ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ "ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క బడ్జెట్" అని అబ్రహాం లింకన్ మాటలకు సరిపోలే మాటలను ఉటంకిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. దీన్ని సూటిగా చెప్పాలంటే ప్రజల కోసం ప్రజలే రూపొందించుకున్న ప్రజాబడ్జెట్ అనవచ్చు. ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజల కోసం ప్రతిపాదించిన పన్ను కోతలకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా అండగా ఉన్నారని ఆమె చెప్పారు. అయితే అంత భారీ స్థాయిలో పన్ను కోతలు ప్రకటించడానికి అధికారులను ఎంతగానో సముదాయించవలసివచ్చిందని ఆమె అన్నారు. "మేం మధ్య తరగతి ఘోష విన్నాం" అని ఆమె చెప్పారు.
శనివారం తాను ప్రతిపాదించిన 2025-26 సంవత్సరపు బడ్జెట్‌పై పిటిఐ వార్తా సంస్థకు ఆమె ఇచ్చిన విస్తృతమైన ఇంటర్వ్యూలో ఎన్నో అంశాలు ప్రస్తావించారు. "నిజాయతీగా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ తమ ఆకాంక్షలు తీర్చేందుకు ప్రభుత్వం ఏమీ చేయడంలేదన్నది ఎంతో కాలంగా వారి ఫిర్యాదు. ద్రవ్యోల్బణం, ఇతరత్రా ప్రభావాల నుంచి తమను రక్షించడానికి ప్రభుత్వం ఇంకా ఎంతో చేయాల్సి ఉన్నదన్నవారి మాటలు ఆలకించిన ప్రధాని వారికి ఊరట కల్పించే బాధ్యత నాకు అప్పగించారు. అందుకోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) అధికారులకు నచ్చచెప్పాలని కూడా సూచించారు" అన్నారామె. "ఈ కొత్త పన్ను రేట్లు మధ్యతరగతిపై పన్ను భారాన్ని విశేషంగా తగ్గిస్తాయి. గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడులకు అవసరమైనంత సొమ్ము వారి చేతిలో ఉండేలా చేస్తాయి" అని ఆమె చెప్పారు.
ఇంత భారీ ప్రకటన వెనుక గల ఆలోచన ఏమిటన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ పన్ను కోతలపై కొంత కాలంగా కృషి జరుగుతోందన్నారు. ప్రత్యక్ష పన్నులు సరళం చేయడం, ప్రజలు పన్ను చెల్లింపు బాధ్యతకు కట్టుబడేలా చేయడం ఈ రెండే ఆలోచనలని ఆమె చెప్పారు. 2024 జూలైలోనే ఇందుకు సంబంధించిన కృషి ప్రారంభమయిందని, ఇప్పుడది కార్యరూపంలోకి వచ్చిందని తెలిపారు. త్వరలో రాబోయే కొత్త చట్టంలో భాష సరళమై ప్రజలపై నిబంధనల కట్టుబాటు భారం తగ్గుతుంది, చట్టం వినియోగదారులకు మరింత అనుకూలంగా మారుతుంది అన్నారు. తాను పన్ను రేట్ల పునర్నిర్మాణం గురించి మాట్లాడడంలేదని రేట్లు పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఉండేలా చూడాలన్నది తన లక్ష్యమని చెబుతూ అందుకు సంబంధించి కృషి జరుగుతోంది అని చెప్పారు.
గత జూలైలో తాను ప్రతిపాదించిన మధ్యంతర బడ్జెట్ తర్వాత మధ్యతరగతి ప్రజల ఘోష మరింతగా పెరిగిందని సీతారామన్ తెలిపారు. "ప్రభుత్వం సమ్మిళితంగా ఉంది. పేదలు, సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాల గురించి పట్టించుకుంటోంది. మా సమస్యల పైనే ఎందుకు ఈ నిర్లిప్తత" అనే మాటలు వ్యాపించాయన్నారు. తాను ఎక్కడకు వెళ్లినా "మేం నిజాయతీగా పన్ను చెల్లిస్తున్నాం. మంచి పన్ను చెల్లింపుదారులుగా మా దేశానికి సేవ చేస్తున్నాం. మరి మాకేం చేయాలని మీరు ఆలోచిస్తున్నారు" అని తనను ప్రశ్నించారని చెప్పారు. తాను ఆ విషయం ప్రధానికి నివేదించగా ఏం చేస్తే బాగుంటుందో మీరే ఆలోచించండి అంటూ నాకే బాధ్యత అప్పగించారని చెప్పారు. ఆ తర్వాత అందుకు సంబంధించిన గణాంకాలన్నీ సిద్ధం చేసి ప్రధాని ముందుంచితే ఆయన తన ఆలోచనలు కూడా చెప్పారు. వాటన్నింటి సారమే శనివారం నాటి బడ్జెట్లో ఆవిష్కరించాం అని సీతారామన్ చెప్పారు.
ఇంత భారీ ఊరట కల్పించే విషయంలో ప్రధానికి ఎంతగా నచ్చచెప్పాల్సివచ్చిందన్న ప్రశ్నకు స్పందిస్తూ "ఆర్థిక మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డులకు (సిబిడిటి) ఎలా నచ్చచెప్పారు అన్నది మీ ప్రశ్న అయి ఉంటుంది అంటే మధ్యతరగతి కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశంలో ప్రధానికి చాలా స్పష్టత ఉంది. కాని మంత్రిత్వ శాఖ విషయంలోనే వారికి సౌకర్యవంతమైన వాతావరణం కల్పించి ప్రతిపాదన వారి ముందుంచాల్సి వచ్చింది" అని చెప్పారు. వారి అభ్యంతరాల్లోనూ అర్ధం ఉందంటూ "ఖజానాకు ఆదాయం సమకూర్చవలసిన భారం వారిపై ఉంది. అందుకే వారిని మరింత ఎక్కువగా సముదాయించాల్సిన అవసరం ఏర్పడింది. ఎట్టకేలకు అందరం ఒక అవగాహనకు రాగలిగాం" అన్నారు.
"పారిశ్రామికవేత్తలు, భిన్న వర్గాల ప్రజలను, వారి నాయకులను కలిసి వారి ఆలోచనలు వింటూ వారి అవసరాలకు ప్రధాని స్పందిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వామి అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది" అన్నారామె.
No comments:
Post a Comment