Sunday, December 22, 2024

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మీక‌రించాయి. ఒక ఏడాదిలో నిధుల స‌మీక‌ర‌ణ‌లో ఇది ఒక కొత్త రికార్డు. ఇష్యూలు జారీ చేసే కంపెనీల్లో విశ్వాసం ఇనుమ‌డించ‌డానికి ఇది దోహ‌ద‌ప‌డింది. హుండాయ్‌ మోటార్స్ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ఇష్యూ జారీ చేయ‌డం ద్వారా రూ.27,870 కోట్లు స‌మీక‌రించింది. విభోర్ స్టీల్ ట్యూబ్స్ రూ.72 కోట్ల విలువ గ‌ల అతి చిన్న ఇష్యూ జారీ చేసింది. ఇష్యూలు జారీ చేసిన వాటిలో భారీ, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా కంపెనీలున్నాయి. స‌గ‌టు ఇష్యూ సైజు కూడా 2023లో రూ.867 కోట్లుండ‌గా 2024లో అది రూ.1700 కోట్ల క‌న్నా పైనే ఉంది. ఒక్క డిసెంబ‌ర్ నెల‌లోనే 15 కంపెనీలు ఇష్యూలు జారీ చేయ‌డం మార్కెట్లో నెల‌కొన్న అసాధార‌ణ బ‌లానికి సంకేతం. 2023 సంవ‌త్స‌రంలో 57 కంపెనీలు రూ.49,436 కోట్లు మాత్ర‌మే స‌మీక‌రించాయి. నిధుల స‌మీక‌ర‌ణ‌పై చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా కంపెనీలు (ఎస్ఎంఇ) కూడా ఎన‌లేని ఆస‌క్తి క‌న‌బ‌రిచాయి. మొత్తం 238 ఎస్ఎంఇలు రూ.8,700 కోట్లు స‌మీక‌రించాయి. 2023లో ఈ త‌ర‌హా కంపెనీలు స‌మీక‌రించిన రూ.4,686 కోట్ల క‌న్నా ఇది రెట్టింపు అధికం. ఎస్ఎంఇల్లో ఇన్వెస్ట్ చేయ‌డం రిస్క్‌తో కూడుకున్న వ్య‌వ‌హార‌మే అయినా ఇన్వెస్ట‌ర్లు వెన‌క్కి త‌గ్గ‌లేదు. 

చందాల్లోను, రాబ‌డుల్లోనూ రికార్డులే 

ప‌బ్లిక్ ఇష్యూ స‌బ్‌స్క్రిప్ష‌న్ నిష్ప‌త్తులు కూడా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉన్నాయి. అతి చిన్న ఇష్యూతో మార్కెట్లోకి వ‌చ్చినా విభోర్ స్టీల్ ట్యూబ్స్ ఇష్యూ రికార్డు స‌బ్‌స్ర్కిప్ష‌న్   సాధించింది.  ఈ ఇష్యూకి 320 రెట్లు అధిక స‌బ్‌స్ర్కిప్ష‌న్ వ‌చ్చింది. కెఆర్ఎన్  హీట్ ఎక్స్ఛేంజ‌ర్ అండ్ రిఫ్రెజిరేష‌న్‌, మ‌న్బా ఫైనాన్స్‌, ప్రెసిష‌న్ ఇంజ‌నీరింగ్ ఇష్యూల‌కి 200 రెట్లు అధిక స‌బ్‌స్క్రిప్ష‌న్ వ‌చ్చింది. అలాగే కొన్ని ఇష్యూలు లిస్టింగ్‌లో అద్భుత‌మైన రాబ‌డులు అందించాయి. విభోర్ స్టీల్ ట్యూబ్స్‌, బిఎల్ఎస్ ఇ-స‌ర్వీసెస్‌, బ‌జాజ్ హౌసింగ్ ఫైనాన్స్, కెఆర్ఎన్ హీట్ ఎక్స్ఛేంజ‌ర్ కంపెనీలు లిస్టింగ్‌లో 100 శాతం పైగా లాభాలు అందించాయి. 

సుస్థిర‌తే చోద‌క శ‌క్తి

దేశంలో స్థిర‌మైన ఆర్థిక వాతావ‌ర‌ణం, కేంద్ర‌ప్ర‌భుత్వ స్థాయిలో విధానాల కొన‌సాగింపు, అన్ని రంగాల‌కు విస్త‌రించిన వృద్ధిరేటు ఐసిఓ కార్య‌క‌లాపాలు జోరుగా ఉండ‌డానికి కార‌ణ‌మ‌ని నిపుణులంటున్నారు. దీనికి తోడు ప్రైవేట్ ఈక్విటీ ఎగ్జిట్లు, స్పాన్స‌ర్ ఆధారిత అమ్మ‌కాలు, కార్పొరేట్ ఫండింగ్ వ్యూహాల్లో మార్పు వంటి అంశాలు సైతం ఐపీఓ మార్కెట్లో జొరుకి కార‌ణ‌మయ్యాయి.

నూత‌న సంవ‌త్స‌రం మ‌రింత జోరు
రాబోయే సంవ‌త్స‌రంలో (2025) కూడా ఐపీఓ మార్కెట్ జోరుగానే ఉంటుంద‌ని, 2024లో న‌మోదైన రికార్డుల‌ను చెరిపేస్తుంద‌ని విశ్లేష‌కుల అంచ‌నా. ఐపిఓకి అనుమ‌తి కోరుతూ 75 కంపెనీలు చేసుకున్న ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న విభిన్న ద‌శ‌ల్లో ఉంది. దాన్ని బ‌ట్టి 2025లో వివిధ కంపెనీలు ఐపిఓల ద్వారా సేక‌రించే నిధుల ప‌రిమాణం రూ.2.5 కోట్లు దాట‌వ‌చ్చున‌ని అంటున్నారు.  వ‌చ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ప్ర‌ముఖ కంపెనీల్లో హెచ్‌డిబి ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ (రూ.12,500 కోట్లు), ఎల్‌జి ఎల‌క్ర్టానిక్స్ ఇండియా (రూ.15,000 కోట్లు), హెక్సావేర్ టెక్నాల‌జీస్ (రూ.9,950 కోట్లు) ఉన్నాయి.


No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...