Thursday, April 10, 2025

టిసిఎస్ చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్‌గా ఆర్తి సుబ్ర‌మ‌ణియ‌న్‌

టాటా గ్రూప్‌లోని ప్ర‌ధాన కంపెనీల్లో ఒక‌టి, సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం అయిన టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టిసిఎస్‌) ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌, ప్రెసిడెంట్‌, చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్‌గా (సీఓఓ) ఆర్తి సుబ్ర‌మ‌ణియ‌న్ నియ‌మితుల‌య్యారు. ఈ ఏడాది మే 1 నుంచి ఐదేళ్ల కాలానికి ఆ నియామ‌కం వ‌ర్తిస్తుంది. "ఆర్తి సుబ్ర‌మ‌ణియ‌న్‌ను సీఓఓగా నియ‌మించేందుకు నామినేష‌న్‌, రెమ్యూనిరేష‌న్ క‌మిటీ సిఫార‌సుల మేర‌కు డైరెక్ట‌ర్ల బోర్డు ఆమోద‌ముద్ర వేసింది. 2025 మే 1 నుంచి  2030 ఏప్రిల్ 30 వ‌ర‌కు ఆమె ఆ ప‌ద‌విలో ఉంటారు.  వాటాదారుల ఆమోదానికి లోబ‌డి ఈ నిర్ణయం ఉంటుంది" అని టిసిఎస్ నియంత్ర‌ణ సంస్థ‌ల‌కు పంపిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కంపెనీ తెలియ‌చేసిన ఆమె ప్రొఫైల్ ప్ర‌కారం ఆర్తి టాటా గ్రూప్‌న‌కు చెందిన పెట్టుబ‌డుల హోల్డింగ్ కంపెనీ టాటా ఎంట‌ర్‌ప్రైజెస్ గ్రూప్ చీఫ్ డిజిట‌ల్ ఆఫీస‌ర్‌గా ఉన్నారు. టెక్నాల‌జీ, ఆప‌రేష‌న్స్ విభాగాల్లో ఆమెకు అపార‌మైన అనుభవం ఉంది. టాటా గ్రూప్ కంపెనీలు డిజిట‌ల్ టెక్నాల‌జీలు ఆక‌ళింపు చేసుకుని నిర్వ‌హ‌ణాప‌ర‌మైన సామ‌ర్థ్యం, పోటీ సామ‌ర్థ్యం సాధించ‌డంలో ఆమె కీల‌క పాత్ర పోషించారు. కార్య‌నిర్వ‌హ‌ణాప‌ర‌మైన బాధ్య‌త‌ల‌తో పాటు  టాటా గ్రూప్‌లో ఆమె ఎన్నో కీల‌క‌మైన బోర్డు ప‌ద‌వులు నిర్వ‌హించారు. టిసిఎస్ డైరెక్ట‌ర్‌గాను;  టాటా కేపిట‌ల్ లిమిటెడ్ డైరెక్ట‌ర్‌గాను; ఇన్ఫినిటీ రిటైల్ డైరెక్ట‌ర్‌గాను కూడా ఉన్నారు. మూడు ద‌శాబ్దాల‌కు పైగా టాటా గ్రూప్‌తో ఆమెకు గ‌ల సుదీర్ఘ అనుబంధంలో ఎన్నో ప్ర‌గ‌తిశీల పాత్ర‌ల్లో ప‌ని చేశారు. టిసిఎస్‌లోని రిటైల్‌, సిపిజి బిజినెస్ యూనిట్ డెలివ‌రీ విభాగం హెడ్‌గా ఉన్న ఆమె వ్యూహాత్మ‌క ఖాతాలు, కీల‌క క్ల‌యింట్లతో సంబంధాలు, క‌స్ట‌మ‌ర్ సంతృప్తి సాధ‌నల‌కు సార‌థ్యం వ‌హించారు. ఆమె వ‌రంగ‌ల్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో కంప్యూట‌ర్ సైన్స్‌లో బాచిల‌ర్ డిగ్రీ పొందారు. అమెరికాకు చెందిన క‌న్సాస్‌ యూనివ‌ర్శిటీలో ఇంజ‌నీరింగ్ మేనేజ్‌మెంట్ విభాగంలో మాస్ట‌ర్స్ డిగ్రీ చేశారు.

