Monday, April 15, 2024

ద్ర‌వ్యోల్బ‌ణం క‌ట్ట‌డిపై ప్ర‌భుత్వంతో ఘ‌ర్ష‌ణ త‌ప్ప‌లేదు


ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ, పి.చిదంబ‌రం నాయ‌క‌త్వ‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్‌బిఐని విభిన్న ర‌కాలుగా ఒత్తిడికి గురి చేసేదా...? అవున‌నే అంటున్నారు ఆర్‌బిఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ దువ్వూరి సుబ్బారావు. తాజాగా ర‌చించిన  "Just A Mercenary?: Notes from My Life and Career" (కేవ‌లం ఒక కూలీ? :  నా జీవితం, కెరీర్ నుంచి కొన్ని ఘ‌ట్టాలు) పుస్త‌కంలో ఆయ‌న ఈ విష‌యం వివ‌రించారు. వారిరువురి నాయ‌క‌త్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వ‌డ్డీరేట్లు త‌గ్గించాల‌ని, ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను ప్ర‌భావితం చేసేందుకు వీలుగా దేశంలో ఆర్థిక స్థితి అంతా స‌జావుగా ఉన్న‌ట్టు నివేదిక‌లు ఇవ్వాల‌ని ఆర్ బిఐని ఒత్తిడి చేస్తూ ఉండేద‌ని తెలిపారు. అయితే ప్ర‌భుత్వానికి, కేంద్ర బ్యాంకుకు మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ఒక్క భార‌త‌దేశానికి లేదా ఏదైనా ఇత‌ర‌ వ‌ర్థ‌మాన దేశానికే ప‌రిమితం కాద‌ని; స‌ంప‌న్న దేశాల్లో కూడా ఇలాంటి ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రి క‌నిపిస్తూ ఉంటుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. చిదంబ‌రం, ముఖ‌ర్జీ ఇద్ద‌రితోనూ త‌న‌కు ఇలాంటి సంఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం ఉండేద‌ని, అయితే వారిద్ద‌రి వైఖ‌రిలోనూ భిన్న ధోర‌ణి మాత్రం ఉండేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. చిదంబ‌రం ఎంతో తెలివిగా ఒక న్యాయ‌వాది వ‌లె త‌న వాదాన్ని వినిపించే వార‌ని, కాని స‌ర్వోత్కృష్ట రాజ‌కీయ‌వేత్త అయిన‌ ముఖ‌ర్జీ అందుకు భిన్నంగా త‌న అభిప్రాయం మాత్రం తెలియ‌చేసి కేసును వాదించే బాధ్య‌త అధికారులకు వ‌దిలివేసే వార‌ని ఆయ‌న తెలిపారు. ధోర‌ణి ఏదైనా కూడా అది ఆర్‌బిఐకి మాత్రం అసౌక‌ర్యంగానే ఉండేద‌ని సుబ్బారావు వివ‌రించారు.

కేంద్ర బ్యాంకు స్వ‌యంప్ర‌తిప‌త్తిపై ప్ర‌భుత్వంలో అతి త‌క్కువ అవ‌గాహ‌న‌, సునిశిత‌త్వం ఉండేవ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అటు ప్ర‌భుత్వంలోను, ఇటు ఆర్‌బిఐలోను ప‌ని చేసిన వ్య‌క్తిగా తాను ఈ విష‌యం చెబుతున్నాన‌ని ఆయ‌న అన్నారు. సుబ్బారావు కేంద్రంలో ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిగా 2007-08 కాలంలో ప‌ని చేశారు. ప్ర‌పంచ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద కార్పొరేట్ వైఫ‌ల్యంగా పేరొందిన లేమ‌న్ బ్ర‌ద‌ర్స్ దివాలా ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌డానికి (2008 సెప్టెంబ‌రు 16) కొద్ది రోజుల ముందే 2008 సెప్టెంబ‌రు 5వ తేదీన సుబ్బారావు 5 సంవ‌త్స‌రాల కాలానికి ఆర్‌బిఐ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు.

"Reserve Bank as the Government's Cheerleader?" (ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌న్నింటికీ తానా తందానా అంటూ వంత‌పాడే పాట‌గాడుగా రిజ‌ర్వ్ బ్యాంక్ పేరిట రాసిన అధ్యాయంలో వ‌డ్డీరేట్లు త‌గ్గించాల‌నేందుకే ప్ర‌భుత్వ ఒత్తిడి ప‌రిమితం కాలేద‌ని సుబ్బారావు స్ప‌ష్టం చేశారు. ఆర్థిక శాఖ ఒత్తిడి వ‌డ్డీరేట్ల త‌గ్గింపున‌కే ప‌రిమితం కాలేద‌ని, చివ‌రికి గ‌డ్డు స్థితిలో ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థలో అంతా స‌జావుగానే ఉన్న‌ట్టు చెప్పాల‌న్న స్థాయికి కూడా చేరింద‌ని ఆయ‌న వివ‌రించారు. అలాంటి ఒక సంఘ‌ట‌న‌ను ఆయ‌న వెల్ల‌డించారు. 

