Friday, September 3, 2021

3 రోజులు-1000 పాయింట్లు

బుల్ ర‌న్ లో సెన్సెక్స్ జోరు

భార‌త స్టాక్ మార్కెట్ ప్ర‌ధాన సూచి సెన్సెక్స్ కేవ‌లం మూడు రోజుల్లో వెయ్యి పాయింట్లు లాభ‌ప‌డింది. శుక్ర‌వారం తొలిసారిగా 58 వేల మైలురాయిని దాటింది. ఇన్వెస్ట‌ర్లు రిస్క్ తీసుకునే ధోర‌ణిలోకి వెళ్ల‌డం, సానుకూల స్థూల ఆర్థిక గ‌ణాంకాలు, విదేశీ నిధుల రాక‌లో నిల‌క‌డ ధోర‌ణి మార్కెట్ ను ప‌రుగులు తీయించాయి. వ‌రుస‌గా రెండో రోజు కూడా లాభ‌ప‌డిన సెన్సెక్స్ 277.41 పాయింట్లు లాభ‌ప‌డి జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 58129.95 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ మ‌రో జీవిత‌కాల గ‌రిష్ఠ రికార్డు 58194.79 పాయింట్ల‌ను తాకింది. సెన్సెక్స్ 57000 శిఖ‌రాన్ని అధిరోహించిన కేవ‌లం మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే వెయ్యి పాయింట్లు లాభ‌ప‌డి 58000 మైలురాయిని కూడా దాటింది. ఆరు వ‌రుస సెష‌న్ల‌లో ఐదింటిలో సెన్సెక్స్ జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిలు న‌మోదు చేస్తూనే వ‌చ్చింది. ఎన్ఎస్ఇ ప్ర‌ధాన సూచి నిఫ్టీ 89.45 పాయింట్లు లాభ‌ప‌డి 17323.60 పాయింట్ల వ‌ద్ద క్లోజ‌యింది. ఇంట్రాడేలో 17340.10 పాయింట్ల‌ను తాకింది. నిఫ్టీకి ఇవి రెండూ కొత్త జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిలే. మొత్తం మీద రెండు సూచీల‌కు ఇది అద్భుత‌మైన లాభాలు అందించిన వారంగా నిలిచింది. వారంలో సెన్సెక్స్ 2005.23 పాయింట్లు, నిఫ్టీ 618.40 పాయింట్లు లాభ‌ప‌డ్డాయి.  బిఎస్ఇ ఎన‌ర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్‌, మెట‌ల్‌, క‌న్స్యూమ‌ర్ డ్యూర‌బుల్స్ సూచీలు 3.60 శాతం మేర‌కు లాభ‌ప‌డ్డాయి. మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ సూచీలు 0.41 శాతం మేర‌కు లాభ‌ప‌డ్డాయి. 

సంప‌ద‌లో రికార్డు

ఈ ర్యాలీ మ‌ద్ద‌తుతో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.1.53 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు పెరిగి ఆల్ టైమ్ రికార్డు రూ.254.12 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది. ఈ సంవ‌త్స‌రంలో (2021) ఇప్ప‌టివ‌ర‌కు సెన్సెక్స్ 10,378.62 పాయింట్లు లాభ‌ప‌డింది.  

-------------------------------------------- 


2021 సెన్సెక్స్ రికార్డులివే...

2021 జ‌న‌వ‌రి 21 - తొలిసారి 50000 మైలురాయిని చేరింది.

ఫిబ్ర‌వ‌రి  3 - తొలిసారి 50000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 5 - తొలిసారి 51000 మైలురాయిని దాటింది.

ఫిబ్ర‌వ‌రి 8 - తొలిసారి 51000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 15 - తొలిసారి 52000 మైలురాయిని దాటింది.

జూన్ 22 - తొలిసారి 53000 మైలురాయిని తాకింది.

జూలై 7 - తొలిసారి 53000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఆగ‌స్టు 4 - తొలిసారి 54000 మైలురాయిని దాటి, ఆ పైనే క్లోజ‌యింది.

ఆగ‌స్టు 13 - తొలిసారి 55000 శిఖ‌రం దాటి, అంత‌క‌న్నా పైన క్లోజ‌యింది.

ఆగస్టు 18 - తొలిసారి 56000 మైలు రాయిని దాటింది.

ఆగ‌స్టు  27 - తొలిసారి 56000 కన్నా పైన క్లోజ్ అయింది.

ఆగ‌స్టు 31 - తొలిసారి 57000 కన్నా పైన క్లోజ్ అయింది. 

(స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.250 ల‌క్ష‌ల కోట్లు దాటింది).

సెప్టెంబ‌ర్ 3 - తొలిసారి 58000 దాటి అంత‌క‌న్నా పైన క్లోజ‌యింది.

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...