ఢిల్లీ మార్కెట్లో ఒక్క రోజే రూ.2430 పెరిగిన ధర
మార్కెట్లో బంగారం భగ్గుమని మండిపోతోంది. పుష్ప సినిమాలో హీరో మేనరిజం వలె "తగ్గేదేలే" అంటూ కాలరెగరేస్తోంది. సోమవారం (ఫిబ్రవరి 10) నాడు ఢిల్లీ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ఒక్క రోజులోనే రూ.2430 పెరిగి రూ.88,500కి చేరింది. 99.5% స్వచ్ఛత గల బంగారం 10 గ్రాములు రూ.2430 పెరిగి రూ.88,100 పలికింది. వెండి ధర కిలో 1000 రూపాయిలు పెరిగి రూ.97,500 పలికింది. రూపాయి బలహీనత, ప్రపంచ మార్కెట్ల నుంచి వెలువడిన సంకేతాలు ఇందుకు దోహదపడ్డాయి. అలాగే ఆభరణాల వర్తకులు, రిటైలర్లు భారీగా కొనుగోలు చేయడం కూడా ఇందుకు దోహదపడినట్టు అఖిల భారత సరాఫా సంఘం ప్రకటించింది. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పోటు ప్రభావం వల్ల అంతర్జాతీయ విపణిలో కూడా బంగారం ధర ఔన్సు 2900 డాలర్లకు చేరింది. ఇదిలా ఉండగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు రిస్క్‌తో కూడిన స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు స్వస్తి చెప్పి బులియన్ పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారని పరిశీలకులంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే పలు మార్లు బంగారం రికార్డు గరిష్ఠ స్థాయిలకు చేరిందని, త్వరలోనే 3000 డాలర్లకు చేరడం కనుచూపు మేరలోనే ఉన్నదని అంటున్నారు.
తగ్గుముఖం పట్టే అవకాశమే లేదా...?
బంగారం ధరలు సగటు మనిషికి అందుబాటులో లేని స్థాయికి దూసుకుపోతున్న నేపథ్యంలో పలువురు అడుగుతున్న ప్రశ్నలివి. ఇటీవల ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే నివేదిక ఇందుకు ఆశావహమైన సమాధానమే ఇచ్చింది. ఈ ఏడాది బంగారం ధరలు తగ్గుతాయని, వెండి ధర మాత్రం పెరుగుతుందని అంచనా వేసింది. ప్రపంచ మార్కెట్లో కమోడిటీ ధరలు 2025 సంవత్సరంలో 5.1%, 2026 సంవత్సరంలో 1.7% వరకు తగ్గవచ్చునని ప్రపంచ బ్యాంక్ కమోడిటీ మార్కెట్ ఔట్‌లుక్ నివేదిక తెలుపుతున్నట్టు పేర్కొంది. అదే జరిగితే సగటు జీవి పంట పండినట్టే కదా...?
No comments:
Post a Comment