Tuesday, March 31, 2026

చీక‌ట్లో చిరుదివ్వె 2026-27...

బుధ‌వారం నుంచి ప్రారంభ‌మ‌వుతున్న నూత‌న ఆర్థిక సంవ‌త్స‌రం 2026-27లో ఈక్విటీ మార్కెట్లు వ్య‌వ‌స్థాత్మ‌కంగా ఆశావ‌హంగానే ఉంటాయ‌న్న అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ మూలాలు ప‌టిష్ఠంగా ఉండ‌డం ఇందుకు కార‌ణం. అయితే ప్ర‌స్తుతం న‌డుస్తున్న భౌగోళిక‌, రాజ‌కీయ ఉద్రిక్త‌త‌లు స‌డ‌లి క్రూడాయిల్ ధ‌ర‌లు స్థిర‌ప‌డాల్సి ఉంటుంది. అయితే ప్ర‌థ‌మార్ధంలో ప్ర‌స్తుత ధోర‌ణిలోనే సైడ్‌వేస్ ధోర‌ణి, భారీ ఆటుపోట్లు కొన‌సాగ‌వ‌చ్చున‌ని అంటున్నారు. అలాగే ఇటీవ‌ల క్రూడాయిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు దీటుగా వ‌డ్డీరేట్లు కూడా పెర‌గ‌వ‌చ్చున‌ని అంచ‌నా. అయిన‌ప్ప‌టికీ దేశీయ ఆర్థిక సంస్థ‌ల పెట్టుబడులు, బ‌ల‌మైన‌ కార్పొరేట్ ఆదాయాలు ర‌క్ష‌ణ‌గా నిలిచి భారీ క్షీణ‌త‌ను నివారించే ఆస్కారం ఉన్న‌ట్టు స్వ‌స్తిక ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ రీసెర్ఛ్ హెడ్ సంతోష్ మీనా అన్నారు. ద్వితీయార్ధంలో బ‌ల‌మైన రిక‌వ‌రీకి అవ‌కాశం ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా కొత్త ఆర్థిక సంవ‌త్స‌రంలో అప్ర‌మ‌త్త ఆశావ‌హ ధోర‌ణి ఉండ‌వ‌చ్చున‌ని మాస్ట‌ర్ కాపిట‌ల్ స‌ర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ రీసెర్చ్ ఆఫీస‌ర్ ర‌వి సింగ్ అంటున్నారు. 

మార్చి నెల‌ కాళ‌రాత్రే...
మంగ‌ళ‌వారంతో ముగుస్తున్న 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రం ప్ర‌త్యేకించి మార్చి నెల ఈక్విటీ మార్కెట్ల‌కు ఒక కాళ‌రాత్రిగా మిగిలింది. ఏడాది మొత్తం మీద సెన్సెక్స్ 5467.37 పాయింట్లు (7%) న‌ష్ట‌పోయి  71,945.55 వ‌ద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ ప్ర‌ధాన సూచీ నిఫ్టీ-50 1187.95 పాయింట్లు (5%) న‌ష్ట‌పోయి 22,331.40 వ‌ద్ద ముగిసింది. నెల మొత్తం మీద సెన్సెక్స్ 9340 పాయింట్లు (11.5%), నిఫ్టీ 2850 పాయింట్లు (11.3%) న‌ష్ట‌పోయాయి. ప‌శ్చిమాసియా సంక్షోభం సృష్టించిన క‌ల్లోలం ప్ర‌భావంతో మార్చి నెల మొత్తం ఈక్విటీ మార్కెట్ల‌లో బేర్ స్వైర విహారం చేసింది. అందులోనూ చివ‌రి రెండు వ‌రుస సెష‌న్ల‌లో దాని విజృంభ‌ణ నిలువ‌రించ‌డం ఎవ‌రి వ‌ల్ల సాధ్యం కాలేదు. ఫ‌లితంగా రెండు సెష‌న్ల‌లోనే సెన్సెక్స్ 3325.90 పాయింట్లు, 973 పాయింట్లు న‌ష్ట‌పోయాయి. సెన్సెక్స్ గ‌త ఏడాది డిసెంబ‌రు 1వ తేదీన న‌మోదు చేసిన  జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 86,159.02 నుంచి 14,211.47 పాయింట్లు (16.49%) న‌ష్ట‌పోయింది. నిఫ్టీ ఈ ఏడాది జ‌న‌వ‌రి రెండో తేదీన న‌మోదు చేసిన జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 26,340 నుంచి 4009 పాయింట్లు న‌ష్ట‌పోయింది. 

