భారత ఇన్వెస్టర్లకు హిందూ క్యాలెండర్ సంవత్సరం - సంవత్ 2077 - లాభాల వర్షం కురిపించింది. దీపావళి నాడు ఈక్విటీ మార్కెట్ సహా అన్ని మార్కెట్ కార్యకలాపాలు కొత్తగా ప్రారంభించడం ప్రతీ ఏడాది సంవత్ ప్రత్యేకత. దీపావళి నాడు సాయంత్రం సంవత్ ప్రారంభాన్ని పురస్కరించుకునే ఒక గంట ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహిస్తారు. గత దీపావళి నాడు ప్రారంభమైన సంవత్ 2077లో సెన్సెక్స్ 37 శాతం (16,133.94 పాయింట్లు), నిఫ్టీ 39.50 శాతం (5048.95 పాయింట్లు) లాభపడ్డాయి. అయితే స్వల్పకాలంలో ఈక్విటీ మార్కెట్లు ఇదే తరహా లాభాలు అందిస్తాయనుకోవడం మాత్రం దురాశే అవుతుందని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ కుమార్ కర్వా అన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలు పరిగణనలోకి తీసుకుంటే మధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్లు 12-15 శాతం లాభాలు అందించే ఆస్కారం ఉందని ఆయన అంచనా.
గురువారం మూరత్ ట్రేడింగ్
దీపావళి, సంవత్ 2078 శుభప్రారంభాన్ని పురస్కరించుకుని స్టాక్ ఎక్స్ఛేంజిలు గురువారం సాయంత్రం ఒక గంట మూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తాయి.
చివరి రోజు నష్టాలే...
సంవత్ 2077 ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించినా సంవత్సరం చివరిరోజైన బుధవారం నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై తన వైఖరి తెలియచేసే ఆస్కారం ఉన్నందు వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తం కావడం నష్టాలకు కారణమయింది. అమెరికన్ ఫెడరల్ కీలక సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు వేచి ఉండే ధోరణి అవలంబించారు. దీంతో బుధవారం సెన్సెక్స్ 257.14 పాయింట్లు నష్టపోయి 59,771.92 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫీ్ట 59.75 పాయింట్ల నష్టంతో 17829.20 పాయింట్ల వద్ద క్లోజయింది. విభాగాల వారీగా బిఎస్ఇ టెలికాం, బ్యాంకెక్స్, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫైనాన్స్ సూచీలు నష్టపోగా వైట్ క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, మెటల్, ఇండస్ర్టియల్స్ సూచీలు లాభాలు ఆర్జించాయి.
No comments:
Post a Comment