Tuesday, April 8, 2025

వేల్యూ బైయింగ్‌తో మార్కెట్‌కు ఊర‌ట‌

1089 పాయింట్లు లాభ‌ప‌డిన సెన్సెక్స్
భారీ న‌ష్టాల నుంచి ఉప‌శ‌మ‌నం

ఈక్విటీ మార్కెట్ సోమ‌వారం నాటి భారీ న‌ష్టం నుంచి మంగళ‌వారం కొంత ఉప‌శ‌మ‌నం పొందింది. త‌క్కువ ధ‌ర‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చిన నాణ్య‌మైన షేర్ల కొనుగోలుకు ఇన్వెస్ట‌ర్లు ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో సూచీలు రిక‌వ‌రీ సాధించాయి. ఆసియా, యూర‌ప్ః మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు భార‌త్ మార్కెట్‌కు ఉత్తేజం క‌ల్పించాయి. విలువ ఆధారిత కొనుగోళ్ల మ‌ద్ద‌తుతో ఒక ద‌శ‌లో 1721 పాయింట్ల మేర‌కు దూసుకుపోయి 74859.39 పాయింట్ల‌ను న‌మోదు చేసిన‌ సెన్సెక్స్ చివ‌రికి 1089.18 పాయింట్లు లాభంతో 74227.08 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 374.25 పాయింట్లు లాభ‌ప‌డి 22535.85 వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 535.6 పాయింట్లు లాభ‌ప‌డి 22697.20 పాయింట్ల డే గ‌రిష్ఠ స్థాయిని తాకింది. 
- ఈ సానుకూల వాతావ‌ర‌ణం కార‌ణంగా బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.7,32,042.69 కోట్లు పెరిగి రూ.3,96,57,703.44 కోట్ల వ‌ద్ద ముగిసింది. స్టాక్ ఎక్స్ఛేంజిల వ‌ద్ద ఉన్న గ‌ణాంకాల ప్ర‌కారం సోమ‌వారం విదేశీ ఇన్వెస్ట‌ర్లు రూ.9,040.01 కోట్ల విలువ గ‌ల ఈక్విటీల‌ను విక్ర‌యించ‌గా దేశీయ సంస్థ‌లు రూ.12,122.45 కోట్ల విలువ గ‌ల ఈక్విటీలు కొనుగోలు చేశాయి. 
- ఒక్క ప‌వ‌ర్‌గ్రిడ్ మిన‌హా సెన్సెక్స్‌లో లిస్ట‌యిన కంపెనీలు లాభాల్లో ముగిశాయి. 

Monday, April 7, 2025

ట్రం"పోటు"కు మార్కెట్ "బేర్‌"

