Friday, September 24, 2021

సెన్సెక్స్ ష‌ష్ఠి పూర్తి

స్టాక్ మార్కెట్ శుక్ర‌వారం (24 సెప్టెంబ‌ర్, 2021) మ‌రో చారిత్రక మైలురాయిని చేరింది. స‌రిగ్గా 31 సంవ‌త్స‌రాల కాలంలో సెన్సెక్స్ చారిత్ర‌క‌మైన 60000 పాయింట్ల శిఖ‌రంపై గ‌ర్వంగా నిలిచింది.

ఇండెక్స్ ల తీరిదే...
బిఎస్ఇ సెన్సెక్స్ - 163.11 పాయింట్ల లాభంతో 60,048.47 వ‌ద్ద క్లోజ్‌. ఇంట్రాడే గ‌రిష్ఠ స్థాయి 60,333 పాయింట్లు.
ఎన్ఎస్ఇ నిఫ్టీ - 30.25 పాయింట్ల లాభంతో 17,853.20 వ‌ద్ద క్లోజ్‌. ఇంట్రాడే గ‌రిష్ఠ స్థాయి 17,947.65 పాయింట్లు.

1000 నుంచి 60000కి ప్ర‌యాణం...
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి 1986లో ఏర్పాటు కాగా 1990 జూలై 25వ తేదీన‌ తొలిసారిగా సెన్సెక్స్ 1000 పాయింట్ల మైలురాయిని చేరింది. అప్ప‌టి నుంచి 60000 పాయింట్ల మైలురాయిని చేర‌డానికి 31 సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌ట్టింది. ఈ 31 సంవ‌త్స‌రాల ప్ర‌యాణం ఎన్నో ఎగుడుదిగుడుల‌తో సాగింది. ఇంత‌కాలం సెన్సెక్స్ ప్ర‌యాణం ఒక తీర‌యితే 2021 సంవ‌త్స‌రంలో ప్ర‌యాణం మ‌రోతీరుగా సాగింది. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో కూడా సెన్సెక్స్ రికార్డు బుల్ ర‌న్ లో దూసుకుపోతూ రెండు కీల‌క మైలురాళ్లు దాటింది. 2021 జ‌న‌వ‌రి 21న తొలిసారి  50000 పైన నిల‌దొక్కుకున్న సెన్సెక్స్ కేవ‌లం 9 నెల‌ల కాలంలోనే మ‌రో కీల‌క మైలురాయి 60000 క‌న్నా పైన నిల‌దొక్కుకుంది.

31 సంవ‌త్స‌రాల‌ ప్ర‌యాణంలో సెన్సెక్స్ మైలురాళ్లు 

1990 జూలై 25 - 1000 పాయింట్లు
2006 ఫిబ్ర‌వ‌రి 6 - 10000 పాయింట్లు
2007 అక్టోబ‌ర్ 29 - 20000 పాయింట్ల‌
2015 మార్చి 4 - 30000 పాయింట్లు
2019 మే 23 - 40000 పాయింట్లు
2021 జ‌న‌వ‌రి 21 - 50000 పాయింట్లు
2021 సెప్టెంబ‌ర్ 24 -60000 పాయింట్లు

సెన్సెక్స్ ఆవిర్భావం - దేశంలోని తొలి స్టాక్ ఎక్స్ఛేంజి సెన్సెక్స్. 1986లో దీన్ని ప్రారంభించారు. 1990 జ‌న‌వ‌రి 25న సెన్సెక్స్ తొలిసారిగా 1000 పాయింట్ల మైలురాయిని దాటింది. 2006 ఫిబ్ర‌వ‌రి 7న 10,000 పాయింట్ల జీవిత కాల గ‌రిష్ఠ స్థాయిని న‌మోదు చేసింది.

ఈ 31 సంవ‌త్స‌రాల ప్ర‌యాణంలో హ‌ర్ష‌ద్ మెహ‌తా కుంభ‌కోణం (1992);  ముంబై, బిఎస్ఇ భ‌వ‌నం వ‌ద్ద‌ పేలుళ్లు (1993;  కార్గిల్ యుద్ధం (1999);  అమెరికా, భార‌త పార్ల‌మెంటుపై ఉగ్ర‌వాద దాడులు (2001);  స‌త్యం కుంభ‌కోణం (2007);  ప్ర‌పంచ ఆర్థిక సంక్షోభం (2008);  పిఎన్ బి కుంభ‌కోణం;  క‌రోనా మ‌హ‌మ్మారి వంటి ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొంది. ఇదే కాలంలో ఎన్నో ఆరోగ్య‌వంత‌మైన ప‌రిణామాలు కూడా చ‌వి చూసింది. 

