ఈక్విటీ మార్కెట్ రివ్యూ 2024
ఈక్విటీ మార్కెట్‌కు 2024 రికార్డుల సంవత్సరంగానే కాదు...భారీ కరెక్షన్ల సంవత్సరంగా కూడా నిలిచిపోనుంది. తీవ్రమైన ఎగుడుదిగుడుల ప్రయాణం సాగించినప్పటికీ ఇన్వెస్టర్లకు సానుకూల రాబడులే అందించడం ఈ సంవత్సరం విశేషం. ఆటుపోట్లను తట్టుకుంటూ నిలిచిన స్థూల ఆర్థిక రంగం, దేశీయ నిధుల రాక ఇందుకు అండగా నిలిచాయి. ఈ ఏడాది సెప్టెంబరు 27వ తేదీన నిఫ్టీ చారిత్రక గరిష్ఠ స్థాయి 26,277.25 పాయింట్లను, సెన్సెక్స్ 85,978.35 పాయింట్లను నమోదు చేశాయి. అయితే చివరి రెండు నెలలూ మార్కెట్లు భారీ కరెక్షన్ సాధించి ప్రస్తుతం నిఫ్టీ 23,813 వద్ద, సెన్సెక్స్ వద్ద ట్రేడవుతున్నాయి. ఆ చారిత్రక రికార్డు స్థాయిల నుంచి సెన్సెక్స్ 8.46 శాతం, నిఫ్టీ 9.37 శాతం నష్టపోయాయి. 2020 సంవత్సరంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన కరెక్షన్ తర్వాత చోటు చేసుకున్న మూడో భారీ కరెక్షన్ ఇది. అయితే ఏడాది మొత్తం మీద చూసినట్టయితే డిసెంబర్ 27 నాటికి సెన్సెక్స్ 6458.81 పాయింట్లు (8.94%), నిఫ్టీ 2082 పాయింట్లు (9.58%) లాభపడ్డాయి. 2023 సంవత్సరంలో సెన్సెక్స్ నమోదు చేసిన 11,399.52 పాయింట్లు (18.73%), నిఫ్టీ నమోదు చేసిన 3626.10 పాయింట్ల (20%) లాభంతో పోల్చితే మాత్రం 2024లో సూచీల జోరు తగ్గిందనే చెప్పాలి.వరుసగా తొమ్మిదో ఏడాది
భారత ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్టర్లకు లాభాలు పంచడం ఇది వరుసగా తొమ్మిదో ఏడాది. చివరి త్రైమాసికంలో తీవ్రమైన సవాళ్లు ఎదురైనా ఈక్విటీ మార్కెట్ మాత్రం అద్భుతమైన లాభాలనే అందించింది. ప్రధానంగా మిడ్‌క్యాప్‌లు, స్మాల్‌క్యాప్‌లు ఇతర సూచీల కన్నా మెరుగైన పనితీరు ప్రదర్శించి ఇన్వెస్టర్లకు మంచి లాభాలు అందించాయని విశ్లేషకులంటున్నారు. ఇదే సమయంలో సెన్సెక్స్, నిఫ్టీ మాత్రం ప్రపంచంలోని ఇతర పోటీ ఇండెక్స్‌లతో పోల్చితే వెనుకంజలో ఉన్నాయి. విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున నిధులు తరలించుకుపోవడం ఇందుకు కారణమనా స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అన్నారు.
అన్నీ సవాళ్లే...
దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల నుంచి ఏడాది చివరిలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు ఈక్విటీ మార్కెట్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఈ సార్వత్రిక ఎన్నికలది ఒక ఎత్తైతే ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ పరిణామాలు మరో ఎత్తు. అన్నింటినీ మించి చివరి త్రైమాసికంలో నిరాశావహమైన కార్పొరేట్ ఫలితాలు, ఆశించిన స్థాయి కన్నా మందగించిన ఆర్థిక వృద్ధిరేటు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బ తీశాయి. అమెరికాలో వడ్డీరేట్ల తగ్గింపు అగ్నికి ఆజ్యం జోడైనట్టయింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు నిధుల ఉపసంహరణ ప్రారంభించడంతో అక్టోబర్ నుంచి మార్కెట్ బేర్ గుప్పిట్లోకి వెళ్లింది. ఒక్క అక్టోబర్‌లోనే సెన్సెక్స్ 4910.72 పాయింట్లు, నిఫ్టీ 1605.50 పాయింట్లు నష్టపోయాయి. ఈ నెలలో విదేశీ సంస్థలు రికార్డు స్థాయిలో రూ.94,017 కోట్ల విలువైన నిధులు ఉపసంహరించారు. ఇంతవరకు ఒక నెలలో ఎఫ్ఐఐలు ఉపసంహరించిన అత్యధిక నిధుల రికార్డు ఇదేనంటున్నారు.
ద్రవ్యోల్బణం-వడ్డీరేట్లు
మరోపక్క దేశంలో గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్న ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసే ప్రయత్నంలో ఆర్‌బిఐ వడ్డీరేట్ల తగ్గింపునకు ససేమిరా అంటోంది. వృద్ధిరేటును ఉత్తేజితం చేయడానికి కీలక రెపోరేటును తగ్గించాలని అటు ప్రభుత్వం నుంచి ఇటు పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడులకు ఏ మాత్రం లొంగకుండా ఆర్‌బిఐ కీలక రెపోరేటును డిసెంబర్ సమీక్షలో కూడా యథాతథంగానే కొనసాగించింది. దీంతో ప్రస్తుతం దేశంలో రెపోరేటు 6.5 శాతం వద్ద నిలకడగా ఉంది. ఆర్‌బిఐ వడ్డీరేట్లలో యథాతథ స్థితిని కొనసాగించడం వరుసగా ఇది 11వ సారి.
మార్కెట్ విలువలు జూమ్
ప్రస్తుతం భారత మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన మార్కెట్‌గా ఉండడం కూడా కరెక్షన్‌కు కారణమయింది. మార్కెట్లో అధిక లిక్విడిటీ (నగదు లభ్యత) మార్కెట్ ఫండమెంటల్స్‌ను మించి విలువలు పెరిగిపోవడానికి కారణమయింది. విలువలు ఎప్పుడైతే పతాక స్థాయికి చేరతాయో అప్పుడు మార్కెట్లో ఆరోగ్యకరమైన కరెక్షన్ ఏర్పడక తప్పదని అంటారు. ఇటీవల ఏర్పడిన కరెక్షన్‌తో విలువల పరిస్థితి మెరుగుపడి భారత ఈక్విటీ మార్కెట్ బలం పెరిగిందని విశ్లేషకుల అభిప్రాయం.
No comments:
Post a Comment