Wednesday, April 8, 2026

మ‌త్తు వ‌దిలింది..బుల్ రంకె వేసింది

కొద్ది నెల‌లుగా నిద్ర‌మ‌త్తులో ఉన్న బుల్ ఒక్క‌సారిగా మ‌త్తు వ‌దిలించుకుని రంకె వేసింది. త‌మ మ‌ధ్య సాగుతున్న యుద్ధానికి అమెరికా, ఇరాన్ రెండు వారాల విరామం ప్ర‌క‌టించ‌డం, బ్యారెల్‌ క్రూడాయిల్ ధ‌ర 94 డాల‌ర్ల‌కు దిగి రావ‌డం, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బ‌ల‌ప‌డ‌డం వంటి ప‌రిణామాల‌న్నీ ఈక్విటీ మార్కెట్లో సెంటిమెంట్‌ను బ‌లోపేతం చేశాయి. ఆర్‌బిఐ నూత‌న ఆర్థిక సంవ‌త్స‌రానికి (2026-27) ప్ర‌క‌టించిన తొలి ద్వైమాసిక ప‌ర‌ప‌తి స‌మీక్ష‌లో రెపోరేటు య‌థాత‌థ స్థితిని కొన‌సాగించ‌డం కూడా మార్కెట్‌ను ఉత్తేజితం చేసింది. అమెరికా-ఇరాన్ కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌పంచ మార్కెట్ల‌లో ఏర్ప‌డిన ర్యాలీ సైతం మ‌న మార్కెట్‌కు ఎన‌లేని శ‌క్తిని అందించింది. ఇన్ని సానుకూల‌త‌ల మ‌ధ్య బుధ‌వారం ఈక్విటీ మార్కెట్ చాలా బ‌లంగా ప్రారంభ‌మై రోజంతా అదే జోరును కొన‌సాగించింది. ఇటీవ‌ల కాలంలో క‌నివిని ఎరుగ‌ని విధంగా ప్ర‌ధాన ఈక్విటీ సూచీలు 4 % పైగా లాభ‌ప‌డ్డాయి. అలాగే ఈక్విటీ సూచీలు వ‌రుస‌గా ఐదు సెష‌న్లుగా ర్యాలీలో ఉన్నాయి.

- ఉద‌యం నుంచి అద్భుత‌మైన లాభాల్లో ఉన్న సెన్సెక్స్ 2946.32 పాయింట్ల లాభంతో 77,562.90 వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడేలో 3018.96 పాయింట్లు లాభ‌ప‌డిన సెన్సెక్స్ 77,635.54 పాయింట్ల గ‌రిష్ఠ స్థాయిని తాకింది. 

- ఐదు సంవ‌త్స‌రాల కాలంలో సెన్సెక్స్‌కు అత్యుత్త‌మ ట్రేడింగ్ దినం ఇదే.

- బిఎస్ఇలోని షేర్ల‌లో 3859 స్టాక్‌లు లాభాల‌తో ముగియ‌గా 537 స్టాక్‌లు మాత్రమే న‌ష్ట‌పోయాయి. 101 స్టాక్‌లు త‌ట‌స్థంగా ఉండిపోయాయి. 

- బిఎస్ఇ మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 4.93%, స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 4.01% లాభ‌ప‌డ్డాయి.

- నిఫ్టీ ఇంట్రాడేలో 901.5 పాయింట్ల లాభంతో 24,025.15 స్థాయిని తాకింది. చివ‌రికి 873.70 పాయింట్ల నిక‌ర లాభంతో 23,997.35 వ‌ద్ద ముగిసింది. 

- నిఫ్టీ గ‌త 11 నెల‌ల కాలంలో ఒక్క రోజులో న‌మోదు చేసిన‌ గ‌రిష్ఠ లాభం ఇదే.  

- బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధ‌ర 13.89% ప‌త‌న‌మై 94.09 డాల‌ర్లు ప‌లికింది. 

- డాల‌ర్ మార‌కంలో భార‌తీయ క‌రెన్సీ రూపాయి 47 పైస‌లు లాభ‌ప‌డి 92.59 వ‌ద్ద ముగిసింది.

- రంగాల వారీ సూచీల‌న్నీ లాభాల్లోనే ముగిశాయి. రియ‌ల్టీ ఇండెక్స్ గ‌రిష్ఠంగా 6.76% లాభ‌ప‌డింది. 

ప్ర‌పంచ మార్కెట్ల‌లోనూ అదే జోరు

ప్ర‌పంచ మార్కెట్ల‌లో కూడా విశేష‌మైన ర్యాలీ చోటు చేసుకుంది. ద‌క్షిణ కొరియాకు చెందిన కోస్పి 6.87%, జ‌పాన్ నిక్కీ 225 ఇండెక్స్ 5.39% లాభ‌ప‌డ్డాయి. షాంఘై ఎస్ఎస్ఇ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హ్యాంగ్‌సెంగ్ ఇండెక్స్ కూడా మంచి ర్యాలీలు సాధించాయి. 


No comments:

Post a Comment

మ‌త్తు వ‌దిలింది..బుల్ రంకె వేసింది

కొద్ది నెల‌లుగా నిద్ర‌మ‌త్తులో ఉన్న బుల్ ఒక్క‌సారిగా మ‌త్తు వ‌దిలించుకుని రంకె వేసింది. త‌మ మ‌ధ్య సాగుతున్న యుద్ధానికి అమెరికా, ఇరాన్ రెండు ...