ఈక్విటీ మార్కెట్ లో జోరు ఇంకా ఆగేలా లేదు. బుల్స్ మరోసారి రెచ్చిపోయాయి. ఈక్విటీ సూచీలు కొత్త రికార్డులు నమోదు చేశాయి. అమెరికన్ ఫెడరల్ ప్రకటించిన కఠిన వైఖరికి జంకని అంతర్జాతీయ ఈక్విటీలు పాజిటివ్ ట్రెండ్ కనబడచడంతో పాటు రూపాయి బలపడడం ఇన్వెస్టర్ సెంటిమెంట్ ను బలపరిచింది. ఇన్వెస్టర్లు అన్ని విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టడంతో సెన్సెక్స్ 60,000 పాయింట్ల కొత్త మైలురాయికి అత్యంత సమీపంలో 59,885.36 వద్ద 958.03 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ చరిత్రలో ఇది ఒక కొత్త క్లోజింగ్ రికార్డు. ఒక దశలో సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠ స్థాయి 59,957.25 పాయింట్లను తాకింది. నిఫ్టీ 17,843.90 పాయింట్ల జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకిన అనంతరం 276.30 పాయింట్ల లాభంతో కొత్త గరిష్ఠ స్థాయి 17,822.95 వద్ద ముగిసింది.
- విభాగాలవారీగా చూస్తే ఒక్క ఎఫ్ఎంసిజి మినహా రియల్టీ, బ్యాంకెక్స్, ఎనర్జీ, ఫైనాన్స్, కేపిటల్ గూడ్స్, ఇండస్ర్టియల్స్ సూచీలు 8.71 శాతం వరకు లాభపడ్డాయి. బిఎస్ఇ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా లాభపడ్డాయి.
మార్కెట్ విలువలో కొత్త రికార్డు
గురువారం నాటి రికార్డు లాభాలతో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ ఒక్క రోజులోనే రూ.3,16,778.1 కోట్లు పెరిగి రూ.2,61,73,374.32 కోట్లకు చేరింది.
ఏడాది మొత్తం జోరే
స్టాక్ మార్కెట్ ఏడాది మొత్తం జోరులోనే ఉంది. 2020 మార్చిలో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన రక్తపాతం అనంతరం 2021 సెప్టెంబర్ లో 59000 పాయింట్లకు చేరే నాటికి సెన్సెక్స్ 110 శాతానికి పైగా లాభపడింది. 2021 జనవరిలో తొలిసారిగా సెన్సెక్స్ 50000 పాయింట్లు దాటింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ మధ్య కాలంలో 57000 నుంచి 58000 పాయింట్లకు (1000 పాయింట్లు-3 రోజులు) చేరింది. సెప్టెంబర్ 23 నాటికి 2021 సంవత్సరంలో సెన్సెక్స్ 12,347.86 పాయింట్లు లాభపడింది.
No comments:
Post a Comment