Thursday, April 10, 2025

టిసిఎస్ చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్‌గా ఆర్తి సుబ్ర‌మ‌ణియ‌న్‌

టాటా గ్రూప్‌లోని ప్ర‌ధాన కంపెనీల్లో ఒక‌టి, సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం అయిన టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టిసిఎస్‌) ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌, ప్రెసిడెంట్‌, చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్‌గా (సీఓఓ) ఆర్తి సుబ్ర‌మ‌ణియ‌న్ నియ‌మితుల‌య్యారు. ఈ ఏడాది మే 1 నుంచి ఐదేళ్ల కాలానికి ఆ నియామ‌కం వ‌ర్తిస్తుంది. "ఆర్తి సుబ్ర‌మ‌ణియ‌న్‌ను సీఓఓగా నియ‌మించేందుకు నామినేష‌న్‌, రెమ్యూనిరేష‌న్ క‌మిటీ సిఫార‌సుల మేర‌కు డైరెక్ట‌ర్ల బోర్డు ఆమోద‌ముద్ర వేసింది. 2025 మే 1 నుంచి  2030 ఏప్రిల్ 30 వ‌ర‌కు ఆమె ఆ ప‌ద‌విలో ఉంటారు.  వాటాదారుల ఆమోదానికి లోబ‌డి ఈ నిర్ణయం ఉంటుంది" అని టిసిఎస్ నియంత్ర‌ణ సంస్థ‌ల‌కు పంపిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కంపెనీ తెలియ‌చేసిన ఆమె ప్రొఫైల్ ప్ర‌కారం ఆర్తి టాటా గ్రూప్‌న‌కు చెందిన పెట్టుబ‌డుల హోల్డింగ్ కంపెనీ టాటా ఎంట‌ర్‌ప్రైజెస్ గ్రూప్ చీఫ్ డిజిట‌ల్ ఆఫీస‌ర్‌గా ఉన్నారు. టెక్నాల‌జీ, ఆప‌రేష‌న్స్ విభాగాల్లో ఆమెకు అపార‌మైన అనుభవం ఉంది. టాటా గ్రూప్ కంపెనీలు డిజిట‌ల్ టెక్నాల‌జీలు ఆక‌ళింపు చేసుకుని నిర్వ‌హ‌ణాప‌ర‌మైన సామ‌ర్థ్యం, పోటీ సామ‌ర్థ్యం సాధించ‌డంలో ఆమె కీల‌క పాత్ర పోషించారు. కార్య‌నిర్వ‌హ‌ణాప‌ర‌మైన బాధ్య‌త‌ల‌తో పాటు  టాటా గ్రూప్‌లో ఆమె ఎన్నో కీల‌క‌మైన బోర్డు ప‌ద‌వులు నిర్వ‌హించారు. టిసిఎస్ డైరెక్ట‌ర్‌గాను;  టాటా కేపిట‌ల్ లిమిటెడ్ డైరెక్ట‌ర్‌గాను; ఇన్ఫినిటీ రిటైల్ డైరెక్ట‌ర్‌గాను కూడా ఉన్నారు. మూడు ద‌శాబ్దాల‌కు పైగా టాటా గ్రూప్‌తో ఆమెకు గ‌ల సుదీర్ఘ అనుబంధంలో ఎన్నో ప్ర‌గ‌తిశీల పాత్ర‌ల్లో ప‌ని చేశారు. టిసిఎస్‌లోని రిటైల్‌, సిపిజి బిజినెస్ యూనిట్ డెలివ‌రీ విభాగం హెడ్‌గా ఉన్న ఆమె వ్యూహాత్మ‌క ఖాతాలు, కీల‌క క్ల‌యింట్లతో సంబంధాలు, క‌స్ట‌మ‌ర్ సంతృప్తి సాధ‌నల‌కు సార‌థ్యం వ‌హించారు. ఆమె వ‌రంగ‌ల్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో కంప్యూట‌ర్ సైన్స్‌లో బాచిల‌ర్ డిగ్రీ పొందారు. అమెరికాకు చెందిన క‌న్సాస్‌ యూనివ‌ర్శిటీలో ఇంజ‌నీరింగ్ మేనేజ్‌మెంట్ విభాగంలో మాస్ట‌ర్స్ డిగ్రీ చేశారు.

No comments:

Post a Comment

ఈక్విటీ మార్కెట్లో ర్యాలీ

- 2% మేర‌కు లాభ‌ప‌డిన సెన్సెక్స్, నిఫ్టీ - సుంకాల పోటుతో ఏర్ప‌డిన న‌ష్టాల‌న్నీ భ‌ర్తీ  స్టాక్ మార్కెట్లో అద్భుత‌మైన ర్యాలీ చోటు చేసుకుంది. ...