- 6 నెలల్లో 14% దిగజారిన ఈక్విటీ సూచీలు
- ఫిబ్రవరిలో 4300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- రూ.85 లక్షల కోట్ల సంపద నష్టం
గత కొన్ని నెలలుగా ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాలు చవి చూస్తుంటే అంతర్జాతీయ విపణిలో బంగారం ధరలు మాత్రం దూసుకుపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల హెచ్చరికలు ఈక్విటీ మార్కెట్లను కుదేలు చేస్తున్నాయి. ప్రధానంగా మెక్సికో, కెనడాలపై తాజాగా విధించిన సుంకాలు, చైనాపై మరో 10% అదనపు సుంకాల విధింపు చర్యలు ఫిబ్రవరి 28వ తేదీన మార్కెట్లను కల్లోలితం చేశాయి. దీనికి తోడు ప్రపంచ దేశాల్లో నెలకొన్న మందగమన పరిస్థితులు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దీనికి ఆజ్యం పోస్తున్నాయి.
వాస్తవానికి ట్రంప్ జనవరి 20వ తేదీన అధికారం చేపట్టిన నాటి నుంచి ఈక్విటీ మార్కెట్‌పై బేర్ దాడి మొదలయింది. ట్రంప్ తాజా చర్యలు ఈ దాడిని మరింత ముమ్మరం చేశాయి. ఫలితంగా ఒక్క ఫిబ్రవరి నెలలోనే సెన్సెక్స్ 4300 పాయింట్ల (5.5%) మేరకు నష్టపోయింది. ఈ నెల రోజుల వ్యవధిలో బిఎస్ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.40.6 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం మార్కెట్‌నే పరిగణనలోకి తీసుకుంటే ఈ నష్టం రూ.85 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఎన్ఎస్ఇ నిఫ్టీ అయితే వరుసగా ఐదో నెల కూడా నష్టాల్లో ముగిసింది. 19 సంవత్సరాల చరిత్రలోనే కనివిని ఎరుగని భారీ నష్టం ఇది. 1996 సంవత్సరం తర్వాత నిఫ్టీ ఇంత సుదీర్ఘ కాలం నష్టాల్లో ట్రేడ్ కావడం ఇదే ప్రథమం. గత ఏడాది సెప్టెంబర్‌లో జీవిత కాల గరిష్ఠ స్థాయిలను నమోదు చేసిన తర్వాత ఏర్పడిన కరెక్షన్‌లో సెన్సెక్స్, నిఫ్టీ 15-16% వరకు నష్టపోయాయి. సెన్సెక్స్ గత ఏడాది సెప్టెబర్ 27వ తేదీన జీవితకాల గరిష్ఠ స్థాయి 85978.25 పాయింట్లను నమోదు చేయగా నిఫ్టీ 26277.35 పాయింట్లను తాకింది. అప్పటి నుంచి సెన్సెక్స్ 11376.13 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 3729.80 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్లోని ఇతర సూచీలు అంతకన్నా భారీ నష్టాలనే నమోదు చేశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 21%, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 26-27% నష్టపోయాయి. నిఫ్టీలోని 50 షేర్లలో 30 ఇప్పటికే బేర్ గుప్పిట్లోకి జారుకున్నాయి. ఇక మంగళవారం అయితే సెన్సెక్స్ 1414 పాయింట్లు, నిఫ్టీ 440 పాయింట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 73198 పాయింట్లు, నిఫ్టీ 22215 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.
5 నెలల్లో ఎఫ్‌పిఐలు తరలించుకుపోయింది రూ.2 లక్షల కోట్లు
మార్కెట్ ఇంత భారీగా నష్టపోవడానికి ప్రధాన కారణం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నిధుల తరలింపు. గత రెండు నెలల కాలంలో అంటే 2025 ప్రారంభం నుంచి ఎఫ్‌పీఐలు నికరంగా 1,220 కోట్ల డాలర్లు (రూ.1.06 లక్షల కోట్లు) తరలించుకుపోయారు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే రూ.47,349 కోట్లు ఉపసంహరించారు. 2024 సంవత్సరం నాలుగో త్రైమాసికంలో విక్రయించిన 1,230 కోట్ల డాలర్ల (రూ.1.07 లక్షల కోట్లు) విలువ గల ఈక్విటీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఐదు నెలల కాలంలో వారి అమ్మకాల మొత్తం విలువ 2,450 కోట్ల (రూ.2.13 లక్షల కోట్లు) డాలర్లకు చేరింది.
No comments:
Post a Comment