Monday, August 30, 2021

ఆగ‌ని జోరు - ఈక్విటీ మార్కెట్‌ రికార్డుల హోరు

భార‌త ఈక్విటీ మార్కెట్ రికార్డుల హోరుతో ధ్వ‌నిస్తోంది. వ‌రుస‌గా కొద్ది రోజులుగా క‌నివిని ఎరుగ‌ని జోరులో ప‌రుగులు తీస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌ను చేస్తోంది. సోమ‌వారం (ఆగ‌స్టు 30, 2021) ఈక్విటీ ఇండెక్స్ లు కొత్త రికార్డులు నెల‌కొల్పాయి. అంత‌ర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండ‌డంతో పాటు అన్ని వ‌ర్గాల నుంచి కొనుగోళ్ల మ‌ద్ద‌తు ల‌భించ‌డం, రూపాయి బ‌లోపేతం కావ‌డం మార్కెట్ ను ప‌రుగులు పెట్టిస్తోంది. నిఫ్టీ తొలిసారిగా 16900 క‌న్నా పైన స్థిర‌ప‌డింది. ఈక్విటీ మార్కెట్లో పెట్టుబ‌డుల క‌ర‌దీపిక అయిన సెన్సెక్స్ ఇంట్రాడేలో 56958.27 పాయింట్ల జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిని తాకి చివ‌రికి 765.04 పాయింట్ల లాభంతో 56889.76 పాయింట్ల వ‌ద్ద క్లోజ‌యింది. సెన్సెక్స్ లాభాల్లో ట్రేడ్ కావ‌డం వ‌రుస‌గా ఇది మూడో రోజు. ఈ మూడు సెష‌న్ల‌లో సెన్సెక్స్ 945.55 పాయింట్లు లాభ‌ప‌డింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ  ఇంట్రాడేలో 16951.50 పాయింట్ల‌ను తాకింది. చివ‌రికి 225.85 పాయింట్ల లాభంతో 16931.05 వ‌ద్ద ముగిసింది. ఆరు వ‌రుస సెష‌న్ల‌లో నిఫ్టీ లాభాల‌తో క్లోజ్ కావ‌డం ఇది ఐదో రోజు. 

- మార్కెట్ లో ఈ బుల్లిష్ సెంటిమెంట్ తో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.2,47,30,108.97 కోట్లను చేరింది. మూడు రోజుల ప‌రుగులో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.5,76,600.66 కోట్ల మేర‌కు పెరిగింది. ఒక్క సోమ‌వారంనాడే ఇది రూ.3.56 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు దూసుకుపోయింది.


కంగ్రాట్స్ ఇండియా

ఈక్విటీ మార్కెట్ రికార్డు జోరులో ప‌రుగులు తీస్తూ బిఎస్ఇలో లిస్టెండ్ కంపెనీల మార్కెట్ విలువ జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి రూ.2,47,30,108.97 కోట్ల‌ను (3.37 ట్రిలియ‌న్ డాల‌ర్లు) చేర‌డంతో బిఎస్ఇ సిఇఓ ఆశిష్ చౌహాన్ కంగ్రాచులేష‌న్స్ ఇండియా అని ట్వీట్ చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ల‌ను కూడా ఆయ‌న టాగ్  చేశారు. 


అమెరిక‌న్ ఫెడ్ ఉత్తేజం

కొన్నాళ్ల పాటు వ‌డ్డీరేట్ల విష‌యంలో మెత‌క వైఖ‌రి అనుస‌రిస్తామ‌ని అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ చైర్మ‌న్ జెరోమ్ పావెల్  చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్ ను బ‌లోపేతం చేసింద‌ని, సోమ‌వారంనాటి జోరుకు అదే కార‌ణ‌మ‌ని రిల‌య‌న్స్ సెక్యూరిటీస్ స్ర్టాట‌జీ విభాగం హెడ్ వినోద్ మోదీ అన్నారు.


భార‌త క‌రెన్సీ రూపాయి 40 పైస‌లు పెరిగి అమెరిక‌న్ మార‌కం విలువ‌లో 73.29 డాల‌ర్లు న‌మోదు చేసింది. రూపాయి లాభాల్లో ముగియ‌డం వ‌రుస‌గా ఇది మూడో రోజు. ఈ మూడు సెష‌న్ల‌లో రూపాయి 95 పైస‌ల మేర‌కు లాభ‌ప‌డింది. 

No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...