కొవిడ్ కష్టాలు పడుతున్న వారిని ఆదుకునే చర్య
ఆర్ బిఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానం
కొవిడ్-19 కారణంగా ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూ రుణాలు చెల్లించలేని స్థితిలో పడిన కార్పొరేట్ కంపెనీలు, రిటైల్ కస్టమర్ల రుణ ఖాతాల పునర్ వ్యవస్థీకరణకు ఆర్ బిఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. 2019 జూన్ 7వ తేదీన జారీ చేసిన విధివిధానాలే ఈ రుణ పునర్ వ్యవస్థీకరణకు కూడా వర్తిస్తాయి. అయితే కార్పొరేట్ కస్టమర్ల నుంచి వచ్చే అభ్యర్థనలు, వాటిలోని నిజాయతీ, ఇతర అంశాలన్నింటినీ నిశితంగా పరిశీలించి, తగు సిపారసులు చేసేందుకు ప్రముఖ బ్యాంకర్ కెవి కామత్ సారథ్యంలో ఒక నిపుణుల కమిటీని ఆర్ బిఐ నియమించింది. ఈ నిపుణుల కమిటీ సిఫారసుల ఆధారంగానే వారి దరఖాస్తులను అనుమతిస్తారు. ఇలాంటి దరఖాస్తులన్నింటినీ ఈ ఏడాది డిసెంబర్ 31 లోగా పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుందని, ఆమోదించిన తేదీ నుంచి 180 రోజుల్లోగా దాన్ని అమలుపరచాల్సి ఉంటుందని ఆర్ బిఐ నిర్దేశించింది. రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానంలో రుణ పునర్ వ్యవస్థీకరణను ప్రకటించారు. ఇలా వ్యవస్థీకరించిన రుణాలన్నింటికీ ఆయా బ్యాంకులు అదనంగా 10 శాతం ప్రావిజనింగ్ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఆలాగే కరోనా కారణంగా కష్టాల్లో పడిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, ఆ రకంగా ఈ ఏడాది మార్చి 1వ తేదీ నాటికి రుణాల చెల్లింపులో డీఫాల్ట్ అయి 30 రోజులు దాటని ఖాతాలకు మాత్రమే దీన్ని వర్తింపచేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
రుణ పునర్ వ్యవస్థీకరణ కోరే రిటైల్ కస్టమర్ల వ్యక్తిగత రుణఖాతాలకు అనుసరించాల్సిన విధివిధానాలు వేరుగా ఉంటాయి. వారికి కూడా ఈ ఏడాది డిసెంబర్ 31 లోగానే దరఖాస్తులను పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుందని, ఆ తేదీ నుంచి 90 రోజుల్లోగా దాన్ని అమలుపరచాలని ఆర్ బిఐ ద్రవ్య విధాన పత్రంలో తెలిపింది.
రుణ పునర్ వ్యవస్థీకరణ దరఖాస్తులను ఆమోదించిన అనంతరం బ్యాంకులు మిగతా రుణంపై చెల్లింపు కాలపరిమితిని పొడిగించడంతో పాటు ఆయా కస్టమర్ల ఆర్థిక స్తోమత, అవసరం ఆధారంగా రెండేళ్లకు మించకుండా చెల్లింపులపై మారటోరియం కూడా ఇవ్వవచ్చు.
ఎంఎస్ఎంఇలకు పొడిగింపు
ఇప్పటికే రుణ పునర్ వ్యవస్థీకరణ అమలులో ఉన్న ఎంఎస్ఎంఇలకు ఆ పథకం గడువును మరో మూడు నెలలు పెంచాలని ఆర్ బిఐ నిర్ణయించింది. అలాగే వారికి ప్రస్తుతం అమలుపరుస్తున్న నియమనిబంధనల్లో కొన్ని సడలింపులు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నాటికి స్టాండర్డ్ ఖాతాల వర్గీకరణలో ఉన్న రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
రెపోరేటు యథాతథం
వినియోగ వస్తువుల విభాగంలో ద్రవ్యోల్బణం 6 శాతానికి పైబడి ఉన్న కారణంగా ఈ సారికి రెపోరేటును యథాతథంగా ఉంచాలని ఆర్ బిఐ నిర్ణయించింది. అంటే రెపోరేటు 4 శాతం వద్ద అలాగే ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ కనివిని ఎరుగని తిరోగమనాన్ని ఎదుర్కొంటున్న కారణంగా దాన్ని పునరుజ్జీవింపచేయడానికి రెపోరేట్ల తగ్గింపు విషయంలో సానుకూల వైఖరిని కొనసాగించాలని కూడా నిర్ణయించింది. మరికొద్ది కాలం పాటు వినియోగదారులు ధరల భారాన్ని భరించక తప్పదని స్పష్టం చేసింది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ల వల్ల సరఫరాల వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడడం ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకోవడానికి కారణమని పేర్కొంది. మరి కొంత కాలం పాటు కూరగాయలు, ప్రోటీన్ ఆధారిత మాంసం, గుడ్ల ధరలు అధికంగానే ఉంటాయని తెలిపింది. రబీ పంట దిగుబడుల ఆధారంగా ద్రవ్యోల్బణం మూడో త్రైమాసికం నుంచి అదుపులోకి వచ్చే ఆస్కారం ఉందని అంచనా.
No comments:
Post a Comment