ఈ ఏడాది వృద్ధి -1.5%
వచ్చే ఏడాది అద్భుతమైన రికవరీ
కొవిడ్-19, దీర్ఘకాలిక లాక్ డౌన్ ప్రభావం వల్ల దేశంలో్ వినియోగ విశ్వాసం గణనీయంగా క్షీణించిందని, ఫలితంగా ఈ ఏడాది ఆర్థిక రంగం 1.5 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేయవచ్చునని ఆర్ బిఐ చెబుతోంది. మే నెలకు నిర్వహించిన వినియోగ విశ్వాస సర్వేను ఆర్ బిఐ గురువారం విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల సూచి (సిఎస్ఐ) చారిత్రక గరిష్ఠ స్థాయికి క్షీణించగా భవిష్యత్ అంచనాల సూచి (ఎఫ్ఇఐ) కూడా భారీ క్షీణతను నమోదు చేసినట్టు ఆర్ బిఐ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతానికి వృద్ధిరేటు క్షీణించినా 2021-22 ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధిరేటు 7.2 శాతం వరకు ఉండవచ్చునని తెలిపింది. ప్రస్తుతం మాత్రం సాధారణ ఆర్థిక స్థితిపై అంచనాలు, ఉపాధి అవకాశాలు, గృహరంగంలో ఆదాయాలు భారీ ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయని పలువురు ప్రకటించారు.
సర్వే తీరు...
మే 5-17 తేదీల మధ్యన సర్వే మొత్తం 13 నగరాల్లో ప్రస్తుత కరోనా వాతావరణంలో టెలిఫోనిక్ సంభాషణ రూపంలో జరిగింది. సర్వే జరిగిన ప్రధాన నగరాల్లో అహ్మదాబాద్, బెంగళురు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ముంబై, పాట్నా ఉన్నాయి. మొత్తం 5761 మంది గృహస్థులను ఈ సర్వేలో ప్రశ్నించారు.
సర్వే ముఖ్యాంశాలు... | వాస్తవ తుది వినియోగ వ్యయం (పిఎఫ్ సిఇ) 0.5 శాతం క్షీణించవచ్చు. వచ్చే ఏడాది 6.9 శాతానికి పుంజుకోవచ్చు. | వాస్తవ స్థూల పెట్టుబడుల కల్పన (జిఎఫ్ సిఎఫ్) -6.4 శాతానికి పడిపోయి వచ్చే ఏడాది 5.6% వృద్ధి నమోదు చేయవచ్చు. | వాస్తవ స్థూల విలువ జోడింపు (జివిఏ) -1.7 శాతానికి దిగజారి వచ్చే ఏడాది 6.8% వృద్ధికి పుంజుకోవచ్చు. | ఈ ఏడాదికి ఉద్యోగావకాశాలపై పూర్తి నిరాశావహ స్థితి నెలకొని ఉంది. | -వినియోగదారులు తమ విచక్షణాపూర్వక ఖర్చులను భారీగా కుదించుకున్నారు. ఏడాది చివరి వరకు ఇదే ధోరణి కొనసాగవచ్చు. |
No comments:
Post a Comment