మార్కెట్ విలువలో బిఎస్ఇ కొత్త రికార్డు
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజిలో (బిఎస్ఇ) లిస్టింగ్ అయిన కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువ మంగళవారం (2024 మే 21వ తేదీ) 5 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని తాకింది. మార్కెట్ నష్టాల్లోనే ముగిసినా ఇంట్రాడేలో ఈ రికార్డు నమోదు కావడం విశేషం. ట్రేడింగ్ ముగిసే సమయానికి అది మరో చారిత్రక గరిష్ఠ స్థాయి 4.97 లక్షల కోట్ల డాలర్ల (రూ.4,14,62,306.56) వద్ద స్థిరపడింది. బిఎస్ఇ ప్రధాన సూచీ సెన్సెక్స్ మంగళవారం 52.63 పాయింట్ల నష్టంతో 73953.31 వద్ద ముగిసింది. ఈ మైలురాయిని చేరడంతో భారత స్టాక్ మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలో ఐదో స్థానానికి చేరింది. అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటి వరకు సెన్సెక్స్ 1713.05 పాయింట్లు లాభపడింది. 2024 ఏప్రిల్ 9వ తేదీన చారిత్రక గరిష్ఠ స్ఠాయి 75124.28 పాయింట్లను నమోదు చేసింది.
మార్కెట్ విలువలో మైలురాళ్లివే...
2023 నవంబరు 29 - తొలిసారిగా 4 లక్షల కోట్ల డాలర్లు తాకింది.
2021 మే 24 - తొలిసారిగా 3 లక్షల కోట్ల డాలర్లను తాకింది.
2017 జూలై 10 - తొలిసారిగా 2 లక్షల కోట్ల డాలర్లను తాకింది.
2007 మే 28 - తొలిసారిగా 1 లక్ష కోట్ల డాలర్లను తాకింది.
- మార్కెట్ విలువ 1 లక్ష కోట్ల డాలర్ల నుంచి 1.5 లక్షల కోట్ల డాలర్లను (2014 జూన్ 6) తాకడానికి 2566 రోజులు పట్టింది. అంటే సుమారుగా ఏడు సంవత్సరాలు.
- మార్కెట్ విలువ 1.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 2 లక్షల కోట్ల డాలర్లకు చేరడానికి 1130 రోజులు పట్టింది. 1 లక్ష కోట్ల డాలర్ల నుంచి 2 లక్షల కోట్ల డాలర్లకు చేరడానికి పట్టిన సమయం 10 సంవత్సరాలు.
- 2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 2.5 లక్షల కోట్ల డాలర్లు (2020 డిసెంబరు 16) చేరడానికి 1255 రోజులు పట్టింది.
No comments:
Post a Comment