- 2% మేరకు లాభపడిన సెన్సెక్స్, నిఫ్టీ
- సుంకాల పోటుతో ఏర్పడిన నష్టాలన్నీ భర్తీ
స్టాక్ మార్కెట్లో అద్భుతమైన ర్యాలీ చోటు చేసుకుంది. ఈక్విటీ పెట్టుబడులకు సూచికగా పరిగణించే సెన్సెక్స్, నిఫ్టీ 2% మేరకు దూసుకుపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలక్ర్టానిక్ వస్తువులపై సుంకాలు సడలించడంతో పాటు ఆటోమొబైల్స్‌పై కూడా సుంకాలు సవరించనున్నట్టు ఇచ్చిన సంకేతం మార్కెట్లను పరుగులు తీయించింది. ట్రంప్ ప్రకటనతో ప్రపంచంలోని కీలక మార్కెట్లన్నింటిలోనూ ర్యాలీ ఏర్పడింది. సెన్సెక్స్ 1577.63 పాయింట్ల లాభంతో 76,734.89 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1750.37 పాయింట్లు లాభపడి 76,907.63 పాయింట్ల వరకు కూడా వెళ్లింది. ఎన్ఎస్ఇ ప్రధాన సూచీ నిఫ్టీ 500 పాయింట్ల మేరకు లాభపడి 23,328.55 వద్ద ముగిసింది. బిఎస్ఇ స్మాల్‌క్యాప్ సూచీ 3.21%, మిడ్‌క్యాప్ సూచీ 3.02% లాభపడ్డాయి. బిఎస్ఇలోని సెక్టోరల్ సూచీలన్నీ కూడా లాభాలతోనే ముగిశాయి.
ఇన్వెస్టర్ల సంపద రూ.18.40 లక్షల కోట్లు వృద్ధి
స్టాక్ మార్కెట్లో ఏర్పడిన ర్యాలీతో వరుస రెండు రోజుల్లో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.18,42,028.91 కోట్లు పెరిగి రూ.4,,12,24,362.13 కోట్ల వద్ద (4.81 లక్షల కోట్ల డాలర్లు) స్థిరపడింది.
- విదేశీ ఇన్వెస్టర్లు శుక్రవారం రూ.2519.03 కోట్ల విలువ గల షేర్లు విక్రయించారు.
ట్రంప్ నష్టాలకు ట్రంప్‌తోనే భర్తీ
అమెరికా ప్రతీకార సుంకాలకు పాల్పడిన కారణంగా ముందు వారంలో ఏర్పడిన మార్కెట్ కల్లోలంలో ఏర్పడిన నష్టాలన్నీ తాజా ర్యాలీతో తుడిచిపెట్టుకుపోయాయి. ఏప్రిల్ 2వ తేదీన ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటన అనంతరం నాలుగు వరుస ట్రేడింగ్ దినాల్లో సెన్సెక్స్ భారీ నష్టాలు నమోదు చేసింది. ఏప్రిల్ 2-7 తేదీల మధ్యన సెన్సెక్స్ 3479.54 పాయింట్లు (4.54%) నష్టపోయింది. 8వ తేదీన కాస్తంత పునరుజ్జీవం సాధించిన సెన్సెక్స్ 9వ తేదీన మళ్లీ దిగజారింది. మొత్తం మీద ఏప్రిల్ 2-15 తేదీల మధ్య కాలంలో సెన్సెక్స్ నికరంగా 117.45 పాయింట్లు లాభపడింది. ఈ మధ్య కాలంలో రెండు రోజులు మార్కెట్‌కు సెలవులు వచ్చాయి. 10న మహావీర్ జయంతి, 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సెలవు దినాలు కావడంతో మార్కెట్ పని చేయలేదు. తాజా ర్యాలీతో నిఫ్టీ కూడా ఏప్రిల్ 2వ తేదీ నాటి ముగింపు స్థాయి 23,332.35 పాయింట్లకు చేరువకు వచ్చింది.
No comments:
Post a Comment