యువతలో ఈక్విటీల పట్ల ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. వారు తమ పొదుపు సొమ్ము నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారని ఆన్ లైన్ ఇన్వెస్ట్ మెంట్ వేదిక గ్రో నిర్వహించిన సర్వేలో తేలింది. కొత్త తరం బ్రోకరేజి సంస్థలు జెరోధా, అప్ స్టాక్స్, ఏంజెల్ వన్; సాంప్రదాయిక బ్రోకరేజి సంస్థలు హెచ్ డిఎఫ్ సి సెక్యూరిటీస్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, జియోజిత్ వంటి సంస్థల కస్టమర్ల సంఖ్య కరోనా మహమ్మారి కాలంలో రెండింతలు పెరగడమే ఇందుకు తార్కాణం. కస్టమర్లలో 70 శాతం మందికి పైగా తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్న కొత్త కస్టమర్లేనని ఈ బ్రోకరేజి సంస్థలు చెబుతున్నాయి. 2020 మే నుంచి 2021 సెప్టెంబర్ నెల మధ్య కాలంలో బిఎస్ఇ యూజర్ల సంఖ్య సుమారు రెట్టింపై 8 కోట్లకు చేరింది. వారిలో కూడా చివరి కోటి మంది కస్టమర్లు ఈ ఏడాది జూన్ మొదటి వారం నుంచి సెప్టెంబర్ మూడో వారం మధ్యన చేరిన వారేనని గణాంకాలు చెబుతున్నాయి.
18-50 సంవత్సరాల మధ్య వయస్కులైన సుమారు 2 లక్షల మందిని ఈ సర్వే సందర్భంగా ప్రశ్నించారు. ఈ సర్వే ఫలితాలను బట్టి చూస్తే యువత తక్షణ పన్ను రాయితీలపై కాకుండా దీర్ఘకాలిక రాబడులకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తేలుతోందని విశ్లేషకులంటున్నారు. 81 శాతం మంది స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. పైగా పన్ను ఆదా చర్యలు వారి పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపలేదని కూడా ఆ సర్వే తేల్చింది. ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెరగడం వారిలో ఇన్వెస్ట్ మెంట్ ధోరణులను పెంచిందని అంటున్నారు.
సర్వే ముఖ్యాంశాలు...
- సర్వేలో పాల్గొన్న వారిలో 76 శాతం మంది జీవితంలో తొలి సారిగా ఇన్వెస్ట్ చేస్తున్న వారే. ఐదు సంవత్సరాల పైబడి మార్కెట్ లో క్రియాశీలంగా ఉన్న వారు కేవలం 5.7 శాతం ఉన్నారు.
- 18-24 సంవత్సరాలు (39 %), 25-30 సంవత్సరాల (34 %) వయో శ్రేణిలోని వారు తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్న వారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే ఈ వయో శ్రేణుల్లోని వారిలో ఎక్కువ మంది ఈక్విటీల్లోనే ఇన్వెస్ట చేస్తున్నారు.
- 18-24 వయో శ్రేణిలోని వారిలో 14 శాతం మంది, 25-30 వయో శ్రేణి వారిలో 17 శాతం మంది మాత్రమే మిగులు నిధులు మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కేవలం 1 శాతం మంది ఫిక్స్ డ్ డిపాజిట్లలోను, 2 శాతం మంది అమెరికన్ స్టాక్ మార్కెట్లలోను ఇన్వెస్ట్ చేస్తున్నారు.
- ఇక 31-40 సంవత్సరాల వయో శ్రేణిలోని వారిలో 22 శాతం మంది నేరుగా షేర్లలో పెట్టుబడి పెడుతుండగా 15 శాతం మంది మ్యూచువల్ ఫండ్లలోను, 2 శాతం మంది ఎఫ్ డిల్లోను, 3 శాతం మంది అమెరికన్ షేర్లలోను పెట్టుబడి పెడుతున్నారు.
- నాలుగు పదుల వయసు పైబడిన వారిలో 17 శాతం మంది ఈక్విటీల్లోను, 12 శాతం మంది ఎంఎఫ్ లలోను, 1 శాతం మంది అమెరికన్ షేర్లలోను పెట్టుబడి పెడుతున్నారు. ఎఫ్ డిల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య జీరో ఉంది. ఈ వయసు ఇన్వెస్టర్లు రిటైర్మెంట్ ప్లానింగ్ మీద కూడా ఆసక్తి చూపుతున్నారు.
- మొత్తం అన్ని గ్రూప్ లను పరిగణనలోకి తీసుకుంటే 87 శాతం మంది షేర్లలోను, 58 శాతం మంది ఎంఎఫ్ లలోను ఇన్వెస్ట్ చేస్తున్నారు.
No comments:
Post a Comment