Tuesday, May 14, 2024

ముంబై రెస్టారెంట్ల " డెమోక్ర‌సీ డిస్కౌంట్‌"


మండుతున్న ఎండ‌లు. సూర్య‌ప్ర‌తాపానికి బొబ్బ‌లెక్కిపోతున్న శ‌రీరాలు. ఎండిపోతున్న గొంతులు. మామూలుగానే ఎన్నిక‌లంటే ఉండే నిరాస‌క్త‌త‌. దానికి తోడు ఇలాంటి కార‌ణాలు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు ప్ర‌జ‌లు ఇళ్లు దాటి బ‌య‌ట‌కు రావ‌డంలేదు. అలాంటి వారిని బ‌య‌ట‌కు ర‌ప్పించేందుకు ముంబైలోని రెస్టారెంట్లు న‌డుం బిగించాయి. ముంబై న‌గ‌రంలో 21వ తేదీన ఐదో విడ‌త‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతుంది.  ఈ పోలింగ్ ను దృష్టిలో పెట్టుకుని ముంబైలోని రెస్టారెంట్లు రెండు రోజుల పాటు డెమోక్ర‌సీ డిస్కౌంట్ పేరిట ఒక వినూత్న‌మైన ఆఫ‌ర్ ప్ర‌క‌టించాయి. మే 20, 21 తేదీల్లో ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. దీని కింద ముంబై వాసులెవ‌రైనా రెస్టారెంట్ కు వెళ్లి క‌డుపు నిండుగా తిని బ్రేవ్ మ‌ని త్రేన్చిన త‌ర్వత 20 శాతం డిస్కౌంట్‌తో బిల్లు వారి చేతికి వ‌స్తుంది. రెస్టారెంట్లు దానికి "డెమోక్ర‌సీ డిస్కౌంట్" అని పేరు పెట్టాయి. ఆ ర‌కంగా తాము ప్ర‌జ‌లు ఓటు వేసేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చేలా త‌మ వంతు కృషి చేస్తున్నామ‌ని భార‌త జాతీయ రెస్టారెంట్ల సంఘం (ఎన్ఆర్ఏఐ) ముంబై చాప్ట‌ర్ ప్రెసిడెంట్ రాచెల్ గోయెంకా తెలిపారు.  "ముంబై న‌గ‌రానికి స‌మాజం ప‌ట్ల ఎప్పుడూ ఇలాంటి బాధ్య‌త ఒక‌టుంటుంది. ఎన్ఆర్ఏఐ ఛ‌త్రం కింద ప‌లు బ్రాండ్లు ఇందులో భాగ‌స్వాముల‌వుతున్నాయి" అని ఆయ‌న చెప్పారు. ముంబై న‌గ‌ర వాసులే ఈ డిస్కౌంట్ పొందేందుకు అర్హులు. వారు త‌మ ఓట‌ర్ ఐడిని, ఓటు వేసిన‌ట్టుగా ధ్రువీక‌రిస్తూ వేలిపై ఇంక్ ముద్ర‌ను చూపించాల్సి ఉంటుంది. అలాంటి వారికి అయ్యే మొత్తం బిల్లుపై 20 శాతం డిస్కౌంట్ వ‌ర్తింప‌చేసి ఫైన‌ల్ బిల్లు ఇస్తారు. 

No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...