ఫారెక్స్ రివ్యూ 2024
విదేశీ ద్రవ్య మార్కెట్లో ఈ ఏడాది రూపాయి భారీ పతనాన్ని నమోదు చేసింది. 2024 సంవత్సరం మొత్తం మీద డాలర్ మారకంలో రూపాయి విలువ 3 శాతం క్షీణించి ప్రస్తుతం 85.59 వద్ద కదలాడుతోంది. 2024 జనవరి 1వ తేదీన డాలర్ మారకంలో 83.19గా ఉన్న రూపాయి విలువ డిసెంబర్ 27 నాటికి 85.59 వద్ద కదలాడుతోంది. కేవలం గత రెండు నెలల కాలంలోనే దేశీయ కరెన్సీ విలువ 2 రూపాయలు పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ అక్టోబరు 10వ తేదీన తొలిసారిగా 84 స్థాయి కన్నా దిగజారగా డిసెంబర్ 19వ తేదీన 85 స్థాయి కన్నా దిగజారింది. డిసెంబర్ 27వ తేదీన తొలిసారిగా జీవిత కాల కనిష్ఠ స్థాయి 85.80 నమోదు చేసింది. రెండేళ్ల కాలంలో ఒక్క రోజులో రూపాయి ఇంత భారీగా పతనం కావడం ఇదే ప్రథమం. అయితే ఇతర కరెన్సీలతో పోల్చితే మాత్రం రూపాయి బలపడింది. జపాన్ యెన్‌తో పోల్చితే 8.7 శాతం పుంజుకుంది. ఈ ఏడాది జనవరి 1న 100 యెన్‌లకు 58.99 పలుకుతుండగా డిసెంబర్ 27 నాటికి 54.26కి పుంజుకుంది. అలాగే యూరోతో పోల్చినా కూడా 5 శాతం లాభపడి డిసెంబర్ 27 నాటికి 89.11 వద్ద కదలాడుతోంది.
ఎందుకిలా జరిగింది...?
2024 సంవత్సరం ప్రపంచంలోని ప్రధాన కరెన్సీలతో భారత కరెన్సీ రూపాయిని తీవ్రంగా ప్రభావితం చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, రెడ్ సీ సంక్షోభం వంటివన్నీ కరెన్సీ విలువపై ప్రభావం చూపాయి. ప్రపంచంలోని వివిధ కేంద్ర బ్యాంకులు తీసుకున్న చర్యలు ఒక్క రూపాయి-డాలర్ మారకం పైనే కాదు...అన్ని వర్థమాన దేశాల కరెన్సీల విలువలనూ ప్రభావితం చేశాయి. అయితే ఇతర కరెన్సీలతో పోల్చితే డాలర్ విలువపరంగానే రూపాయి బాగా నష్టపోయింది. కాని మన కరెన్సీ వర్థమాన మార్కెట్లకు చెందిన ఇతర కరెన్సీలతో పోల్చితే తక్కువ ఆటుపోట్లనే ఎదుర్కొన్నదని నాటి ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంతదాస్ డిసెంబర్ ద్వైమాసిక సమీక్షలో తెలిపారు. అయినప్పటికీ రూపాయిని స్థిరీకరించేందుకు ఆర్‌బిఐ క్రియాశీలంగా కృషి చేయాల్సి వస్తోంది. ఈ కారణంగానే విదేశీ మారకం నిల్వలు సెప్టెంబర్ చివరిలో నమోదైన చారిత్రక గరిష్ఠ స్థయి 70,489 కోట్ల డాలర్ల స్థాయి నుంచి డిసెంబర్ 20వ తేదీ నాటికి ఆరు నెలల కనిష్ఠ స్థాయి 64,439 కోట్ల డాలర్ల స్థాయికి తగ్గాయి.
అమెరికా శక్తివంతం కావడమే కారణం
అమెరికాలో స్థూల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడమే డాలర్ అనూహ్యంగా బలపడడానికి కారణమని నిపుణులంటున్నారు. ఈ కారణంగానే అమెరికన్ కేంద్ర బ్యాంక్ ద్రవ్య విధానం సరళం చేసింది. దీనికి తోడు నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడం కూడా డాలర్ బలోపేతం కావడానికి దోహదపడింది. ప్రధానంగా చైనా దిగుమతులను కట్టడి చేయడానికి టారిఫ్‌లు పెంచుతామన్న ఆయన ప్రకటన డాలర్‌కు ఎనలేని బలాన్ని అందించింది. దీని ప్రభావం భారత ఈక్విటీ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమెరికాలో పెట్టుబడుల కోసం డాలర్లను ఉపసంహరించడం ప్రారంభించారు. ఒక పక్క అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు సమాంతరంగా యూరప్‌లో బలహీనతలు, భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో2024 సంవత్సరంలో డాలర్ 6.9 శాతం బలపడింది. ప్రత్యేకించి పశ్చిమాసియా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం డాలర్‌ను సురక్షితమైన స్థాయిలో నిలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎఫ్‌పిఐలు భారత మార్కెట్ నుంచి అక్టోబర్-డిసెంబర్ నెలల మధ్య కాలంలో రూ.1.70 లక్షల కోట్ల నిధులు తరలించుకుపోయారు. ఇది రూపాయి విలువను తీవ్రంగా దెబ్బ తీసింది.
2025 పరిధి 83-87
డాలర్ మారకంలో రూపాయి విలువ 2025 సంవత్సరంలో గరిష్ఠ స్థాయిలో 87, కనిష్ఠ స్థాయిలో 83 మధ్యన కదలాడవచ్చునని అంటున్నారు. త్వరలో ప్రకటించనున్న 2025-26 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించే విత్త విధానం; ద్రవ్యోల్బణం-వృద్ధికి మధ్య సమతూకం తేవడంపై ఆర్‌బిఐ వైఖరి వంటి చర్యలు రూపాయికి మద్దతు ఇవ్వవచ్చునంటున్నారు. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం నుంచి 7.5 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చునని అంచనా. ఇది కూడా ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి నిలదొక్కుకోవడానికి దారి తీయవచ్చునన్నది నిపుణుల అభిప్రాయం.
No comments:
Post a Comment