ఈక్విటీ ఇన్వెస్టర్లకు లాభాల పంట
ఈక్విటీ మార్కెట్ 2024 సంవత్సరంలో ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాలు పంచింది. ఏడాది మొత్తం మీద సెన్సెక్స్ 5898.75 పాయింట్లు (8.16%) లాభపడగా నిఫ్టీ 1913.40 పాయింట్లు (8.80%) లాభపడింది. ఫలితంగా బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ (ఇన్వెస్టర్ల సంపద) రూ.77,66,260.19 కోట్లు లాభపడి రూ.4,41,95,106.44 కోట్లకు (516 లక్షల కోట్ల డాలర్లు) చేరింది. బిఎస్ఇ స్మాల్‌క్యాప్ సూచీ 12,506.84 పాయింట్లు (29.30%), మిడ్‌క్యాప్ సూచీ 9605.44 పాయింట్లు (26.07%) లాభపడ్డాయి. ఈ ఏడాది సెప్టెంబరు 27వ తేదీన సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాల గరిష్ఠ స్థాయిలు నమోదు చేశాయి. ఆ రోజు నమోదైన జీవితకాల గరిష్ఠ స్థాయిలు సెన్సెక్స్ 85,978.25 పాయింట్లు కాగా నిఫ్టీ 26,277.35 పాయింట్లు.
సెప్టెంబరు తర్వాత నిస్తేజం
2024 సంవత్సరంలో ఈక్విటీ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లతో సాగింది. బుల్, బేర్ నువ్వా, నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. కొన్నాళ్లు బుల్‌ది పైచేయి అయితే కొన్నాళ్లు బేర్ హవా నడిచినట్టు కనిపించింది. ప్రధానంగా జనవరి నుంచి సెప్టెంబరు వరకు సూచీలు నిలకడగా పురోగమించగా ఆ తర్వాత కాలంలో మార్కెట్‌పై బుల్ పట్టు పెరిగింది. విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ, దిగజారుతున్న మార్కెట్ సెంటిమెంట్, పెరుగుతున్న క్రూడ్ ధరలు ఈక్విటీ మార్కెట్‌పై ఒత్తిడిని పెంచాయి. త్వరలో ప్రారంభం కానున్న మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు; వృద్ధి, ఆదాయాల రికవరీ, కేంద్ర బడ్జెట్‌పై రాబోయే కాలంలో ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారని నిపుణులంటున్నారు.
నష్టాలతో ఏడాదికి వీడ్కోలు
సెన్సెక్స్, నిఫ్టీ మంగళవారం 2024 సంవత్సరపు చివరి రోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 109.12 పాయింట్లు నష్టపోయి 78,139.01 వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం నామమాత్రంగా 0.10 పాయింట్లు నష్టపోయి 23,644.80 వద్ద ముగిసింది.
No comments:
Post a Comment