కొత్త కారు కొనుగోలు ప్రస్తుతానికి లేదంటున్న కస్టమర్లు
కొద్ది కాలం క్రితం వరకు సెకండ్ హ్యాండ్ లేదా పలు చేతులు మారిన వాహనాల కొనుగోలు అంటే ప్రజలు విముఖత చూపే వారు. కాని కరోనా సృష్టించిన కల్లోలం అన్ని మార్కెట్ల స్వభావాలను మార్చేసినట్టే కార్ల మార్కెట్ స్వభావాన్ని కూడా మార్చేసింది. లాక్ డౌన్ కు ముందు వరకు కొత్త కారు మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు చెప్పిన వారిలో ఎక్కువ మంది ఇప్పుడు యూజ్డ్ కార్ల కోసం ఎగబడుతున్నారు. కొంత కాలం పాటు యూజ్డ్ కారే వాడాలనుకుంటున్నామని చాలా మంది చెబుతున్నట్టు యూజ్డ్ కార్ల విక్రయ సంస్థ కార్స్ 24 చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గజేంద్ర జంగీద్ తెలిపారు. గత కొద్ది రోజులుగా యూజ్డ్ కార్ల కోసం కస్టమర్ల తాకిడి బాగా పెరిగిందని ఆయన చెప్పారు. మారుతి స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్; హుండై ఐ10, శాంత్రో జింగ్; హోండా సిటీ కార్ల కోసం ఎక్కువ మంది వాకబు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అంతే కాదు, ప్రస్తుతం నడుపుతున్న వాహనం విక్రయించే యోచన కూడా చాలా మంది విరమించుకున్నారు. పాతకారుకే ముస్తాబులు చేయించుకుని కొంత కాలం పాటు నడపాలనుకునే వారే ఎక్కువగా ఉన్నారు.
సొంతకారులోనే తిరుగుతాం
లాక్ డౌన్ అనంతరం సొంతకారులోనే తిరగాలని భావిస్తున్నవారి సంఖ్య కూడా బాగా పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. లాక్ డౌన్ కు ముందు వరకు ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని లేదా పెట్రోల్ ఆదా చేసుకునేందుకు, నిర్వహణ వ్యయాలు తగ్గించుకునేందుకు షేర్డ్ కారులో తిరగాలని కోరుకున్న వారి సంఖ్య అధికంగా ఉండేది. కాని ఇప్పుడు దేశంలో కరోనా వ్యాధి తీవ్రత పెరిగిపోయిన దృష్ట్యా ఎవరూ ప్రజా రవాణా వ్యవస్థలో తిరుగుతామనే సాహసం చేయడంలేదు. కొంత కష్టం అయినా సొంత కారులోనే తిరుగుతామని, ప్రస్తుతానికి అదే సురక్షితమైన ఎంపిక అని పలువురు బహిరంగంగానే చెబుతున్నారు.
No comments:
Post a Comment