- 10 నెల‌ల కాలంలో తొలి భారీ ప‌త‌నం

- ఇన్వెస్ట‌ర్ల‌కు క‌న్నీరు తెప్పించిన బ్లాక్ మండే

- ఒక్క రోజులోనే రూ.14 ల‌క్ష‌ల కోట్లు హాంఫ‌ట్ 

- మెట‌ల్‌, ఐటీ షేర్లు కుదేలు

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పోటుతో ప్ర‌పంచ మార్కెట్లు కుదేల‌య్యాయి. ట్రంప్ చ‌ర్య‌ల కార‌ణంగా ప్ర‌పంచంలో వాణిజ్య యుద్ధం ఏర్ప‌డ‌వ‌చ్చున‌న్న భ‌యాలు ప్ర‌పంచ మార్కెట్ల‌న్నింటినీ క‌ల్లోలితం చేశాయి. ఈ ప్ర‌భావం మ‌న మార్కెట్‌పై కూడా ప‌డింది. సోమ‌వారం తీవ్ర ప్ర‌తికూల‌ న‌డుమ‌ మ‌న మార్కెట్ 10 నెల‌ల కాలంలో క‌నివిని ఎరుగ‌ని రీతిలో ఒక్క రోజులో భారీ న‌ష్టం న‌మోదు చేసింది. ట్రంప్ సుంకాలు, దానికి చైనా ప్ర‌తిఘ‌ట‌న వంటి ప‌రిణామాల కార‌ణంగా ఈక్విటీ సూచీలు తీవ్ర న‌ష్టాలు న‌మోదు చేశాయి. తీవ్ర ఆటుపోట్ల న‌డుమ జ‌రిగిన ట్రేడింగ్‌లో ఒక ద‌శ‌లో సెన్సెక్స్ 3939.68 పాయింట్లు (5.22%) న‌ష్ట‌పోయి 71425.01కి దిగ‌జారింది. చివ‌రికి ఆ న‌ష్టాల‌ను కొంత పూడ్చుకుని నిక‌రంగా 2226.79 పాయింట్ల న‌ష్టంతో (2.95%) 73137.90 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 1160.8 పాయింట్లు (5.06%) దిగ‌జారి 21743.65 పాయింట్ల క‌నిష్ఠ స్థాయిని తాకింది. చివ‌రికి 742.85 పాయింట్ల న‌ష్టంతో (3.24%) 22161.60 వ‌ద్ద ముగిసింది.

2024 జూన్ 4 త‌ర్వాత భారీ న‌ష్టం

గ‌త ఏడాది జూన్ 4వ తేదీన 4389.73 పాయింట్లు (5.74%) న‌ష్ట‌పోయి 72079.05 పాయింట్ల వ‌ద్ద ముగిసిన త‌ర్వాత ఏర్ప‌డిన పెద్ద న‌ష్టం ఇదే. అదే రోజున ఇంట్రాడేలో సెన్సెక్స్ 6234.35 (8.15%) పాయింట్లు న‌ష్ట‌పోయి 70234.43 పాయింట్ల క‌నిష్ఠ స్థాయిని న‌మోదు చేసింది. అలాగే నిఫ్టీ ఇంట్రాడేలో 1982.45 పాయింట్లు (8.52%) దిగ‌జారి 21281.45 పాయింట్ల క‌నిష్ఠ స్థాయిని న‌మోదు చేసింది. చివ‌రికి 1379.40 (5.93%) పాయింట్లు న‌ష్ట‌పోయి 21884.50 వ‌ద్ద ముగిసింది. అంతే కాదు 2020 మార్చి 23వ తేదీన కోవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి విధించిన లాక్‌డౌన్ ప్ర‌భావంతో  రెండు సూచీలు 13% న‌ష్ట‌పోయాయి.

ఇన్వెస్ట‌ర్ల కంట ర‌క్త క‌న్నీరు

ఈక్విటీ సూచీల భారీ ప‌త‌నంతో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.14,09,225.71 కోట్లు న‌ష్ట‌పోయి రూ.3,89,25,660.75 కోట్ల‌కు (4.54 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు) దిగ‌జారింది. ఒక ద‌శ‌లో అయితే సంప‌ద రూ.20.16 ల‌క్ష‌ల కోట్లు ఆవిరైపోయింది. ఒక్క  హిందుస్తాన్ యునీలీవ‌ర్ త‌ప్ప సెన్సెక్స్‌లోని 29 షేర్లు న‌ష్టాల‌తో ముగిశాయి. బిఎస్ఇలో లిస్టింగ్ అయిన షేర్ల‌లో 3515 న‌ష్ట‌పోగా 570 షేర్లు మాత్రం లాభాల‌తో ముగిశాయి. 140 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా త‌ట‌స్థంగా క్లోజ‌య్యాయి. బిఎస్ఇలో 775 షేర్లు 52 వారాల క‌నిష్ఠ స్థాయిల‌కు దిగ‌జారాయి. బిఎస్ఇ స్మాల్‌క్యాప్ సూచీ 4.13%, మిడ్‌క్యాప్ సూచీ 3.46% న‌ష్ట‌పోయాయి. బిఎస్ఇలోని అన్ని సెక్టోర‌ల్ సూచీలు న‌ష్ట‌పోయాయి. మెట‌ల్ సూచీ గ‌రిష్ఠంగా 6.22% న‌ష్ట‌పోగా రియ‌ల్టీ (5.69%), క‌మోడిటీస్ (4.68%), ఇండ‌స్ర్టియ‌ల్స్ (4.57%), క‌న్స్యూమ‌ర్ డిస్‌క్రెష‌న‌రీ (3.79%), ఆటో (3.77%), బ్యాంకెక్స్ (3.37%), ఐటి (2.92%), టెక్ (2.85%), ఫోక‌స్డ్ ఐటి (2.63%) న‌ష్ట‌పోయాయి. స్టాక్ ఎక్స్ఛేంజిల వ‌ద్ద అందుబాటులో ఉన్న స‌మాచారం ప్ర‌కారం శుక్ర‌వారం విదేశీ ఇన్వెస్ట‌ర్లు రూ.3483.98 కోట్ల విలువ గ‌ల షేర్లు విక్ర‌యించారు. ట్రంప్ వాణిజ్య యుద్ధం కార‌ణంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధ‌ర 3.61% క్షీణించి 63.21 డాల‌ర్ల‌కు ప‌డిపోయింది.

