Saturday, November 14, 2020

కొత్త సంవ‌త్ కు శుభారంభం

మూర‌త్ సెష‌న్ లో రెట్టించిన ఉత్సాహం

స‌రికొత్త గ‌రిష్ఠ స్థాయిల్లో ముగిసిన సూచీలు


దేశీయ స్టాక్ మార్కెట్ కొత్త హిందూ సంవ‌త్స‌రం సంవ‌త్ 2077కి శుభారంభం ప‌లికింది. దీపావ‌ళి ప‌ర్వ‌దినాన గంట సేపు జ‌రిగిన ప్ర‌త్యేక ట్రేడింగ్ లో ఇండెక్స్ లు స‌రికొత్త గ‌రిష్ఠ స్థాయిల్లో ముగిశాయి. గంట వ్య‌వ‌ధిలోనే సెన్సెక్స్ 388 పాయింట్లు పెరిగి జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 43,831 వ‌ద్ద‌,  నిఫ్టీ 12,829 పాయింట్ల‌ను తాకాయి. చివ‌రికి సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంతో 43,638, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 12,780 పాయింట్ల వ‌ద్ద ముగిశాయి. 


2019 దీపావ‌ళి ప‌ర్వ‌దినాన జ‌రిగిన మూర‌త్ ట్రేడింగ్ నుంచి సంవ‌త్ 2076 ముగింపు వ‌ర‌కు సెన్సెక్స్ 4383.94 పాయింట్లు, నిఫ్టీ 1136 పాయింట్లు లాభ‌పడిన విష‌యం విదిత‌మే.


కొనుగోళ్ల జోరు

మూర‌త్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట‌ర్లు, ట్రేడ‌ర్లు రెట్టించిన ఉత్సాహంతో కొనుగోళ్లు జ‌రిపారు. ఎన్ఎస్ఇలో లిస్టింగ్ అయిన‌ మొత్తం 11 రంగాల్లోనూ కొనుగోళ్లు జ‌రిగాయి. నిఫ్టీ ఐటి ఇండెక్స్ 0.5 శాతం లాభ‌ప‌డ్డాయి. బ్యాంకింగ్‌, ఆటో, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసులు, ఎఫ్ఎంసిజి, రియాల్టీ విభాగాల్లో అద్భుతంగా కొనుగోళ్లు న‌మోద‌య్యాయి. మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ షేర్లు మొత్తం లాభాల్లో అధిక వాటా సాధించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.40 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.70 శాతం లాభ‌ప‌డ్డాయి.  మొత్తం 1834 షేర్లు లాభాల‌తో ముగియ‌గా 614 షేర్లు న‌ష్టాల‌తో ముగిశాయి. 

- భార‌త్ పెట్రోలియం 4 శాతానికి పైగా లాభ‌ప‌డి అగ్ర‌స్థానంలో ఉంది. ఇండియ‌న్ ఆయిల్‌, టాటా మోటార్స్, హెచ్ డిఎఫ్ సి లైఫ్‌, స‌న్ ఫార్మా, కోల్ ఇండియా, గెయిల్‌, టాటా స్టీల్‌, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, భార‌తి ఎయిర్ టెల్‌, యుపిఎల్ లాభ‌ప‌డిన షేర్ల‌లో ఉన్నాయి. 

- హిండాల్కో, హీరో మోటో కార్ప్, హిండాల్కో, జెఎస్ డ‌బ్ల్యు స్టీల్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ‌జాజ్ ఫైనాన్స్, శ్రీ సిమెంట్స్, టైటాన్‌, యాక్సిస్ బ్యాంక్‌, ప‌వ‌ర్ గ్రిడ్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ షేర్లు న‌ష్ట‌పోయాయి. 


No comments:

Post a Comment

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...