2021 సెన్సెక్స్ రికార్డులివే...


2021 జ‌న‌వ‌రి 21 - తొలిసారి 50000 మైలురాయిని చేరింది.

ఫిబ్ర‌వ‌రి  3 - తొలిసారి 50000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 5 - తొలిసారి 51000 మైలురాయిని దాటింది.

ఫిబ్ర‌వ‌రి 8 - తొలిసారి 51000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఫిబ్ర‌వ‌రి 15 - తొలిసారి 52000 మైలురాయిని దాటింది.

జూన్ 22 - తొలిసారి 53000 మైలురాయిని తాకింది.

జూలై 7 - తొలిసారి 53000 క‌న్నా పైన క్లోజ‌యింది.

ఆగ‌స్టు 4 - తొలిసారి 54000 మైలురాయిని దాటి, ఆ పైనే క్లోజ‌యింది.

ఆగ‌స్టు 13 - తొలిసారి 55000 శిఖ‌రం దాటి, అంత‌క‌న్నా పైన క్లోజ‌యింది.

ఆగస్టు 18 - తొలిసారి 56000 మైలు రాయిని దాటింది.

ఆగ‌స్టు  27 - తొలిసారి 56000 కన్నా పైన క్లోజ్ అయింది.

ఆగ‌స్టు 31 - తొలిసారి 57000 కన్నా పైన క్లోజ్ అయింది. 

(స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.250 ల‌క్ష‌ల కోట్లు దాటింది).

సెప్టెంబ‌ర్ 3 - తొలిసారి 58000 దాటి అంత‌క‌న్నా పైన క్లోజ‌యింది.

(ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.1.53 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు పెరిగి ఆల్ టైమ్ రికార్డు రూ.254.12 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది).

సెప్టెంబర్ 16 - తొలిసారి 59000 కన్నా పైన క్లోజ్ అయింది. (ఈ ఏడాదిలో ఇప్పటి వరకు  సెన్సెక్స్ 11,389.83 పాయింట్లు లాభపడింది. ఇన్వెస్టర్ల సంపద రూ.2,60,78,355.12 కోట్లకు చేరింది).

సెప్టెంబర్ 24 - తొలిసారి 60000 కన్నా పైన క్లోజ్ అయింది. 

------------------------------------- 

107 రోజుల్లో కోటి ఖాతాలు...

ఈక్విటీ మార్కెట్ ప‌ట్ల స‌గ‌టు ఇన్వెస్ట‌ర్లు ఆక‌ర్షితుల‌వుతున్నారు. 107 రోజుల్లో కోటి కొత్త ఇన్వెస్ట‌ర్‌ ఖాతాలు న‌మోదు కావ‌డ‌మే ఇందుకు తార్కాణం. జూన్ 6వ తేదీన 7 కోట్ల ఖాతాల నుంచి సెప్టెంబ‌ర్ 21వ తేదీ నాటికి ఇన్వెస్ట‌ర్ ఖాతాలు 8 కోట్ల మైలురాయిని దాటాయి. అతి త‌క్కువ కాలంలో కోటి ఖాతాలు న‌మోదైన రికార్డు ఇదే. కేవ‌లం గ‌త 12 నెల‌ల కాలంలోనే (2020 మే 23 నుంచి) 2 కోట్ల కొత్త ఖాతాలు న‌మోద‌య్యాయి. 2008 ఫిబ్ర‌వ‌రిలో కోటి ఖాతాల మైలురాయి దాటింది. 2011 జూలైలో 2 కోట్లు, 2014 జ‌న‌వ‌రిలో 3 కోట్లు, 2018 ఆగ‌స్టులో 4 కోట్ల మైలురాళ్లు దాటాయి.  2020 మేలో 5 కోట్లు, 2021 జ‌న‌వ‌రి 19న 6 కోట్లు మైలురాళ్ల‌ను దాటాయి.

