Thursday, September 2, 2021

బుల్ హ‌ల్ చ‌ల్‌

గ‌స్టు నెల అంతా వీర‌విహారం చేసిన స్టాక్‌మార్కెట్ బుల్ ఈ నెల ఒక‌టో తేదీన స్వ‌ల్పంగా వెనుక‌డుగేసిన‌ట్టు క‌నిపించినా రెండో రోజు రెచ్చిపోయాయి. స్థూల ఆర్థిక గ‌ణాంకాల ప‌ట్ల సంతృప్తి పొందిన ఇన్వెస్ట‌ర్లు భారీగా నిధులు ఇన్వెస్ట్ చేయ‌డంతో ప్ర‌పంచ షేర్లు లాభాల్లో దూసుకుపోవ‌డం భార‌త మార్కెట్ కు ఉత్తేజంనింపింది. ఐటి, ఎఫ్ఎంసిజి, బ్యాంకు షేర్ల కొనుగోళ్ల‌తో స్టాక్ ఇండెక్స్ లు కొత్త శిఖ‌రాల‌కు చేరి కొత్త శిఖ‌రాల్లోనే క్లోజ‌య్యాయి. సెప్టెంబ‌ర్ రెండ‌వ తేదీన బిఎస్ఇ సెన్సెక్స్ 514.33 పాయింట్లు లాభ‌ప‌డి కొత్త జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 57852.54 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. ఒక్క ఆగ‌స్టు నెల‌లోనే సెన్సెక్స్ 9 శాతం లాభ‌ప‌డి 57000 పాయింట్ల‌ను దాటింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 157.90 పాయింట్ల లాభంతో  17234.15 పాయింట్ల వ‌ద్ద క్లోజ‌యింది. బిఎస్ఇ ఎఫ్ఎంసిజి, ఐటి, క‌న్స్యూర్ డ్యూర‌బుల్స్, టెక్నాల‌జీ, బేసిక్ మెటీరియ‌ల్స్, రియ‌ల్టీ ఇండెక్స్ లు 1.56 శాతం మేర‌కు లాభ‌ప‌డ్డాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ విభాగాల సూచీలు మాత్ర‌మే న‌ష్టాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 0.93 శాతం మేర‌కు లాభ‌ప‌డ్డాయి. సెన్సెక్స్ లోని 30 షేర్ల‌లో 22 లాభాల్లో ముగిశాయి. 


చిన్న షేర్ల‌ లాభాల పంట‌

ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 1వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న గ‌ణాంకాల ప్ర‌కారం చిన్న షేర్లు ఇన్వెస్ట‌ర్ల‌కు లాభాల‌పంట పండించాయి. ఈ ఏడాది ర్యాలీలో భాగంగా బిఎస్ఇ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 30.36 శాతం (6270.61 పాయింట్లు), మిడ్ క్యాప్ ఇండెక్స్ 18.19 శాతం (3672.12 పాయింట్లు) లాభ‌ప‌డిన‌ట్టు ఆర్థిక సంవ‌త్స‌రం తొలి ఐదు నెల‌ల తీరుపై జ‌రిగిన విశ్లేష‌ణ‌లో తేలింది. ఇదే కాలంలో సెన్సెక్స్ 16.24 శాతం (57,552.39 పాయింట్లు) లాభ‌ప‌డింది. ఆగ‌స్టులో సెన్సెక్స్, నిఫ్టీల‌తో పోల్చితే స్మాల్ క్యాప్‌, మిడ్ క్యాప్ ఇండెక్స్ లు కాస్తంత మంద‌కొడిగానే ఉన్న‌ప్ప‌టికీ మొత్తం మీద మెరుగైన ప‌నితీరునే ప్ర‌ద‌ర్శించాయ‌ని విశ్లేష‌కులంటున్నారు. ఆగ‌స్టు 4వ తేదీన మిడ్ క్యాప్ ఇండెక్స్ జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 23,872.83 పాయింట్ల‌ను న‌మోదు చేయ‌గా స్మాల్ క్యాప్ ఇండెక్స్ 27,323.18 పాయింట్ల జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిని న‌మోదు చేసింది. ఆగ‌స్టు నెల‌లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.31 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.49 శాతం లాభ‌ప‌డ్డాయి. కార్పొరేట్ కంపెనీల మెరుగైన ఆర్థిక ఫ‌లితాలు, మెరుగు ప‌డిన మార్కెట్ సెంటిమెంట్‌, త‌గినంత లిక్విడిటీ స్టాక్ మార్కెట్ల‌ను ఆదుకున్నాయి. ఏప్రిల్‌, మే నెల‌ల్లో క‌రోనా 2.0 క‌ల్లోలం సృష్టించినా స్టాక్ మార్కెట్ మాత్రం ఆ దాడిని త‌ట్టుకుని నిల‌బ‌డింది. ఎగుమ‌తులు, రోజువారీ ఇ-వే బిల్లులు, స్థూల ప‌న్ను వ‌సూళ్లు, ఆటో అమ్మ‌కాలు కూడా మార్కెట్ ను సానుకూల బాట‌లో నిలిపాయ‌ని, క‌రోనా దాడిని త‌ట్టుకుని కూడా మార్కెట్ నిల‌బ‌డ‌డానికి అదే కార‌ణ‌మ‌ని మోతీలాల్ ఓస్వాల్ ఎవిపి స్నేహ పోద్దార్ అన్నారు.  సాధార‌ణంగా స్థానిక ఇన్వెస్ట‌ర్లు చిన్న షేర్ల పైన‌, విదేశీ ఇన్వెస్ట‌ర్లు బ్లూచిప్ షేర్ల పైన మ‌క్కువ ప్ర‌ద‌ర్శిస్తార‌ని విశ్లేష‌కులంటున్నారు. బ్లూచిప్ ల‌తో పోల్చితే ఐదో వంతు విలువ ప‌లికే షేర్ల‌ను మిడ్ క్యాప్ ఇండెక్స్, ప‌దో వంతు విలువ ఉండే షేర్ల‌ను స్మాల్ క్యాప్ ఇండెక్స్ ట్రాక్ చేస్తాయి. 


గ‌త ఏడాది సూచీల లాభాలు

గ‌త ఆర్థిక‌సంవ‌త్స‌రంలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 114.89 శాతం (11040.89 పాయింట్లు), మిడ్ క్యాప్ ఇండెక్స్ 90.93 శాతం (9611.38 పాయింట్లు) లాభ‌ప‌డ్డాయి. సెన్సెక్స్ 68 శాతం (20,040.66 పాయింట్లు) లాభ‌ప‌డింది. 


రెండు మూడేళ్లు జోరే...

వ‌చ్చే రెండు మూడు సంవ‌త్స‌రాల కాలంలో స్టాక్ మార్కెట్ మంచి వృద్ధినే సాధించ‌వ‌చ్చున‌ని అంటున్నారు. ఆర్థిక వృద్ధికి దీటుగా స్మాల్ క్యాప్‌, మిడ్ క్యాప్ కంపెనీలు కూడా ప్ర‌యోజ‌నం పొందుతాయ‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నారు. అయితే స్మాల్ క్యాప్ స్టాక్ ల విష‌యంలో రిటైల్ ఇన్వెస్ట‌ర్లు అమిత ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డ‌మే కాస్తంత ఆందోళ‌న‌క‌ర‌మైన అంశ‌మ‌న్న‌ది కొంద‌రి వాదం. 


No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...