Monday, April 29, 2024

వ‌సూల్ రాజాలూ...కాస్తంత త‌గ్గండి

...ఆర్‌బిఐ హెచ్చ‌రిక ఇది. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు క‌స్ట‌మ‌ర్ల‌పై వ‌డ్డీ విధించే విష‌యంలో నానా ర‌కాల అడ్డ‌దారులూ తొక్కుతున్న‌ట్టు ఫిర్యాదులు వ‌స్తున్న త‌రుణంలో ఆర్‌బిఐ వాటిపై దృష్టి పెట్టింది. వ‌డ్డీల విష‌యంలో అనుచిత దోర‌ణుల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని, ఒక వేళ ఇప్ప‌టికే అలాంటి ధోర‌ణుల‌కు పాల్ప‌డిన‌ట్ట‌యితే సంస్థాగ‌తంగా అవ‌స‌ర‌మైన మార్పులు చేయ‌డం స‌హా త‌గు దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నియంత్రిత సంస్థ‌ల‌ను (ఆర్ఇ) ఆదేశించింది. ఇప్ప‌టికే క‌స్ట‌మ‌ర్ల నుంచి వ‌సూలు చేసిన అద‌న‌పు చార్జీలు కూడా వాప‌సు చేయాల‌ని కూడా సూచించింది. 2003 సంవ‌త్స‌రం నుంచి ఆర్‌బిఐ త‌న నియంత్ర‌ణ‌లోని బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల‌కు వ‌డ్డీరేట్ల విష‌యంలో త‌గు స్వేచ్ఛ ఇస్తూనే అనుచిత ధోర‌ణుల క‌ట్ట‌డి కోసం మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేస్తూ వ‌స్తోంది. వ‌డ్డీరేట్ల విష‌యంలో స్వ‌చ్ఛ‌త‌, పార‌ద‌ర్శ‌క‌త‌ను ప్రోత్స‌హించ‌డం ఈ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌ధాన ల‌క్ష్యం. కాగా ఆర్‌బిఐ తాజాగా ఒక స‌ర్కుల‌ర్ జారీ చేస్తూ "ఆర్‌బిఐ బృందాలు క్షేత్ర‌స్థాయిలో నిర్వ‌హించిన త‌నిఖీల్లో అనేక అవ‌క‌త‌వ‌క‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. 2023 మార్చి 31వ తేదీతో ముగిసిన ఏడాది కాలంలో వ‌డ్డీరేట్ల విష‌యంలో ఎన్నో అనుచిత ధోర‌ణులు ఆ బృందాల దృష్టికి వ‌చ్చాయి" అని పేర్కొంది. ఈ స‌ర్కుల‌ర్ త‌క్ష‌ణం అమ‌లులోకి వ‌స్తుంద‌ని కూడా తెలిపింది.వివిధ నియంత్రిత సంస్థ‌లు పాల్ప‌డిన‌, పాల్ప‌డుతున్న అక్ర‌మాలు కొన్నింటిని కూడా ఆర్‌బిఐ ప్ర‌స్తావించింది. అవి...


  • రుణగ్ర‌హీత‌కు రుణం అందించిన తేదీ నుంచి కాకుండా రుణం మంజూరు చేసిన తేదీ లేదా రుణ ఒప్పందంపై సంత‌కాలు చేసిన తేదీ నుంచే కొన్ని సంస్థ‌లు వ‌డ్డీలు వ‌సూలు చేస్తున్నాయి.
  • రుణం మొత్తానికి సంబంధించిన చెక్కును క‌స్ట‌మ‌ర్‌కు అందించిన తేదీ నుంచి కాకుండా చెక్కు త‌యారుచేసిన తేదీ నుంచే వ‌డ్డీ వ‌సూలు చేస్తున్నాయి. చెక్కు సిద్ధం చేసిన ఎన్నో రోజుల త‌ర్వాత గాని క‌స్ట‌మ‌ర్ చేతికి చెక్కు అందించ‌డంలేదు. 
  • రుణం తిరిగి చెల్లించిన స‌మ‌యంలో కూడా ఏ తేదీతో రుణం తీరిపోయిందో ఆ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం చేయ‌కుండా నెల మొత్తానికి వ‌డ్డీ వ‌సూలు చేస్తున్నాయి. 
  • కొన్ని కేసుల్లో ఆయా సంస్థ‌లు ఒక‌టి లేదా రెండు వాయిదాలు అడ్వాన్స్ గా వ‌సూలు చేసినా పూర్తి మొత్తానికే వ‌డ్డీ వ‌సూలు చేస్తున్నాయి.
ఈ చ‌ర్య‌ల‌న్నీ క‌స్ట‌మ‌ర్ల విష‌యంలో అనుస‌రించాల్సిన‌ స్వ‌చ్ఛ‌త‌, పార‌ద‌ర్శ‌క‌త నియ‌మావ‌ళికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయ‌ని ఆర్‌బిఐ ఆ స‌ర్కుల‌ర్‌లో తెలిపింది. ఇవ‌న్నీ ఆర్‌బిఐకి తీవ్ర ఆందోళ‌న క‌లిగించే చ‌ర్య‌లే. అలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్టు ఆర్‌బిఐ బృందాలు గుర్తించి హెచ్చ‌రిక‌లు జారీ చేసిన సంస్థ‌ల‌న్నీ క‌స్ట‌మ‌ర్ల‌కు అద‌నంగా వ‌సూలు చేసిన సొమ్మును వాప‌సు చేయాలి అని స్ప‌ష్టమైన ఆదేశాలు ఇచ్చింది.


No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...