Thursday, April 4, 2024

మూడు కోట్ల మారుతి


దేశంలో సుజుకి మోటార్ కార్పొరేష‌న్ (ఎస్ఎంసి) మూడు కోట్ల కార్ల ఉత్ప‌త్తి మైలురాయిని దాటింది. అయితే త‌న మాతృదేశంలో ఈ మైలురాయిని సాధించిన స‌మ‌యం క‌న్నా వేగంగా ఎస్ఎంసి భార‌త్ లో ఈ రికార్డు న‌మోదు చేసింది.  ఈ ఏడాది మార్చి చివ‌రి నాటికి త‌మ అనుబంధ సంస్థ మారుతి సుజుకి ఇండియా మూడు కోట్ల కార్ల ఉత్ప‌త్తి మైలురాయిని దాటింద‌ని ఎస్ఎంసి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. "జ‌పాన్ త‌ర్వాత ప్ర‌పంచంలో ఎస్ఎంసి ఈ మైలురాయిని న‌మోదు చేసిన రెండో దేశం భార‌త్‌. జ‌పాన్‌లో ఈ మైలురాయిని చేర‌డానికి 55 సంవ‌త్స‌రాల 2 నెల‌ల కాలం ప‌డితే భార‌త్ లో 40 సంవ‌త్స‌రాల 4 నెల‌ల కాలంలోనే ఈ ఘ‌న‌త సాధించింది" అని ఎస్ఎంసి తెలిపింది. 
కేంద్ర‌ప్ర‌భుత్వం, సుజుకి మోటార్ కార్పొరేషన్‌ జాయింట్ వెంచ‌ర్ అయిన మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ తొలి మోడ‌ల్ కారు మారుతి 800 ఉత్ప‌త్తిని 1983లో ప్రారంభించింది. తొలి కారు మారుతి 800ను 1983 డిసెంబ‌రు 14వ తేదీన మార్కెట్లోకి విడుద‌ల చేసింది. ఢిల్లీ మార్కెట్లో నాడు కారు ధ‌ర రూ.52,500. ఆ రోజుల్లో ఆ కారుకి భారీ డిమాండు ఉంది. పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించిన లాట‌రీలో ఎంపికైన తొలి క‌స్ట‌మ‌ర్లు 10 మందికి నాటి ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా కార్ల తాళాలు అందించారు. అలా ప్రారంభ‌మైన మారుతి ప్ర‌స్థానం 2024 మార్చి చివ‌రి నాటికి 3 కోట్ల కార్ల ఉత్ప‌త్తి మైలురాయిని దాటింది. 
ప్ర‌స్తుతం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కు (ఎంఎస్ఐఎల్‌) గురుగ్రామ్‌, మ‌నేసార్ (హ‌ర్యానా), హ‌న్స‌ల్‌పూర్ ల‌లో (గుజ‌రాత్‌) మారుతి త‌యారీ ప్లాంట్లున్నాయి.  ఈ యూనిట్ల నుంచి నిరంత‌రం కార్లు వెలుప‌లికి వ‌స్తూ ఉన్నాయి. "ఈ 3 కోట్ల కార్ల‌లో 2.68 కోట్ల కార్లు హ‌ర్యానా కేంద్రంగా ప‌ని చేస్తున్న రెండు ప్లాంట్ల‌లోనే ఉత్ప‌త్తి అయ్యాయి. 32 ల‌క్ష‌ల కార్లు ఎంఎస్ఐఎల్ అనుబంధ సంస్థ సుజుకి మోటార్ గుజ‌రాత్ ప్లాంట్ లో ఉత్ప‌త్తి అయ్యాయి" అని కంపెనీ పేర్కొంది.
ఎం 800 సంచ‌ల‌నం

తొలి మారుతి కారు ఎం 800 దేశంలో వ్య‌క్తిగ‌త ర‌వాణాను విప్ల‌వాత్మ‌కంగా మార్చి వేసింది. 29 ల‌క్ష‌ల‌కు పైగా యూనిట్ల‌తో ఈ మోడ‌ల్ ఈ 3 కోట్ల మైలురాయి సాధ‌న‌లో కీల‌క పాత్ర పోషించింది. త‌ర్వాతి కాలంలో ఆల్టో 800, ఆల్టో కె10, స్విఫ్ట్, వేగ‌న్‌-ఆర్‌, డిజైర్‌, ఓమ్ని, బాలెనో, ఈకో, బ్రెజ్జా, ఎర్టిగా కార్లు కూడా ఈ మైలురాయిని సాధించ‌డంలో త‌మ వంతు వాటా అందించాయి.  
"మేక్ ఇన్ ఇండియా"కు క‌ట్టుబ‌డి ఉన్నాం

"మేం "మేక్ ఇన్ ఇండియా"కు క‌ట్టుబ‌డి ఉన్నాం. దేశీయ‌, ప్ర‌పంచ మార్కెట్ల అవ‌స‌రాలు తీర్చ‌డం ల‌క్ష్యంగా దేశంలో మా కార్య‌క‌లాపాలు ప‌టిష్ఠం చేస్తున్నాం. మొత్తం కార్ల ఎగుమ‌తుల్లో 40 శాతం వాటా మేం కొన‌సాగిస్తాం. క‌స్ట‌మ‌ర్ల డిమాండ్లు, ఆకాంక్ష‌లు తీర్చ‌డం కోసం మేం కార్ల ఉత్ప‌త్తిపై మరింత‌గా ఇన్వెస్ట్  చేస్తాం. 2030-31 నాటికి కార్ల వార్షిక ఉత్ప‌త్తిని 40 ల‌క్ష‌ల‌కు పెంచుతున్నాం. ఇందులో భాగంగా హ‌ర్యానాలోని ఖార్కోడా, గుజ‌రాత్‌ల‌లో రెండు కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయ‌బోతున్నాం. మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి కార్ల మోడ‌ళ్ల సంఖ్య‌ను 2030-31 నాటికి 28కి పెంచాల‌నుకుంటున్నాం". 
- ఎంఎస్ఐఎల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్, సిఇఓ హిసాషి ట‌కూచీ


No comments:

Post a Comment

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...