మ‌ట్టి క‌రిచిన‌ మెట‌ల్‌, ఐటి షేర్లు

మార్కెట్ క‌ల్లోలంలో మెట‌ల్, ఐటి కంపెనీల షేర్లు భారీ న‌ష్టాలు న‌మోదు చేశాయి. మెట‌ల్ సూచీ 6.22% న‌ష్ట‌పోయి 26680.16 వ‌ద్ద ముగిసింది. మెట‌ల్ షేర్ల‌లో నాల్కో షేరు గ‌రిష్ఠంగా 8.18% న‌ష్ట‌పోగా టాటా స్టీల్ (7.73%), జెఎస్‌డ‌బ్ల్యు స్టీల్ (7.58%), సెయిల్ (7.06%), జిందాల్ స్టీల్ అండ్ ప‌వ‌ర్ (6.90%) న‌ష్ట‌పోయాయి. వేదాంత (6.90%), జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్ (6.36%), హిండాల్కో (6.26%), ఎన్ఎండిసి (5.75%), హిందుస్తాన్ జింక్ (4.89%), ఎపిఎల్ అపోలో ట్యూబ్స్ (4.77%) కూడా న‌ష్ట‌పోయాయి. 

బిఎస్ఇ ఐటి ఇండెక్స్ 2.92% న‌ష్ట‌పోగా, టెక్ ఇండెక్స్ 2.85% న‌ష్ట‌పోయింది. ఐటి షేర్ల‌లో ఇన్ఫోసిస్ (3.75%), హెచ్‌సిఎల్ టెక్ (3.27%), టెక్ మ‌హీంద్రా (2.47%), ఎల్‌టిఐ మైండ్‌ట్రీ (1.72%), విప్రో (1.38%), టిసిఎస్ (0.69%) న‌ష్ట‌పోయాయి. ఐటి ఆధారిత స‌ర్వీసులు అందించే ఆన్‌వ‌ర్డ్ టెక్నాల‌జీస్ లిమిటెడ్ గ‌రిష్ఠంగా 13.99% న‌ష్ట‌పోయింది. జెనెసిస్ ఇంట‌ర్నేష‌న‌ల్ కార్పొరేష‌న్ (10.80%), క్విక్ హీల్ టెక్నాల‌జీస్ (9.63%), జాగిల్ ప్రీపెయిడ్ ఓషెన్ స‌ర్వీసెస్ (9.53%), డేటామాటిక్స్ (9.08%), న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీస్ (7.94%), ఇంటెలెక్ట్ డిజైన్ ఎరీనా (7.69%), హాపీయెస్ట్ మైండ్స్ టెక్నాల‌జీస్ (6.36%), సొనాటా సాఫ్ట్‌వేర్ (6.28%), టాటా టెక్నాల‌జీస్ (6.19%), ఎంఫ‌సిస్ (5.76%) న‌ష్ట‌పోయిన షేర్ల‌లో ఉన్నాయి.