"అప్ప‌ట్లో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అర్వింద్ మ‌యారామ్ ఆర్థిక కార్య‌ద‌ర్శిగా, కౌశిక్ బ‌సు ప్ర‌భుత్వ ముఖ్య ఆర్థిక స‌ల‌హాదారుగా ప‌ని చేస్తున్నారు. వారంద‌రూ ఆర్‌బీఐ అంచ‌నాల‌కు భిన్నంగా త‌మ అంచ‌నాలు ప్ర‌తిపాదించారు. అవి మా అంచ‌నాల‌కు చాలా దూరంగా ఉన్నాయ‌ని నేను భావించాను" అని రాశారు. చివ‌రికి సంభాష‌ణ‌లు హేతుబ‌ద్ధ‌త నుంచి స్వార్థ‌పూరిత ల‌క్ష్యాల దిశ‌గా మార‌డం త‌న‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ని చెప్పారు. అధిక వృద్ధి, త‌క్కువ ద్రవ్యోల్బ‌ణం ఉన్న‌ట్టుగా అంచ‌నాలు ఇవ్వాల‌ని వారు కోరేంత వ‌ర‌కు సంభాష‌ణ‌లు వెళ్లాయ‌న్నారు.
"ఒక ద‌శ‌లో అయితే మ‌యారామ్ ప్ర‌పంచంలో అన్ని దేశాల ప్ర‌భుత్వాలు, కేంద్ర బ్యాంకులు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటున్నాయి. కాని ఆర్‌బిఐ అందుకు భిన్నంగా ధిక్కార ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తోంది" అన్నార‌ని సుబ్బారావు వెల్ల‌డించారు. 

ప్ర‌భుత్వానికి వంత‌పాట‌దారుగా ఆర్‌బిఐ ఉండాల‌న్న డిమాండు త‌న ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌యింద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. అయితే  వృత్తిప‌ర‌మైన స‌మ‌గ్ర‌త‌ను వ‌దిలి ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను శాంతింప‌చేసే విధంగా ఆర్‌బిఐ అంచ‌నాలు ఇవ్వ‌కూడ‌ద‌న్న గ‌ట్టి ప‌ట్టుద‌ల తాను ప్ర‌ద‌ర్శించాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 

2012 అక్టోబ‌రులో చిదంబ‌రం ఆర్థిక‌మంత్రిగా తిరిగి వ‌చ్చిన త‌ర్వాత ఒక సంఘ‌ట‌న‌ను కూడా సుబ్బారావు ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ముఖ‌ర్జీ యంత్రాంగం అనుస‌రించిన కాఠిన్యాన్ని తొల‌గించి స‌ర‌ళ‌మైన వైఖ‌రి అనుస‌రించాల‌ని భావించిన చిదంబ‌రం వ‌డ్డీరేట్లు త‌గ్గించాల‌ని ఆర్‌బిఐపై ఎన‌లేని ఒత్తిడి తెచ్చార‌ని, అయినా తాను లొంగ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. త‌న తిర‌స్కార ధోర‌ణి చిదంబ‌రం త‌న వైఖ‌రిని ప్ర‌జ‌ల ముందుకే తీసుకెళ్లాల‌ని భావించార‌ని కూడా మాజీ ఆర్‌బిఐ గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. ద్ర‌వ్యోల్బ‌ణ ధోర‌ణులను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆర్‌బిఐ క‌ఠిన‌త‌ర ద్ర‌వ్య విధానం ప్ర‌క‌టించిన కొద్ది సేప‌టికే నార్త్ బ్లాక్ (ఆర్థిక శాఖ కార్యాల‌యం) వెలుప‌ల మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ" ద్ర‌వ్యోల్బ‌ణంతో పాటుగా వృద్ధి కూడా కీల‌క‌మే.  వృద్ధి విష‌యంలో ఎదుర‌వుతున్న స‌వాలును ప్ర‌భుత్వం ఒంట‌రిగానే ఎదుర్కొనాల్సి వ‌స్తే ఒంట‌రి పోరాటం చేయ‌డానికి కూడా మేం సిద్ధం" అన్నార‌ని సుబ్బారావు గుర్తు చేసుకున్నారు.

కెరీర్ ప్రారంభం నుంచి త‌న ప్ర‌యాణంలోని ముఖ్య ఘ‌ట్టాల‌ను, త‌న ఆశ‌లు, నిరాశ‌లు;  త‌న విజ‌యాలు, వైఫ‌ల్యాలు; త‌న త‌ప్పులు, పొర‌పాట్లు;  తాను నేర్చుకున్న పాఠాలు అన్నీ 74 సంవ‌త్స‌రాల సుబ్బారావు ఈ పుస్త‌కంలో స‌వివ‌రంగా ప్ర‌స్తావించారు. 1974లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉత్త‌ర కోస్తాలోని పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన స‌మ‌యంలో గిరిజ‌నాభివృద్ధి విష‌యంలో మ‌రింత ఉత్సాహం, పేద‌రికం గురించి మ‌రింత అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌డం ప్ర‌ధాన‌మ‌ని తాను భావించిన‌ట్టు చెప్పారు. స‌రిగ్గా 40 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీవ్ర‌మైన విదేశీమార‌క ద్ర‌వ్య సంక్షోభం న‌డుమ‌న 2013లో ఆర్‌బిఐ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న కాలంలో అస‌మాన‌త‌ల‌తో అల్లాడుతున్న ప్ర‌పంచంలో వ‌ర్థ‌మాన ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు ఎదుర్కొంటున్న క‌ఠోర స‌వాళ్ల గురించి తాను తెలుసుకోగ‌లిగాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. సుబ్బారావు ప్ర‌స్తుతం అమెరికాకు చెందిన యేల్ జాక్స‌న్  విశ్వ‌విద్యాల‌యం సీనియ‌ర్ ఫెలోగా ప‌ని చేస్తున్నారు.


No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...