పశ్చిమాసియా సంక్షోభం ప్రత్యేకించి అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను భయ కంపితుల్ని చేస్తున్న వాతావరణంలో భారత రిజర్వ్ బ్యాంక్ రెపోరేటును యథాతథంగా కొనసాగించింది. రెపోరేటును యథాతథంగా ఉంచడం వరుసగా ఇది మూడో సారి. దీంతో వచ్చే రెండు నెలల కాలంలో కూడా రెపోరేటు 5.25 శాతంగా కొనసాగనుంది. మూడు రోజుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశం అనంతరం ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఎంపిసి నిర్ణయాలను ప్రకటించారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇంధనం ధరలు పెరగడం, సరఫరాలపరంగా అవరోధాలు ఏర్పడిన నేపథ్యంలో రెపోరేటు యథాతథంగా కొనసాగించడానికే ఎంపిసి ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ఎంపిసిలోని ఆరుగురు సభ్యులూ ఈ నిర్ణయానికి మద్దతు ప్రకటించారని ఆయన అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్ దిగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడులు పెరగడంతో పాటు వృద్ధిరేటుకు కూడా ముప్పు ఏర్పడిందంటూ వర్తమాన ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు అంచనాను 6.9% నుంచి 6.6 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు.
ద్రవ్యోల్బణ భయాలు
ప్రస్తుతం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బిఐకి ప్రభుత్వం నిర్దేశించిన కట్టడి పరిధికి (2% ఎగువకు, దిగువకు సద్దుబాటుతో 4%) అతి చేరువకు వచ్చింది. ఏప్రిల్ నెలలో ఇది 3.48 శాతంగా నమోదయింది. పెరిగిన ఇంధనం ధరలతో పాటు ఈ ఏడాది రుతుపవనాలు బలహీనంగా ఉండవచ్చునన్న అంచనాలు ద్రవ్యోల్బణం పెరుగుదల ముప్పును పెంచాయి. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 2025 అక్టోబర్‌లో చారిత్రక కనిష్ఠ స్థాయి 0.25 శాతానికి దిగి వచ్చింది. ఆ తర్వాత నుంచి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఊర్థ్వముఖ చలనం ప్రారంభించింది.
రూపాయి సంక్షోభం
దేశీయ కరెన్సీ రూపాయి ఈ ఏడాది ప్రారంభం నుంచి క్షీణత బాటలోనే నడుస్తోంది. మే నెల 20వ తేదీన డాలర్ మారకంలో రూపాయి చారత్రక కనిష్ఠ స్థాయి 96.86ని నమోదు చేసింది. 2026 సంవత్సరంలో ఇరాన్ సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి డాలర్ మారకంలో రూపాయి 7% మేరకు క్షీణించింది. ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత స్థిరమైన కరెన్సీగా పేరు పొందిన రూపాయి ఈ ఏడాది తీవ్రంగా ఊగిసలాడుతున్న కరెన్సీల్లో ఒకటిగా మారింది. ఆయిల్ ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల తరలింపు, పెరుగుతున్న వాణిజ్య లోటు, డాలర్ బలం ఇందుకు కారణం.