ప్ర‌పంచ మార్కెట్ల‌లో క‌ల్లోలం 

ట్రంప్ చ‌ర్య‌ల‌కు ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ క‌ల్లోలితం అయ్యాయి. ట్రంప్ చ‌ర్య‌ల‌పై అమెరికాలోనే తీవ్ర అసంతృప్తి వెలువ‌డుతోంది. ఆ చ‌ర్య‌ల‌ను ప్ర‌శ్నిస్తూ ప‌లువురు నినాదాలు రాసిన ప్ల‌కార్డులు ప‌ట్టుకుని వీధుల‌కెక్కుతున్నారు. అమెరిక‌న్ మార్కెట్ శుక్ర‌వారం భారీ న‌ష్టాల‌తో ముగిసింది. ఎస్ అండ్ పి 500 సూచీ 5.97% న‌ష్ట‌పోగా నాస్‌డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 5.82%, డౌ జోన్స్ 5.50% న‌ష్టాల‌తో ముగిశాయి. ఈ ప్ర‌భావం సోమ‌వారం ప్ర‌పంచ మార్కెట్ల‌పై ప‌డింది. ఆసియా దేశాల‌కు చెందిన సూచీల్లో హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ సూచీ 13 శాతం పైగా న‌ష్ట‌పోగా జ‌పాన్‌కు చెందిన నిక్కీ 225 సూచీ 8 శాతం, షాంఘై ఎస్ఎస్ఇ కాంపోజిట్ ఇండెక్స్ 7 శాతం, ద‌క్షిణ కొరియాకు చెందిన కోస్పి 5 శాతం న‌ష్ట‌పోయాయి. 

పాక్‌లో ట్రేడింగ్ నిలిపివేత‌

పాకిస్తాన్‌కు చెందిన కెఎస్ఇ-100 సూచీ 8000 పాయింట్ల‌కు పైగా న‌ష్ట‌పోవ‌డంతో ఇన్వెస్ట‌ర్ల‌ను ర‌క్షించేందుకు కొంత స‌మ‌యం పాటు ట్రేడింగ్ నిలిపివేశారు. ట్రేడింగ్ పున‌రుద్ధ‌రించిన త‌ర్వాత కూడా సూచీ మ‌రో 2000 పాయింట్లు న‌ష్ట‌పోవ‌డంతో ఇంట్రాడేలో ఆ సూచీ 8600 పాయింట్లు దిగ‌జారిన‌ట్ట‌యింది. చివ‌రికి 3882.18 పాయింట్ల (3.27%) న‌ష్టంతో 1,14,909.48 పాయింట్ల వ‌ద్ద ముగిసింది.

పేక‌మేడ‌ల్లా కూలాయి

ట్రంప్ రేపిన క‌ల్లోలంతో ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ పేక‌మేడ‌ల్లా కూలాయ‌ని మెహ‌తా ఈక్విటీస్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్‌) ప్ర‌శాంత్ తాప్సే అన్నారు. ఈక్విటీ మార్కెట్లే కాకుండా క‌మోడిటీ, మెట‌ల్‌, క్రూడాయిల్ ధ‌ర‌లు కూడా కుప్ప‌కూలాయ‌ని ఆయ‌న తెలిపారు. 

ప్ర‌పంచ దేశాల‌తో పోల్చితే భార‌త్‌పై ప్ర‌భావం ప‌రిమితంగానే ఉంటుంది. ఇన్వెస్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉంటూ మార్కెట్లో పాల్గొనాల్సి ఉంటుంద‌ని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయ‌ర్ అన్నారు.

టిసిఎస్ చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్‌గా ఆర్తి సుబ్ర‌మ‌ణియ‌న్‌

టాటా గ్రూప్‌లోని ప్ర‌ధాన కంపెనీల్లో ఒక‌టి, సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం అయిన టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టిసిఎస్‌) ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌, ప...