భారత ఈక్విటీ మార్కెట్ ఇటీవల కనివిని ఎరుగని స్థాయిలో పరుగులు తీస్తున్న విషయం విదితమే. కేవలం 8 నెలల కాలంలోనే స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు గీటురాయి సెన్సెక్స్ 7000 పాయింట్లు లాభపడింది. దీంతో షేర్ల విలువలు వాస్తవ విలువ కన్నా ఎన్నో రెట్లు అధికంగా పలుకుతున్నాయి. ఈక్విటీ షేర్ల విలువలు ఇలా గగన విహారం చేస్తూ ఉండడం ప్రపంచ ఇన్వెస్టర్లను భయభ్రాంతులకు గురి చేస్తోంది. భారతీయ షేర్లు కొనుగోలు చేసే విషయంలో వారు ఆచితూచి అడుగేస్తున్నారని స్విస్ బ్రోకరేజి కంపెనీ యుబిఎస్ తాజా నివేదికలో తెలిపింది. అందులోనూ ఇటీవల కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ పట్ల ఆకర్షితులై ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ విలువల్లో వారు చేస్తున్న కొనుగోళ్లు కనీసం స్వల్పకాల పరిమితి వరకైనా నిలకడగా రాబడులు అందించగలవా అనే అనుమానం అంతర్జాతీయ ఇన్వెస్టర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈక్విటీ మార్కెట్ నుంచి ఎఫ్ఐఐలు భారీ ఎత్తున నిధులు ఉపసంహరించడమే ఇందుకు తార్కాణం అంటున్నారు. ఒక్క సెప్టెంబర్ త్రైమాసికంలోనే 110 కోట్ల డాలర్లు వారు భారత ఈక్విటీ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. మరోపక్క గృహస్థులు జూన్ త్రైమాసికంలోనే 500 కోట్ల డాలర్ల విలువ గల ఈక్విటీలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రత్యక్ష యాజమాన్యం 12 సంవత్సరాల గరిష్ఠ స్థాయిలో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ వాతావరణంలో కంపెనీల పరపతి రేటింగ్ ను తిరిగి ప్రకటించే అవకాశాలు తక్కువేనని యుబిఎస్ పేర్కొంది.
52 శాతం మంది లిస్టింగ్ రోజే అమ్మేస్తున్నారు...!
భారత ఈక్విటీ మార్కెట్లో ఇటీవల కాలంలో పబ్లిక్ ఇష్యూలు (ఐపిఓ) వెల్లువలా వస్తున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కూడా గణనీయంగా పెరిగాయి. తొలి పబ్లిక్ ఇష్యూల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఈక్విటీ ఇన్వెస్టర్లే ఆ షేర్లు మార్కెట్లో లిస్టింగ్ అయిన తొలి రోజే అమ్మేసుకుంటున్నట్టు ఒక సర్వేలో తేలింది. ఇలా తొలిరోజే షేర్లను విక్రయిస్తున్న వారు 52 శాతం మంది వరకు ఉన్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. వీరు కాకుండా లిస్టింగ్ అయిన తొలి వారంలో షేర్లు విక్రయిస్తున్న వారి సంఖ్య మరో 20 శాతం ఉంది.
No comments:
Post a Comment