ఈక్విటీ మార్కెట్లకు, వాస్తవ ఆర్థిక వ్యవస్థకు మధ్య అనుసంధానత పోయిందని విమర్శలు వస్తున్నప్పటికీ 2021 సంవత్సరం చివరి నాటికి బిఎస్ఇ సెన్సెక్స్ 50500కి చేరగలదని బిఎన్ పి పారిబా అంచనా వేసింది. భారత ఈక్విటీలకు ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చింది. కరోనా మహమ్మారి దేశంలో ప్రవేశించిన తొలి నెలల్లో స్టాక్ ఇండెక్స్ లు 30 శాతం మేరకు పతనమైనప్పటికీ ఏప్రిల్ లో మార్కెట్లలో పునరుజ్జీవం అనంతరం 70 శాతం మేరకు దూసుకుపోయాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న "అధిక లిక్విడిటీ ", వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్ల పరుగులు ఈ ర్యాలీకి కారణమని విమర్శకులు విశ్లేషించారు. అయితే కొన్ని షేర్ల వైపే అందరూ పరుగులు తీస్తూ ఉండడం ఆందోళనకరమైన అంశమని కొందరు విమర్శకులంటున్నారు.
"షేర్ల ఎంపిక వరకు వస్తే రెండు అంశాలు ప్రధానం. పెద్ద షేర్ల వాటా అధికంగా ఉండడం, ఆసియా దేశాలతో పోల్చితే భారత ఈక్విటీల్లో నాణ్యత గల షేర్లు అధికంగా ఉండడం" అని బిఎన్ పి పారిబా విశ్లేషకులు తెలిపారు. "భారత ఆర్థిక వ్యవస్థలో త్వరిత రికవరీ కనిపిస్తోంది. ఆటో అమ్మకాలు, ఉక్కు, సిమెంట్ వినియోగం, రైల్వే సరకు రవాణా అన్నీ కరోనా ముందు కాలం నాటికి చేరడం భారత్ కు కలిసి వచ్చే అంశం. కొన్ని ప్రాంతాల్లో విచక్షణాత్మక వ్యయాలు పెరుగుతున్నాయి. రిటైల్ డిమాండు పెరిగినట్టు కూడా తయారీ సంస్థలు తెలుపుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ మార్కెట్ చట్టాలు, కార్మిక చట్టాలు, 10 రంగాలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం వంటివి వ్యవసాయ రంగాన్ని, ఎగుమతి అవకాశాలు అధికంగా ఉన్న రంగాల్లోకి పెట్టుబడులను ఉత్తేజితం చేయడానికి ఉద్దేశించినవే. ఇవన్నీ దీర్ఘకాలం పాటు ఆర్థిక వ్యవస్థకు సహాయపడే అంశాలే" అని ఆ నివేదిక తెలిపింది.
సవాళ్లివే...
ఈ వృద్ధిలో స్థిరత్వం ఒక పెద్ద సవాలని బిఎన్ పి పారిబా తెలిపింది. పట్టణ ప్రజల ఆదాయాల్లో కొనసాగుతున్న స్తబ్ధత, దీర్ఘకాలం పాటు కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణం, ప్రశ్నార్థకంగా ఉన్న బ్యాంకుల ఆస్తుల నాణ్యత, పట్టణ నిరుద్యోగిత వంటి అంశాలన్నీ ఆందోళన కలిగించే అంశాలని స్పష్టం చేసింది. పట్టణాదాయాలు, పెట్టుబడులకు మద్దతు లభించాలంటే తక్కువ సామర్థ్య వినియోగం పెరగాలని తెలిపింది.
------------------------------------------------
మార్కెట్లో కొనసాగిన ర్యాలీ
స్టాక్ మార్కెట్లో ర్యాలీ నిర్నిరోధంగా కొనసాగుతోంది. ఈక్విటీ ఇండెక్స్ లు ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను చేరుతూనే ఉన్నాయి. మంగళవారంనాడు కూడా ఈక్విటీ సూచీలు కొత్త గరిష్ఠ స్థాయిలను నమోదు చేశాయి. రూపాయి బలహీనత, లాభాల స్వీకారం కారణంగా ఒక దశలో ఇండెక్స్ లు ప్రారంభ లాభాలను పోగొట్టుకున్నా ఫైనాన్స్, మెటల్ స్టాక్ లు అద్భుతంగా లాభపడడంతో ఇండెక్స్ లు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 9.71 పాయింట్ల లాభంతో 46263.17 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 9.70 పాయింట్ల లాభంతో 13567.85 వద్ద ముగిసింది. ఈ రెండూ కొత్త గరిష్ఠ స్థాయిలే.
సూచీలు నమోదు చేసిన ఇంట్రాడే గరిష్ఠ స్థాయిలు...
సెన్సెక్స్ - 46373.34 (డిసెంబర్ 14)
నిఫ్టీ - 13597.50 (డిసెంబర్ 14)