృద్ధితో ఢిల్లీ త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఉద్యోగ మార్కెట్లో పోటీ స్వ‌భావానికి  ఇది ద‌ర్ప‌ణం ప‌డుతోంది.  నెల‌వారీ స‌గ‌టు వేత‌నం చెన్నైలో రూ.24,500 ఉండ‌గా ఢిల్లీలో రూ.27,800 ఉంది. 

నివేదిక‌లోని ముఖ్యాంశాలు...

- ముంబై, అహ్మ‌దాబాద్ నిల‌క‌డగా వేత‌న వృద్ధిని న‌మోదు చేస్తున్నాయి. ఆ ర‌కంగా అవి కీల‌క ఉపాధి కేంద్రాలుగా త‌మ ప్రాధాన్య‌త‌ను చాటి చెప్పుకొంటున్నాయి. స‌గ‌టు వేత‌నం ముంబైలో రూ.25,100 ఉండ‌గా పుణెలో రూ.24,700 ఉంది. 

- ప‌రిశ్ర‌మ ప‌రంగా చూసిన‌ట్ట‌యితే 8.4 శాతం వేత‌న వృద్ధితో రిటైల్ ప‌రిశ్ర‌మ అగ్ర‌స్థానంలో నిలిచింది. క‌న్స్యూమ‌ర్ డ్యూర‌బుల్స్ (5.2 శాతం), బిఎఫ్ఎస్ఐ (5.1 శాతం) రెండూ వృత్తి నిపుణుల‌కు బ‌ల‌మైన వృద్ధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాయి. 

- ఎఫ్ఎంసిజి, హెల్త్‌కేర్‌, ఫార్మా, నిర్మాణ‌, రియ‌ల్ ఎస్టేట్ రంగాలు మాత్రం వేత‌నాల్లో ఒక మోస్త‌రు వృద్ధిని మాత్ర‌మే అందిస్తున్నాయి. ఈ రంగాల్లో నిపుణులైన మాన‌వ వ‌న‌రుల అవ‌స‌రం అధికంగా ఉంది. 

- వేత‌నాలు అధికంగా చెల్లిస్తున్న విభాగాల్లో టెలికాం (రూ.29,200); త‌యారీ, ఇంజినీరింగ్‌, ఇన్‌ఫ్రా (రూ.28,200);  హెల్త్‌కేర్ అండ్ ఫార్మా (రూ.27,600);  నిర్మాణం, రియ‌ల్ ఎస్టేట్ (రూ.27,000) ఉన్నాయి. 

క‌న్స్యూమ‌ర్ డ్యూర‌బుల్స్, నిర్మాణం, రియ‌ల్ ఎస్టేట్ రంగాల్లో  శాశ్వ‌త‌, తాత్కాలిక ఉద్యోగుల మ‌ధ్య వేత‌నాల్లో వ్య‌త్యాసం గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డం ఆయా రంగాల్లోని కంపెనీలు ప్ర‌తిభ‌కు ప‌ట్టం క‌డుతున్నాయ‌ని, దీర్ఘ‌కాలం పాటు ఉద్యోగులు త‌మ‌తో ప‌ని చేయాల‌ని కోరుకుంటున్నాయ‌నేందుకు సంకేత‌మ‌ని టీమ్‌లీజ్ సిఇఓ కార్తిక్ నారాయ‌ణ‌న్ అన్నారు. 


No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...