రూ.51 ల‌క్ష‌ల కోట్లు హాంఫ‌ట్ 
పశ్చిమాసియా సంక్షోభం సృష్టించిన క‌ల్లోలం ప్రారంభ‌మైన నాటి నుంచి ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.51 ల‌క్ష‌ల కోట్లు ఆవిరైపోయింది. ఏడాది మొత్తం మీద ఇది 46,000 కోట్లు క్షీణించింది. ప్ర‌ధానంగా చివ‌రి రెండు సెష‌న్ల‌లో రూ.18,60,662.29 కోట్ల సంప‌ద తుడిచిపెట్టుకుపోయి  
రూ.4,12,41,172.45 కోట్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది.

ప్ర‌పంచ అస్థిర‌త‌లే కార‌ణం
2026 ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలో ప‌రిస్థితి ఆశావ‌హంగానే క‌నిపించినా ద్వితీయార్ధం మాత్రం క‌ల్లోలానికి కార‌ణం అయింది. తొలుత భార‌తీయ ఉత్ప‌త్తుల‌పై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి. అప్ప‌టి నుంచి మార్కెట్ భారీ ఆటుపోట్ల‌తోనే ట్రేడ‌వుతూ వ‌స్తోంది. అలాంటి సమ‌యంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా ఉమ్మ‌డి దాడులు (ఫిబ్ర‌వ‌రి 28)  పిడుగుపాటుగా ప‌రిణ‌మించింది. ప్ర‌ధానంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట‌ర్లు భారీ మొత్తంలో మ‌న మార్కెట్ నుంచి నిధులు త‌ర‌లించుకుపోయారు. ఒక్క మార్చి నెల‌లోనే వారు రూ.1.25 ల‌క్ష‌ల కోట్లు ఉప‌సంహ‌రించారు. అంత‌ర్జాతీయ విప‌ణిలో బ్యారెల్ బ్రెంట్ ర‌కం క్రూడాయిల్ ధ‌ర 118 డాల‌ర్ల‌కు దూసుకుపోయింది. 
-------------------------------  


2026 ఆర్థిక సంవ‌త్స‌రాన్నిఈక్విటీ మార్కెట్‌కు రెండు ధ్రువాలుగా అభివ‌ర్ణించ‌వ‌చ్చు. ప్ర‌థ‌మార్ధం మ‌న మార్కెట్ల బ‌లానికి, ఆశావ‌హ దృక్ప‌థానికి చిహ్నం అయితే ద్వితీయార్ధం ప్ర‌త్యేకించి మార్చి త్రైమాసికం మార్కెట్ల‌పై ప్ర‌పంచ ప‌రిణామాల ప్ర‌భావానికి ప్ర‌తీక‌గా ప‌రిగ‌ణించాలి. దేశీయంగా చ‌క్క‌ని లిక్విడిటీ, రాబ‌డుల్లో నిల‌క‌డ‌, రిటైల్ ఇన్వెస్ట‌ర్ల భాగ‌స్వామ్యంతో  ఈ ఏడాది ఎంతో ఆశావ‌హంగా ప్రారంభ‌మ‌యింది. 2025 కాలెండ‌ర్ సంవ‌త్స‌రం ముగింపు స‌మ‌యంలో మార్కెట్లు రికార్డు గ‌రిష్ఠ స్థాయిల‌కు చేరాయి. కాని భౌగోళిక‌, రాజ‌కీయ క‌ల్లోలం చివ‌రి త్రైమాసికంలో మార్కెట్‌ను క‌ల్లోల సంద్రంలోకి నెట్టింది. మార్కెట్ సెంటిమెంట్ పాతాళానికి ప‌డిపోయింది.

- హ‌రిప్ర‌సాద్‌.కె. రీసెర్చ్ అన‌లిస్ట్‌, లైవ్‌లాంగ్ వెల్త్ 

No comments:

Post a Comment

చీక‌ట్లో చిరుదివ్వె 2026-27...

బు ధ‌వారం నుంచి ప్రారంభ‌మ‌వుతున్న నూత‌న ఆర్థిక సంవ‌త్స‌రం 2026-27లో ఈక్విటీ మార్కెట్లు వ్య‌వ‌స్థాత్మ‌కంగా ఆశావ‌హంగానే ఉంటాయ‌న్న అంచ‌నాలు వెల...