Friday, March 28, 2025

ఇన్వెస్ట‌ర్ల‌కు లాభాల పంట‌

ఈక్విటీ మార్కెట్ 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎగుడుదిగుడులుగా ప‌య‌నించిన‌ప్ప‌టికీ ఇన్వెస్ట‌ర్ల‌కు లాభాల‌పంట పండించింది. స్థూలంగా నెల‌కొన్న‌ ఆశావ‌హ దృక్ప‌థం కార‌ణంగా ఏడాది మొత్తంలో స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డుల ప్ర‌ధాన సూచీ సెన్సెక్స్ 5 శాతం లాభ‌ప‌డింది. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో సాధించిన అద్భుత‌మైన వృద్ధి అనంత‌రం కాస్తంత జోరు మంద‌గించిన‌ట్టు మాత్రం క‌నిపించింది. అయినా సెన్సెక్స్ ఏడాది మొత్తం మీద 3763.57 పాయింట్లు (5.10%) లాభ‌ప‌డ‌డంతో బిఎస్ఈలో లిస్ట‌యిన కంపెనీల మార్కెట్ విలువ రూ.25,90,546.73 కోట్లు పెరిగి రూ.4,12,87,646.50 కోట్ల వ‌ద్ద (4.82 ట్రిలియ‌న్ డాల‌ర్లు) స్థిర‌ప‌డింది. ఎన్ఎస్ఇ ప్ర‌ధాన సూచీ నిఫ్టీ సైతం 1192..45 పాయింట్లు (5.34%) లాభ‌ప‌డింది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27వ తేదీన సెన్సెక్స్ 85,978.25 పాయింట్లు, నిఫ్టీ 26,277.35 పాయింట్ల జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిల‌ను తాకాయి. అయితే ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి రోజైన శుక్ర‌వారం నాడు (మార్చి 28, 2025) మాత్రం సెన్సెక్స్ 191.51 పాయింట్లు (ఏడాది ముగింపు స్థాయి 77,414.92 పాయింట్లు), నిఫ్టీ 72.60 పాయింట్ల (ఏడాది ముగింపు స్థాయి 23,519.35 పాయింట్లు) వ‌ద్ద ముగిశాయి. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో సెన్సెక్స్ 14,659.83 పాయింట్లు (24.85%) లాభ‌ప‌డ‌డంతో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.1,28,77,203.77 కోట్లు పెరిగి రూ.3,86,97,099.77 కోట్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది.

అక్టోబ‌రు నుంచి బేర్ దాడి 

ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్ ప‌య‌నం ఎగుడుదిగుడులుగా సాగింది. దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త ధోర‌ణిలోనే ఏడాది ప‌య‌నం ప్రారంభ‌మైనా న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం వ‌రుస‌గా మూడో సారి కూడా అధికారంలోకి రావ‌డంతో  జూన్ నుంచి జోరందుకుంది. జూన్‌-సెప్టెంబ‌రు నెల‌ల మ‌ధ్య కాలంలో ప‌లు రికార్డులు నెల‌కొల్పిన అనంత‌రం అక్టోబ‌రు నుంచి మార్కెట్ బేర్ గుప్పిట్లోకి జారుకుంది. తిరిగి ముగింపు స‌మ‌యంలో అంటే మార్చి నెల‌లో మ‌ళ్లీ జోరందుకుంది. మొత్తం మీద ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో మార్కెట్ ప‌య‌నాన్ని రెండు అర్ధ‌భాగాలుగా విభ‌జించ‌వ‌చ్చున‌ని లెమ‌న్ మార్కెట్స్ డెస్క్ అన‌లిస్ట్ స‌తీశ్ చంద్ర ఆలూరి అన్నారు. ఆర్థిక సంవ‌త్స‌రం ప్ర‌థ‌మార్ధంలో 17% లాభ‌ప‌డిన మార్కెట్ 2024 అక్టోబ‌రు-2025 ఫిబ్ర‌వ‌రి నెల‌ల‌ మ‌ధ్య కాలంలో వ‌రుస‌గా 5 నెల‌లు న‌ష్ట‌పోయింది. అమెరికాలో వ‌డ్డీరేట్లు త‌గ్గించ‌డంతో అక్క‌డ రాబ‌డులు ఆక‌ర్ష‌ణీయంగా మారి విదేశీ ఇన్వెస్ట‌ర్లు మ‌న మార్కెట్ నుంచి నిదులు త‌ర‌లించుకుపోవ‌డం ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. కార్పొరేట్ కంపెనీల నిరాశావ‌హ ఆర్థిక ఫ‌లితాలు, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చ‌రిక‌లు దీనికి ఆజ్యం పోశాయి. ఒక ద‌శ‌లో మ‌న మార్కెట్లో షేర్ల విలువ‌లు వాస్త‌వ విలువ‌కు కొన్ని రెట్లు అధికంగా ట్రేడ‌వుతూ ఉండ‌డం కూడా ఇన్వెస్ట‌ర్లు అప్ర‌మ‌త్తం కావ‌డానికి దోహ‌ద‌ప‌డింది. ఒక్క అక్టోబ‌రు నెల‌లోనే సెన్సెక్స్ 4910.72 పాయింట్లు న‌ష్ట‌పోయింది. నిరంత‌ర బుల్ ర‌న్‌కు అల‌వాటు ప‌డిపోయిన కొత్త ఇన్వెస్ట‌ర్ల‌కు 2024-25 సంవ‌త్స‌రం ఒక క‌నువిప్పు వంటిద‌ని మాస్ట‌ర్ కేపిట‌ల్ స‌ర్వీసెస్ లిమిటెడ్ డైరెక్ట‌ర్ ప‌ల్కా అరోరా చోప్రా అన్నారు. 

కొన‌సాగిన ఐపీఓల ఉత్సాహం
మార్కెట్ ఎంత ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా ఐపీఓ మార్కెట్ మాత్రం అమిత ఉత్సాహంగా ఉంద‌ని అంటున్నారు. మార్కెట్లోకి వ‌చ్చిన ఐపిఓల్లో అధిక శాతం స‌క్సెస్ కావ‌డం, రిటైల్ ఇన్వెస్ట‌ర్లు ఉత్సాహంగా మార్కెట్లో పాల్గొన‌డంతో బేర్ దాడిలో కూడా మార్కెట్ నిల‌దొక్కుకోగ‌లిగింది. 

రిల‌య‌న్సే నంబ‌ర్ 1
దేశంలో మార్కెట్ విలువ‌ప‌రంగా అత్యంత విలువైన కంపెనీగా రిల‌య‌న్స్ ఇండ‌స్ర్టీస్ త‌న స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకుంది. రూ.17,25,377.54 కోట్ల విలువ‌తో ఆర్ఐఎల్ అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (రూ.13,99,208.73 కోట్లు), టిసిఎస్ (రూ.13,,04,121.56 కోట్లు, భార‌తి ఎయిర్‌టెల్ (రూ.9,87,005.92 కోట్లు), ఐసిఐసిఐ బ్యాంక్ (రూ.9,52,768.61 కోట్లు) త‌ర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.    

No comments:

Post a Comment

ఈ వారంలో 23850 పైన బుల్లిష్

ఏప్రిల్ 1-4 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్     నిఫ్టీ   :  23519 (+169 )       గత వారంలో నిఫ్టీ 23412 - 23870 పాయింట్ల మధ్యన కదల...