---------------------------------------- 

"సెన్సెక్స్ 60000 పాయింట్ల మైలురాయిని చేర‌డం భార‌త‌దేశం వృద్ధి సామ‌ర్థ్యానికి నిద‌ర్శ‌నం. భారీ సంఖ్య‌లో ఇన్వెస్ట‌ర్లు నేరుగా  గాని లేదా ప‌రోక్షంగా మ్యూచువ‌ల్ ఫండ్ మార్గంలో గాని ఈక్విటీ మార్కెట్ లోకి వ‌స్తున్నారు. ఇటీవ‌ల కాలంలో షేర్ల ధ‌ర‌ల ప‌రిధి  విస్తృతంగా ఉంది. ఈ విజ‌యానికి భార‌త పౌరులు, ఇన్వెస్ట‌ర్లంద‌రికీ నా శుభాకాంక్ష‌లు". 
- ఆశిష్ కుమార్ చౌహాన్‌, ఎండి అండ్ సిఇఓ
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి 
------------------------------------------- 

త‌గ్గిన‌ప్పుడు కొనండి...
ద‌లాల్ స్ర్టీట్ లో సెంటిమెంట్ బుల్లిష్ గా ఉంద‌ని, క‌రెక్ష‌న్ ఏర్ప‌డి ఏ మాత్రం త‌గ్గినా కొనుగోళ్ల‌కి మంచి అవ‌కాశ‌మ‌ని ఈక్విటీ మాస్ట‌ర్ సీనియ‌ర్ రీసెర్చ్ అన‌లిస్ట్ బ్ర‌జేష్ భాటియా స‌ల‌హా ఇచ్చారు. "ఇప్పుడు కొనుగోళ్లు విస్తృతంగా ఉన్నాయి, లార్జ్ క్యాప్ ల‌తో పాటు మిడ్ క్యాప్ లు, స్మాల్ క్యాప్ ల‌లో కూడా కొనుగోళ్లు జ‌రుగుతున్నాయి. మార్కెట్లో ఈ ఉత్సాహం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు కొన‌సాగ‌వ‌చ్చు. ఆటుపోట్లు కూడా ఉన్న‌ప్ప‌టికీ ఈక్విటీ సూచీల ప‌య‌నం ఊర్ధ్వ‌ముఖంగానే సాగ‌వ‌చ్చు" అన్నారు.  

"ఈ 60000 శిఖ‌రంపై కూడా మంచి నిర్వ‌హ‌ణ సామ‌ర్థ్యాలు, మ‌ధ్య‌కాలం నుంచి దీర్ఘ‌కాలంలో వృద్ధి సామ‌ర్థ్యం గ‌ల బ‌ల‌మైన కంపెనీల‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేయాల‌ని  ఇన్వెస్ట‌ర్ల‌కు స‌ల‌హా ఇస్తున్నాం. కొనుగోళ్లు ద‌శ‌ల‌వారీగానే  చేప‌ట్టండి. మొత్తం నిధుల‌న్నింటినీ ఈ స్థాయిలోనే లాక్ చేసుకోకండి." 
- శ్రీ‌కాంత్ చౌహాన్‌, హెడ్ ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్), కోట‌క్ సెక్యూరిటీస్‌

"మార్కెట్ విలువ‌లు గ‌రిష్ఠంగా ఉన్న మాట నిజం. కాని అదే స‌మ‌యంలో మ‌రో కోణంలో ఆర్థిక వృద్ధి సానుకూలంగా ఉంది. అందుకే ఈక్విటీల్లో త‌క్కువ పెట్టుబ‌డులు పెట్ట‌వ‌ద్దు. అయితే పోర్ట్ ఫోలియోల‌ను రీ బాలెన్స్ చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత పోర్ట్ ఫోలియోలో ఉన్న లోపాల‌ను స‌రిదిద్దుకుని, వెనుక‌బ‌డిన మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ల‌లోని నిధుల‌ను లార్జ్ క్యాప్ ల‌కు మార్చుకోవ‌చ్చు." 
- నిమిష్ షా, చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీస‌ర్‌, వాట‌ర్ ఫీల్డ్ అడ్వైజ‌ర్స్


No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...