రక్షాబంధన్ అంటే అన్నాచెల్లెళ్ల అనురాగం. సోదరులకు అక్కచెల్లెళ్లు రాఖీలు కట్టడం, నోరు తీపి చేయడం ఆనవాయితీ. అలాగే అన్నదమ్ములు వారికి నోరూరించే స్వీట్లు కానుకగా ఇస్తారు. రక్షాబంధన్ సమయంలో స్వీట్ దుకాణాల బిజినెస్ చాలా జోరుగా ఉంటుంది. కాని ఈ సారి కరోనా వైరస్ స్వీట్ షాపులకు ఒక చేదు జ్ఞాపకం మిగల్చనుంది. ప్రతీ ఏడాది జరిగే స్వీట్ల అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది సగానికి సగం అమ్మకాలు పడిపోవచ్చునని, ఫలితంగా దేశవ్యాప్తంగా స్వీట్లు తయారుచేసే పరిశ్రమలు, దుకాణాలకు రూ.5 వేల కోట్ల నష్టం ఏర్పడవచ్చునని అంటున్నారు. కోవిడ్-19 కారణంగా ఏర్పడిన ఉపాధి, ఆదాయ నష్టంతో కస్టమర్ల కొనుగోలు శక్తి విశేషంగా పడిపోయిందని వారి స్వీట్ ఉత్పత్తిదారుల సమాఖ్య అంటోంది. వాస్తవానికి ఉత్తరాదిలో స్వీట్లు చాలా అధికంగా అమ్ముడుపోతాయని, ఈ ఏడాది ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి ఉన్నదని కొందరు ఆందోళన ప్రకటిస్తున్నారు.
గత ఏడాది రక్షాబంధన్ సందర్భంగా దేశంలో రూ.10 వేల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది అది రూ.5 వేల కోట్లకు పడిపోవచ్చు అని స్వీట్స్ అండ్ నంకీన్స్ తయారీదారుల సమాఖ్య డైరెక్టర్ ఫిరోజ్ హెచ్.నక్వి చెప్పారు. ప్రతీ ఏడాది పండుగల సీజన్ లో జరిగే అమ్మకాల్లో 25 శాతం అమ్మకాలు రక్షాబంధన్, జన్మాష్టమి సీజన్ లోనే జరుగుతాయని ఆయన అన్నారు. కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల కారణంగా అసలు స్వీట్ షాప్ లు తెరుచుకుంటాయా, లేదా అనే గందరగోళం కూడా ప్రజల్లో ఉన్నదంటూ దేశవ్యాప్తంగా జిల్లా యంత్రాంగాలు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని పండుగల సమయంలో దుకాణాలు మూసి ఉండబోవని ఒక ప్రకటన చేయాలని ఆయన సూచించారు.
No comments:
Post a Comment