- అంచనాలను మించి రికవరీ
- రెండో త్రైమాసికం క్షీణత -7.5%
భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన సమయం కన్నా వేగంగానే రికవరీ సాధించింది. జూలై-సెప్టెంబర్ (క్యు2) త్రైమాసికంలో -7.5 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. కేంద్ర గణాంకాల సంస్థ (సిఎస్ఓ) ప్రకటించిన తాజా గణాంకాలు ఈ అంశం వెల్లడిస్తున్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) కరోనా మహమ్మారిని అదుపు చేయడానికి విస్తృతంగా అమలుపరిచిన జాతీయ స్థాయి లాక్ డౌన్ ప్రభావం వల్ల జిడిపి -23.9 శాతం క్షీణతను నమోదు చేసింది. జూన్ నుంచి లాక్ డౌన్లు క్రమంగా సడలిస్తూ రావడంతో రెండో త్రైమాసికంలో ఈ క్షీణత -7.5 శాతానికి తగ్గింది. అయినా వరుసగా రెండో త్రైమాసికంలో కూడా ప్రతికూల వృద్ధి నమోదు కావడంతో ఆర్థిక వ్యవస్థ సాంకేతిక తిరోగమనంలో ప్రవేశించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో 4.4 శాతం వృద్ధి నమోదయింది. ప్రభుత్వ వ్యయాలు 12 శాతం తగ్గాయి. ఇదే తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో వృద్ధి క్షీణత -15.7 శాతం ఉంది.
త్రైమాసికంలో వివిధ విభాగాల వృద్ధి
- తయారీ రంగం ఆశ్చర్యకరంగా 0.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొదటి త్రైమాసికంలో తయారీ రంగం 39 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది.
- ప్రోత్సాహకరమైన రుతుపవనాల ప్రభావం వల్ల వ్యవసాయ రంగం 3.4 శాతం వృద్ధి సాధించింది. విద్యుత్, గ్యాస్ రంగాలు 4.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
- ఆర్థిక, రియల్ ఎస్టేట్ రంగాలు 8.1 శాతం క్షీణతను నమోదు చేయగా వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ రంగాలు 15.6 శాతం క్షీణించాయి.
- ఉపాధి కల్పనలో రెండో స్థానంలో ఉన్న నిర్మాణరంగం వృద్ధి -8.6 శాతం ఉంది. క్యు1లో నమోదైన ప్రతికూల వృద్ధి -50 శాతం నుంచి కోలుకుంది.
- స్థిర ధరల కింద 2020-21 రెండో త్రైమాసికం జిడిపి వాస్తవిక విలువ రూ.33.14 లక్షల కోట్లుంది. గత ఏడాది రెండో త్రైమాసికంలో ఇది రూ.35.84 లక్షల కోట్లు.
No comments:
Post a Comment